చరిత్ర సృష్టించనున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. ఎవరికీ సాధ్యంకాని రికార్డు..
ABN , Publish Date - Jan 30 , 2026 | 04:05 PM
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026 ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. ఆమె వరుసగా తొమ్మిదవసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలోనే ఆమె ఓ అరుదైన రికార్డును సృష్టించబోతున్నారు.
Union Budget 2026: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026 ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. ఆమె వరుసగా తొమ్మిదవసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. సామాన్యుల నుంచి వ్యాపారవేత్తల వరకు అందరూ ఈ బడ్జెట్ కోసం ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.అస్థిర భౌగోళిక, రాజకీయ పరిస్థితుల మధ్య ఆర్థిక వృద్ధిని పెంచే లక్ష్యంతో సంస్కరణ చర్యలు బడ్జెట్‌లో ఉంటాయని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ఇదే సమయంలో నిర్మలా సీతారామన్ ఓ అరుదైన రికార్డును సృష్టించబోతున్నారు. ఒకే ప్రధానమంత్రి పదవీకాలంలో తొమ్మిది సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఏకైక ఆర్థిక మంత్రిగా సీతారామన్ చరిత్ర సృష్టించబోతున్నారు.
భారతదేశంలో మొట్టమొదటి బడ్జెట్‌ను బ్రిటీష్ పాలనలో ప్రవేశపెట్టారు. దీనిని ఆర్థిక మంత్రి జేమ్స్ విల్సన్ 1860 ఏప్రిల్ 7న చదివారు. స్వాతంత్ర్యం తర్వాత, భారతదేశపు తొలి ఆర్థిక మంత్రి ఆర్.కె. షణ్ముఖం చెట్టి 1947 నవంబర్ 26న తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అయితే అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత మాజీ ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ సొంతం చేసుకున్నారు. వేరు వేరు సమయాల్లో 10 బడ్జెట్‌లను దేశాయ్ పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టారు. 1959-1964లో ఆర్థిక మంత్రిగా దేశాయ్ మొత్తం 6 బడ్జెట్‌లను, 1967-1969 మధ్య 4 బడ్జెట్‌లను పార్లమెంట్ లో చదివారు.
ఆ తర్వాత మాజీ ఆర్థిక మంత్రులు పి. చిదంబరం, ప్రణబ్ ముఖర్జీ వేర్వేరు ప్రధానుల హయాంలో వరుసగా తొమ్మిది, ఎనిమిది సార్లు బడ్జెట్‌లను ప్రవేశపెట్టారు. అయితే నిర్మలా సీతారామన్ మాత్రం ఒకే ప్రధాని హయాంలో వరుసగా తొమ్మిది బడ్జెట్‌లను ప్రవేశపెట్టి, వరుసగా అత్యధిక బడ్జెట్‌లను ప్రవేశపెట్టిన రికార్డును క్రియేట్ చేయనున్నారు. 2019లో ప్రధానమంత్రి మోదీ రెండవసారి గెలిచినప్పుడు, ఆమె భారతదేశపు మొట్టమొదటి పూర్తికాల మహిళా ఆర్థిక మంత్రిగా నియమితులయ్యారు. 2024లో మోదీ మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆమెను ఆర్థిక మంత్రిగా కొనసాగించారు. ఇప్పటివరకు, ఆమె ఫిబ్రవరి 2024లో తాత్కాలిక బడ్జెట్‌తో సహా మొత్తం ఎనిమిది వరుస బడ్జెట్‌లను ప్రవేశపెట్టారు.
ఇవీ చదవండి:
అంతకంతకూ పెరుగుతున్న పసిడి, వెండి ధరలు! రోజుకో కొత్త రికార్డు..
మూడో అతిపెద్ద విమాన మార్కెట్‌గా భారత్