దడ పుట్టిస్తున్న పసిడి! చరిత్రలో తొలిసారిగా 5.5 ట్రిలియన్ డాలర్ల హెచ్చుతగ్గులు
ABN , Publish Date - Jan 30 , 2026 | 12:44 PM
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గురువారం బంగారం మార్కెట్ విలువ 5.5 ట్రిలియన్ డాలర్ల మేర హెచ్చుతగ్గులకు లోనైంది. ఈ ఉదంతం ప్రస్తుతం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. కమోడిటీ మార్కెట్స్‌లో నెలకొన్న ఒత్తిడికి ఇది సంకేతమని మార్కెట్ వర్గాలు కామెంట్ చేస్తున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం ఎక్కడ చూసినా బంగారం, వెండి ధరలపై చర్చే! సామాన్యుల నుంచి బడా ఇన్వెస్టర్లు, వ్యవస్థాగత మదుపర్ల వరకూ అన్ని వర్గాల వారినీ పసిడి ధరల పరుగు ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఏ రోజు ధర ఎంత పెరుగుతుందో? ఎంత తగ్గుతుందో? అసలు పసిడిపై పెట్టుబడికి ఇది సరైన సమయమో కాదో తెలియక సామాన్యుల తలకిందులవుతున్నారు. అయితే, చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా గురువారం బంగారం మార్కెట్ విలువ తీవ్ర హెచ్చుతగ్గులకు లోనైందని స్టాక్ మార్కెట్ వ్యవహారాల కామెంటరీ వేదిక ‘ది కొబేసీ లెటర్’ నెట్టింట పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది.
‘ది కొబేసీ లెటర్’ చేసిన ట్వీట్ ప్రకారం, గురువారం ఉదయం 9.30 గంటల నుంచి 10.25 గంటల మధ్య (అమెరికా కాలమానం ప్రకారం) బంగారం మార్కెట్ విలువ ఒక్కసారిగా 3.2 ట్రిలియన్ డాలర్ల మేర పడిపోయింది. ఆ తరువాత క్రమంగా కోలుకుని మార్కెట్స్ క్లోజ్ అయ్యే సమయానికి కనిష్ఠ స్థితి నుంచి 2.3 ట్రిలియన్ డాలర్ల మేర ఎగబాకింది. అంటే.. ఒక్క సెషన్‌లోనే బంగారం మార్కెట్ క్యాపిటలైజేషన్ హెచ్చుతగ్గుల విలువ 5.5 ట్రిలియన్ డాలర్లను చేరింది.
ఎందుకీ అనూహ్య మార్పులు?
బంగారానికి ఉన్న వాస్తవ డిమాండ్‌కు మించి ధరల్లో ప్రస్తుతం హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. భౌగోళిక అనిశ్చితులు, డాలర్ బలహీనత, అమెరికా వడ్డీ రేట్లపై అనిశ్చితి వంటి వాటితో పాటు ఇతర కీలక అంశాలు ధరలను ప్రభావితం చేస్తున్నాయని అంటున్నారు.
ముఖ్యంగా వ్యవస్థాగత మదుపర్లు కమోడిటీ మార్కెట్స్‌పై దృష్టిపెట్టడం, ఆల్గోరిథమ్-ఆధారిత ట్రేడింగ్ పెరగడం, బంగారం హెచ్చుతగ్గుల ఆధారంగా డెరివేటివ్ మార్కెట్స్‌లో కూడా ట్రేడింగ్ అధికమవడంతో పసిడి ధరలు అంచనాలకు మించి హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి.
పసిడితో పాటు వెండి, ప్లాటినమ్, పెలాడియం వంటి విలువైన లోహాలన్నీ ఇదే స్థాయిలో ఒడిదుడుకులకు లోనుకావడం కమోడిటీ మార్కెట్స్‌లో ఒత్తిడికి సూచిక అని విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా బంగారం ధరలకు ఈ ఏడాది బ్రేకులు ఉండకపోవచ్చని ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ గోల్డ్‌మన్ శాక్స్ అంచనా వేస్తోంది. అంతర్జాతీయ మార్కెట్స్‌లో ఔన్స్ మేలిమి బంగారం ధర 6 వేల డాలర్ల మార్కు దాటొచ్చనేది మెజారిటీ మార్కెట్ విశ్లేషకుల అంచనా.
ఇవీ చదవండి:
మైక్రోసాఫ్ట్‌కు షాక్.. 424 బిలియన్ డాలర్లు ఆవిరి!
ఒక్కసారిగా సీన్ రివర్స్! భారీగా తగ్గిన బంగారం ధర