రిలయన్స్ రికార్డు ఆదాయం
ABN , Publish Date - Jul 18 , 2026 | 05:51 AM
మార్కెట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) శుక్రవారం విడుదల చేసిన ఆర్థిక ఫలితాలు మార్కెట్ వర్గాల అంచనాలను మించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27) జూన్‌తో ముగిసిన...
జూన్ త్రైమాసికంలో రూ.3,11,850 కోట్లు జూ రూ.3 లక్షల కోట్లు దాటడం ఇదే తొలిసారి
ఓ2సీ, టెలికాం, ఆయిల్ అండ్ గ్యాస్, మీడియా వ్యాపార విభాగాలు జిగేల్
లాభం రూ.20,946 కోట్లు .. 22ు తగ్గుదల
ముంబై: మార్కెట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) శుక్రవారం విడుదల చేసిన ఆర్థిక ఫలితాలు మార్కెట్ వర్గాల అంచనాలను మించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27) జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికానికి (క్యూ1) ఆర్‌ఐఎల్ రూ.20,946 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం (2025-26)లో ఇదే కాలానికి నమోదైన రూ.26,994 కోట్ల లాభంతో పోలిస్తే 22 శాతం తగ్గింది. అయితే, ఏషియన్ పెయింట్స్‌లో తమ వాటా విక్రయం ద్వారా 2025-26 క్యూ1లో రూ.8,924 కోట్ల ఏకకాల లాభం సమకూరిందని, అందుకే ఈ క్యూ1 లాభాన్ని వార్షిక ప్రాతిపదికన పోలిస్తే భారీగా తగ్గినట్లు కనిపిస్తోందని రిలయన్స్ పేర్కొంది. ఏకకాల లాభాన్ని మినహాయిస్తే..వార్షిక ప్రాతిపదికన ఈ క్యూ1 లాభంలో దాదాపు 16 శాతం వృద్ధి నమోదయ్యేది. అలాగే, మార్చితో ముగిసిన త్రైమాసికంలో నమోదైన రూ.16,971 కోట్ల లాభంతో పోలిస్తే మాత్రం 23.42 శాతం వృద్ధి నమోదైంది.
ఈ క్యూ1లో ఆర్‌ఐఎల్‌కు వ్యాపార కార్యకలాపాల ద్వారా సమకూరిన ఆదాయం వార్షిక ప్రాతిపదికన 25.41 శాతం, త్రైమాసిక ప్రాతిపదికన 4.43 శాతం వృద్ధితో రూ.3,11,850 కోట్లకు చేరుకుంది. కంపెనీ త్రైమాసిక ఆదాయం రూ.3 లక్షల కోట్ల మైలురాయిని దాటడం ఇదే తొలిసారి. కంపెనీ ప్రధాన వ్యాపారమైన ఆయిల్ టు కెమికల్స్ (ఓ2సీ)తోపాటు టెలికాం, ఆయిల్ అండ్ గ్యాస్, మీడియా వ్యాపార విభాగాలు కూడా మంచి పనితీరును కనబరచడంతో పాటు ఆదాయంలో రెండంకెల వృద్ధిని నమోదు చేయడం ఇందుకు దోహదపడింది. 2025-26 క్యూ1లో కంపెనీ రాబడి రూ.2,48,660 కోట్లుగా నమోదైంది. జూన్ చివరినాటికి రిలయన్స్ నికర రుణభారం రూ.1.23 లక్షల కోట్లుగా ఉంది.
ఓ2సీ
ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో కంపెనీకి చెందిన చమురు శుద్ధి, పెట్రో కెమికల్స్ వ్యాపారాల ఆదాయం వార్షిక ప్రాతిపదికన 30.4 శాతం వృద్ధితో ఆల్‌టైం రికార్డు స్థాయి రూ.2,01,803 కోట్లకు ఎగబాకింది. గడిచిన మూడు నెలల్లో ముడి చమురు ధరలు ఏకంగా 54 శాతం మేర పెరగడంతో చమురు శుద్ధి వ్యాపార మార్జిన్లు భారీగా పుంజుకోవడం ఇందుకు దోహదపడింది.
ఆయిల్ అండ్ గ్యాస్
క్యూ1లో ఈ విభాగ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 3.2 శాతం పెరిగి రూ.6,298 కోట్లకు చేరుకుంది. ఎబిటా 0.5 శాతం వృద్ధితో రూ.4,973 కోట్లుగా నమోదైంది. కేజీ బేసిన్ నుంచి వెలికితీసిన గ్యాస్‌పై ఆదాయం పెరగడం ఇందుకు తోడ్పడింది.
జియో ప్లాట్‌ఫామ్స్
జూన్ త్రైమాసికంలో జియో ప్లాట్‌ఫామ్స్ నికర లాభం 9.2 శాతం పెరిగి రూ.7,764 కోట్లకు చేరగా.. ఆదాయం 11.8 శాతం వృద్ధితో రూ.39,173 కోట్లకు పెరిగింది. రిలయన్స్ జియో టెలికాం వినియోగదారుల నుంచి సగటు ఆదాయం (ఆర్పూ) 3.3 శాతం పెరుగుదలతో 215.6 చేరుకుంది. జూన్ చివరి నాటికి కంపెనీ వినియోగదారుల సంఖ్య 53.3 కోట్లకు పెరిగింది.
రిలయన్స్ రిటైల్
సమీక్షా కాలానికి ఈ వ్యాపార విభాగ స్థూల ఆదాయం వార్షిక ప్రాతిపదికన 7.4 శాతం పెరిగి రూ.90,408 కోట్లకు చేరినప్పటికీ, నికర లాభం మాత్రం 14.2 శాతం క్షీణించి రూ.2,806 కోట్లకు పడిపోయింది.
జియో స్టార్
ఈ మీడియా, ఓటీటీ వ్యాపార విభాగం ఆదాయం 14 శాతం పెరుగుదలతో రూ.10,946 కోట్లకు చేరగా.. లాభం 14.5 శాతం వృద్ధితో రూ.665 కోట్లకు ఎగబాకింది. జియోహాట్‌స్టార్ ఓటీటీ యాప్ మంత్లీ యాక్టివ్ యూజర్ల సగటు ఆల్‌టైం రికార్డు స్థాయి 53 కోట్లకు చేరుకుంది.
రిలయన్స్‌లో ప్రమోటర్ల వాటా పెంపు
రూ.9,000 కోట్లతో 0.5% వాటా షేర్ల కొనుగోలు
రిలయన్స్ ఇండస్ట్రీ్‌సలో ప్రమోటర్ గ్రూప్ తన వాటాను మరింత పెంచుకుంది. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.8,500-9,000 కోట్లతో దాదాపు 0.5 శాతం వాటాకు సమానమైన షేర్లను ఓపెన్ మార్కెట్ నుంచి కొనుగోలు చేసింది. దాంతో రిలయన్స్‌లో ప్రమోటర్ల వాటా జూన్ 30 నాటికి 50.48 శాతానికి చేరుకుంది. మార్చి చివరినాటికి ఇది దాదాపు 50 శాతంగా ఉంది. సెబీ నిబంధనల ప్రకారం తప్పనిసరి ఓపెన్ ఆఫర్ ప్రకటించాల్సిన అవసరం లేకుండా ప్రమోటర్లు పరిమితికి లోబడి కంపెనీలో వాటాను క్రమంగా పెంచుకున్నట్లు రిలయన్స్ తెలిపింది.
ఇవి కూడా చదవండి
తప్పిపోయిన 35 ఏళ్ల తర్వాత.. అమ్మకు దగ్గరైన కూతురు