నెట్‌ఫ్లిక్స్‌లో 800 ఉద్యోగులకు త్వరలో స్వస్తి!
ABN , Publish Date - Oct 10 , 2026 | 02:09 PM
ప్రముఖ స్ట్రీమింగ్ కంపెనీ నెట్‌ఫ్లిక్స్ త్వరలో భారీగా లేఆఫ్‌లు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. సంస్థ ఉద్యోగుల్లో 5 శాతం లేదా దాదాపు 800 మంది ఉద్యోగులను బయటకు పంపేందుకు రంగం సిద్ధం చేసుకోనుందని ఓ మీడియా సంస్థ కథనం వెలువరించింది.
ఇంటర్‌నెట్ డెస్క్: ప్రముఖ స్ట్రీమింగ్ కంపెనీ నెట్‌ఫ్లిక్స్ త్వరలో భారీగా లేఆఫ్‌లు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. సంస్థ ఉద్యోగుల్లో 5 శాతం లేదా దాదాపు 800 మంది ఉద్యోగులను బయటకు పంపేందుకు రంగం సిద్ధం చేసుకోనుందని ఓ మీడియా సంస్థ కథనం వెలువరించింది. ఆ నివేదిక ప్రకారం కంపెనీ పునర్నిర్మాణంలో భాగంగా లేఆఫ్‌లు చేపట్టాలని నెట్‌ఫ్లిక్స్ నిర్ణయించింది. మరో రెండు లేదా మూడు రోజుల్లో ఉద్యోగాల కోత ప్రారంభం కానుంది. అయితే, దీనిపై నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ఇంకా స్పందించలేదు. ఏ విభాగాల్లో కోతలు ఎక్కువగా ఉంటాయనే దానిపైనా క్లారిటీ లేదు. 2025 చివరి వరకు ఆ సంస్థలో 16 వేల మంది పూర్తిస్థాయి ఉద్యోగులు ఉన్నారు. వారిలో 68 శాతం లేదా 10,900 మంది ఎక్కువగా అమెరికా, కెనడాలోనే ఉన్నారు.
కంపెనీ చివరిసారిగా 2022 మొదటి త్రైమాసికంలో ఉద్యోగాల కోత చేపట్టింది. అప్పుడు 2 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు తగ్గిపోవడంతో 450 మందిని కంపెనీ తొలగించింది. ఒక దశాబ్ద కాలంలో అంతమంది సబ్‌స్క్రైబర్లను కోల్పోవడం కంపెనీకి అదే మొదటిసారి. చందాదారులు తగ్గిపోవడంతో అప్పటి నుంచి సంస్థ క్రమంగా కోతలు చేపట్టడం ప్రారంభించింది. ఈ ఏడాది ఆరంభంలో డజన్ల సంఖ్యలో ఉద్యోగులను ఇంటికి పంపింది. కాగా మార్కెట్‌లో కంపెనీ వృద్ధి నమోదు చేస్తున్నా ఉద్యోగులను తొలగించిందని ఆ మీడియా సంస్థ పేర్కొంది. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో ప్రతి జియోగ్రాఫికల్ ప్రాంతంలో కంపెనీ రెండంకెల వృద్ధి నమోదు చేసిందని నెట్‌ఫ్లిక్స్ కో సీఈఓ టెడ్ సారండోస్ గత నెలలో ఓ సమావేశంలో తెలిపారు. అయినా తాము అనుకున్నంత వేగంగా సంస్థను విస్తరించలేకపోతున్నామని ఆయన చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ సర్వీస్ రూల్స్‌లో సవరణలు