Share News

బడ్జెట్‌ 2026: దంపతులకు నిర్మలమ్మ గుడ్ న్యూస్.. బడ్జెట్‌లో ట్యాక్స్ ఫైలింగ్‌పై కీలక ప్రకటన..?

ABN , Publish Date - Jan 30 , 2026 | 03:16 PM

మరో రెండు రోజుల్లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్-2026ను ప్రవేశపెట్టనుంది. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న ఈ బడ్జెట్ గురించి అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సారి బడ్జెట్‌లో దంపతులకు గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు సమాచారం..

బడ్జెట్‌ 2026: దంపతులకు నిర్మలమ్మ గుడ్ న్యూస్.. బడ్జెట్‌లో ట్యాక్స్ ఫైలింగ్‌పై కీలక ప్రకటన..?
Union Budget 2026

Union Budget 2026: మరో రెండు రోజుల్లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్-2026ను ప్రవేశపెట్టనుంది. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న ఈ బడ్జెట్ గురించి అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బడ్జెట్‌లో ప్రభుత్వం మధ్యతరగతి, పన్ను చెల్లింపుదారుల కోసం కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. ఇదే సమయంలో పెళ్లైన జంటలకు నిర్మలా సీతారామన్ గుడ్ న్యూస్ చెప్పొచ్చని సమాచారం. దంపతులకు సంబంధించిన ట్యాక్స్ విషయంలో కీలక మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. మరి ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం...


ప్రస్తుత బడ్జెట్ నిబంధనల ప్రకారం.. భార్యాభర్తలు తమ పన్నులను వేర్వేరుగా దాఖలు చేయాల్సి ఉంటుంది. అయితే బడ్జెట్‌-2026లో ప్రభుత్వం పెళ్లైన వారికి ఉమ్మడి ట్యాక్స్ రిటర్న్ కోసం కొత్త ఆప్షన్‌ను ప్రవేశపెట్టవచ్చు. ఇది ప్రధానంగా కుటుంబంలో ఒకరు మాత్రమే సంపాదిస్తున్న వారికి లేదా వారి ఆదాయంలో గణనీయమైన వ్యత్యాసం ఉన్న కుటుంబాలకు ఉపయోగపడనుంది. ఉమ్మడి పన్ను చెల్లింపు సందర్భాల్లో భార్యాభర్తల ఆదాయాలు కలిపి పన్ను లెక్కలు చేస్తారు. అలానే పన్ను మినహాయింపుల పరిధిని పెంచే అవకాశం ఉంది.


ఉమ్మడి పన్ను లాభాలు ఇవే..

బడ్జెట్‌-2026లో ఉమ్మడి పన్ను నిబంధన ఆమోదిస్తే పన్ను వ్యవస్థలో అతిపెద్ద మార్పు కావొచ్చు. ఇప్పటివరకు భార్యాభర్తలు తమ పొదుపులను విడివిడిగా క్లెయిమ్ చేయాల్సి వచ్చేది. కానీ కొత్త నిబంధనతో మొత్తం కుటుంబాన్ని ఒకే యూనిట్‌గా పరిగణిస్తారు. తదనుగుణంగా పన్ను లెక్కిస్తారు. దీంతో దంపతులకు భారీగా లాభం చేకూరుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

ఉమ్మడి పన్ను అమలు చేస్తున్న దేశాలివే:

భారతదేశంలో ఉమ్మడి పన్ను ఇంకా అమలు రాలేదు. కానీ పలు దేశాల్లో ఇప్పటికే అమలులో ఉంది. అమెరికా, జర్మనీ, పోర్చుగల్ వంటి ప్రధాన దేశాలలో ఈ వ్యవస్థ కొన్నేళ్లుగా అమల్లో ఉంది. అక్కడ మొత్తం కుటుంబాన్ని ఒకే యూనిట్‌గా పరిగణిస్తారు. అందుకు అనుగుణంగా పన్నును లెక్కిస్తారు. అదే విధంగా భారత్‌లో కూడా పన్ను భారం.. ఏ ఒక్క వ్యక్తిపైనా పడకుండా, మొత్తం కుటుంబానికి నిజమైన న్యాయం లభించేలా ఈ నమూనాను అమలు చేస్తే బాగుంటుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.


పరిమితులు, జాగ్రత్తలు..

ఉమ్మడి పన్ను విధానం అన్ని కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చకపోవచ్చని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భార్యాభర్తలిద్దరూ ఒకే రకమైన ఆదాయాన్ని ఆర్జించే సందర్భాలలో, ఉమ్మడి ఆదాయం వారిని అధిక పన్ను స్లాబ్‌లోకి చేర్చే అవకాశం ఉంది. ఉదాహరణకు, భార్యాభర్తలిద్దరూ ఒక్కొక్కరు రూ. 10 లక్షలు సంపాదిస్తే, స్లాబ్‌లు తగినంతగా సర్దుబాటు చేయకపోతే వారి మొత్తం ఆదాయం రూ. 20 లక్షలకు అధిక రేటును ఆకర్షిస్తుంది. 'అందుకే ఈ పన్ను అనేది ఐచ్ఛికంగా ఉండాలి' అని నిపుణలు అభిప్రాయ పడుతున్నారు. సింగిల్ యూనిట్ లేదా ఉమ్మడి పన్ను ఎంపిక పూర్తిగా పన్ను చెల్లింపుదారులపై ఆధారపడి ఉండాలి.


ఇవీ చదవండి:

మైక్రోసాఫ్ట్‌కు షాక్.. 424 బిలియన్ డాలర్లు ఆవిరి!

ఒక్కసారిగా సీన్ రివర్స్! భారీగా తగ్గిన బంగారం ధర

Updated Date - Jan 30 , 2026 | 04:29 PM