స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
ABN , Publish Date - Jul 31 , 2026 | 09:24 AM
ఈరోజు భారత స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆసియా మార్కెట్ల నుంచి వస్తున్న మిశ్రమ సంకేతాల మధ్య బెంచ్ మార్క్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడింగ్ మొదలుపెట్టాయి.
ఆంధ్రజ్యోతి, జులై 31: ఈరోజు భారత స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆసియా మార్కెట్ల నుంచి వస్తున్న మిశ్రమ సంకేతాల మధ్య బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ రెండూ కూడా లాభాల్లో ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. నిన్నటి సెషన్‌లోని లాభాలను కొనసాగిస్తూ బీఎస్ఈ సెన్సెక్స్ 78,000 పాయింట్ల మార్కును తాకే ప్రయత్నం చేయగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 24,300 మార్కు కంటే ఎగువన ట్రేడ్ అవుతోంది.
బీఎస్ఈ సెన్సెక్స్ క్రితం ముగింపు 77,928.15 తో పోలిస్తే, ఈ ఉదయం 77,998.66 వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఆరంభంలోనే 52.35 పాయింట్లు (0.07%) లాభపడి 77,980.50 వద్ద ట్రేడయింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 24,361.45 వద్ద సానుకూలంగా ప్రారంభమై, ఆరంభ సమయంలో 24,380 మార్కును దాటింది.
నేటి ప్రారంభ ట్రేడింగ్‌లో బజాజ్ ఫైనాన్స్ షేర్లు ఏకంగా 6 శాతం దూసుకెళ్లి మార్కెట్‌ను ముందుకు తీసుకెళ్లాయి.. శ్రీరామ్ ఫైనాన్స్ వంటి ఫైనాన్షియల్ షేర్ల మద్దతుతో ముందుకు సాగుతున్నాయి. అయితే, నిఫ్టీ ఐటీ తీవ్ర విక్రయాల ఒత్తిడిని ఎదుర్కొంది. ప్రారంభంలోనే ఐటీ ఇండెక్స్ 3 శాతం కంటే ఎక్కువ క్షీణించింది. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ షేర్లు 4 శాతం వరకు పడిపోయి నష్టాల వరుసలో ముందంజలో నిలిచాయి. తర్వాత కొంతమేర కోలుకునే ప్రయత్నం చేస్తున్నాయి.
మార్కెట్ బ్రెడ్త్ పరంగా ఈ ఉదయం సుమారు 1,780 షేర్లు లాభపడగా, 973 షేర్లు నష్టపోయాయి. 142 షేర్లు స్థిరంగా ఉన్నాయి. నిఫ్టీలో బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఎటర్నల్, శ్రీరామ్ ఫైనాన్స్, జియో ఫైనాన్షియల్ వంటివి లాభాలబాటలో పయనిస్తుండగా, ఇన్ఫోసిస్, టీసీఎస్ (TCS), హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, విప్రో వంటి షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం
గురువారం అమెరికా మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. డౌ జోన్స్ 613.92 పాయింట్లు (1.2%) పెరిగి 52,208.06 వద్ద ముగిసింది. S&P 500 సూచీ 1.7% పెరిగి 7,437.64 వద్ద, నాస్‌డాక్ 2.8% పెరిగి 25,122.18 వద్ద ముగిశాయి.
మైక్రోసాఫ్ట్ 'అజూర్' క్లౌడ్ వ్యాపారంలో ఊహించని వృద్ధి నమోదవడంతో దాని షేర్లు ఏకంగా 16శాతం పెరిగాయి.. దీనివల్ల ఒక్క సెషన్‌లోనే కంపెనీ మార్కెట్ క్యాప్ దాదాపు $450 బిలియన్లు పెరిగింది.
అమెరికా మార్కెట్ల ర్యాలీ ప్రభావం ఆసియా మార్కెట్లపైనా కనిపించింది. AI డిమాండ్ పెరగడంతో ఎస్కే హైనిక్స్, శామ్‌సంగ్ షేర్లు పుంజుకుని దక్షిణ కొరియా కోస్పీ (Kospi) సూచీ 16శాతం కంటే ఎక్కువ దూసుకెళ్లి ట్రేడింగ్ కూడా తాత్కాలికంగా నిలిచిపోయింది. ఆస్ట్రేలియా S&P/ASX 200, హాంకాంగ్ హ్యాంగ్ సెంగ్ సూచీలు కూడా లాభాల్లో పయనిస్తున్నాయి.
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తోడు, క్యాస్పియన్ పైప్‌లైన్ కన్సార్షియం టెర్మినల్‌పై జరిగిన దాడితో చమురు సరఫరా ఆందోళనలు మళ్లీ పెరిగాయి. దీంతో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు $86 సమీపంలో గరిష్ట స్థాయిలోనే ట్రేడ్ అవుతోంది.
ఇవి కూడా చదవండి...
అడ్డుపడటం.. ఆపడం.. ఔను.. అంతా జగనే చేశారు!
మాజీ సీఎం జగన్ పెదనాన్న ఆనందరెడ్డి మృతి.. నేడు అంత్యక్రియలు
Read Latest AP News And Telugu News