Share News

మైక్రోసాఫ్ట్‌కు షాక్.. 424 బిలియన్ డాలర్లు ఆవిరి!

ABN , Publish Date - Jan 30 , 2026 | 11:00 AM

మైక్రోసాఫ్ట్ షేర్ విలువ గురువారం ఏకంగా 12 శాతం మేర పతనమైంది. సంస్థ మార్కెట్ విలువ ఈ స్థాయిలో పతనం కావడం ఇదే తొలిసారి. మార్కెట్‌ క్యాప్‌లో ఏకంగా 424 బిలియన్ డాలర్లు తుడిచిపెట్టుకుపోయాయి.

మైక్రోసాఫ్ట్‌కు షాక్.. 424  బిలియన్ డాలర్లు ఆవిరి!
Microsoft Shares Crash

ఇంటర్నెట్ డెస్క్: ఏఐపై భారీగా పెట్టుబడులు పెడుతున్న దిగ్గజ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్‌కు ఎదురుదెబ్బ తగిలింది. గురువారం సంస్థ షేర్లు ఏకంగా 12 శాతం మేర పతనమయ్యాయి. ఒక్క రోజులోనే సంస్థ మార్కెట్ విలువలో ఏకంగా 424 బిలియన్ డాలర్లకు పైగా తుడిచిపెట్టుకుపోయింది. 2020 మార్చ్ తరువాత సంస్థ షేర్లు ఒక్కరోజులో ఈ స్థాయిలో పతనాన్ని చవి చూడటం ఇదే తొలిసారి. జీపీయూ చిప్స్ తయారీ సంస్థ ఎన్‌విడియా గతేడాది జనవరిలో రికార్డు స్థాయి నష్టాలను చవి చూసిన విషయం తెలిసిందే. చైనా ఏఐ చాట్‌బాట్ డీప్ సీక్ విడుదల తరువాత ఎన్‌విడియా షేర్లు భారీగా పతనం కావడంతో సంస్థ మార్కెట్ విలువ ఒక్క రోజులో 593 బిలియన్ డాలర్ల మేర తగ్గింది.

షేర్ల విలువ పతనం.. కారణం ఇదీ

ఏఐపై మైక్రోసాఫ్ట్ పెడుతున్న భారీ పెట్టుబడులపై ఆందోళనకు తోడు సంస్థ క్లౌడ్ విభాగం (అజూర్) పనితీరు నెమ్మదించడంతో మదుపర్లు అమ్మకాలకు తెరతీశారు. దీంతో షేర్ విలువ భారీ స్థాయిలో పతనమైందని నిపుణులు చెబుతున్నారు. టెక్ కంపెనీలు ఏఐపై భారీగా పెట్టుబడులు పెడుతున్న వైనంపై ఇన్వెస్టర్లు చాలా కాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడులకు తగిన రాబడిని సాధించాలని ఒత్తిడి పెంచుతున్నారు. ఇక ఇటీవల ముగిసిన త్రైమాసికంలో మైక్రోసాఫ్ట్ ఏఐ పెట్టుబడులు ఏకంగా 66 శాతం మేర పెరిగి 37.5 బిలియన్ డాలర్లకు చేరాయి. క్లౌడ్, ఏఐ విభాగాల్లోకి సంస్థ ఈ పెట్టుబడులను మళ్లించింది.


మైక్రోసాఫ్ట్ అజూర్ క్లౌడ్ కంప్యూటింగ్ విభాగం వృద్ధి తాజా త్రైమాసికంలో నెమ్మదించడం ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేసింది. ఏఐకి వాణిజ్య పరంగా ఉన్న డిమాండ్‌కు ఈ విభాగమే ప్రధాన సూచిక. ‘ ఇప్పటివరకూ పెట్టిన పెట్టుబడులకు తగిన స్థాయిలో రాబడి లేదన్న అంచనాలు సంస్థ షేర్ విలువపై ప్రతికూల ప్రభావం చూపించాయి’ అని ఒక విశ్లేషకుడు వ్యాఖ్యానించారు.

అయితే, ఏఐ డిమాండ్‌కు అనుగుణంగా కంప్యూటింగ్ మౌలిక వసతుల కల్పనలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని మైక్రోసాఫ్ట్ కూడా అంగీకరించింది. తమ జీపీయూ యూనిట్లను అన్నిటినీ అజూర్ విభాగానికి కేటాయించి ఉంటే 40 శాతం వృద్ధి నమోదై ఉండేదని మైక్రోసాఫ్ట్ ఫైనాన్స్ చీఫ్ ఉద్యోగులకు రాసిన అంతర్గత లేఖలో పేర్కొన్నారు.


ఇవీ చదవండి:

ఒక్కసారిగా సీన్ రివర్స్! భారీగా తగ్గిన బంగారం ధర

బడ్జెట్ 2026.. కొత్త పన్ను విధానంలో మరిన్ని మార్పులు రానున్నాయా?

Updated Date - Jan 30 , 2026 | 12:43 PM