అమెరికా మార్కెట్లను ముంచేసిన 'జాబ్స్ రిపోర్ట్'.. కుప్పకూలిన ఇండెక్స్‌లు
ABN , Publish Date - Jun 06 , 2026 | 09:08 AM
అమెరికా స్టాక్ మార్కెట్లలో వారంతాన తీవ్రమైన ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా నాస్‌డాక్ సూచీ గడిచిన ఏడాది కాలంలోనే అత్యంత దారుణమైన పతనాన్ని నమోదు చేసింది. అంచనాలను మించిన 'మే నెల జాబ్స్ రిపోర్ట్' మార్కెట్లను కుదిపేసింది.
న్యూయార్క్, జూన్ 6: అమెరికా స్టాక్ మార్కెట్లలో వారాంతాన తీవ్రమైన ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), సాంకేతిక రంగానికి చెందిన షేర్లు భారీగా అమ్ముడుపోవడంతో మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. ముఖ్యంగా నాస్‌డాక్ (Nasdaq) సూచీ గడిచిన ఏడాది కాలంలోనే అత్యంత దారుణమైన పతనాన్ని నమోదు చేసింది. అంచనాలను మించిన 'మే నెల జాబ్స్ రిపోర్ట్' మార్కెట్లలో వడ్డీ రేట్లు మరింత పెరుగుతాయనే భయాలను రేకెత్తించడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఈ క్రమంలో నాస్‌డాక్ సూచీ ఏకంగా 4.2 శాతం పడిపోయింది. S&P 500 2.6% నష్టపోయింది. ఫలితంగా గత 9 వారాలుగా వరుసగా సాగుతున్న లాభాల పరంపరకు బ్రేక్ పడినట్లైంది. Dow Jones కొంత నిలకడగా ఉన్నప్పటికీ, శుక్రవారం 1.3% నష్టంతో ముగిసింది.
ఐటీ, ఏఐ డిమాండ్‌పై అనుమానాలు.. టెక్ షేర్ల పతనం!
బుధవారం సెమీకండక్టర్ దిగ్గజం 'బ్రాడ్‌కామ్' (Broadcom) ప్రకటించిన బలహీనమైన ఫ్యూచర్ గైడెన్స్ మార్కెట్‌ను కలవరపెట్టింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో డిమాండ్ అంత వేగంగా పెరగకపోవచ్చనే భయాలు ఇన్వెస్టర్లలో మొదలయ్యాయి. దీని ప్రభావంతో ఎన్వీడియా (Nvidia) షేరు 6.2% పడిపోగా, బ్రాడ్‌కామ్ (Broadcom) షేరు 7.9% నష్టపోయింది. ఏఐ, చిప్స్ రంగానికి చెందిన ఇతర దిగ్గజ కంపెనీలైన మైక్రాన్ (Micron), మార్వెల్ (Marvell), ఇంటెల్ (Intel), ఎఎమ్‌డి (AMD), క్వాల్‌కామ్ (Qualcomm), ఆర్మ్ హోల్డింగ్స్ (ARM) షేర్లు ఏకంగా 10 శాతం లేదా అంతకంటే ఎక్కువ పతనమై ఊచకోతకు గురయ్యాయి.
మార్కెట్‌ను ముంచేసిన 'హాట్ జాబ్స్ రిపోర్ట్'
అమెరికా లేబర్ డిపార్ట్‌మెంట్ నివేదిక ప్రకారం.. మే నెలలో ఆర్థికవేత్తలు 80,000 ఉద్యోగాలు వస్తాయని అంచనా వేయగా, దానికి రెట్టింపు కంటే ఎక్కువగా 1,72,000 కొత్త ఉద్యోగాలు వచ్చాయి. జాబ్ మార్కెట్ బలంగా ఉండటంతో ద్రవ్యోల్బణం మళ్లీ పెరుగుతుందనే భయం ఇన్వెస్టర్లలో వ్యక్తమైంది. మరోవైపు, ఈ ఏడాది చివర్లో అమెరికా సెంట్రల్ బ్యాంక్ (Fed) వడ్డీ రేట్లను పెంచే అవకాశం 50% లోపు మాత్రమే ఉందని ట్రేడర్లు భావించారు. కానీ ఇప్పుడు సీఎమ్‌ఈ (CME) డేటా ప్రకారం, ఫెడ్ వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఏకంగా 70%కి పెరిగింది. 2026 అంతటా వడ్డీ రేట్లు అత్యధిక స్థాయిలోనే కొనసాగుతాయని ఇన్వెస్టర్లు అంచనాకి రావడం కూడా దీనికి కారణంగా చెబుతున్నారు. భవిష్యత్తులో భారీ లాభాలను అంచనా వేసే టెక్నాలజీ కంపెనీలపై వడ్డీ రేట్ల పెరుగుదల ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని భావించి కూడా టెక్ షేర్లలో భారీగా అమ్మకాలు జరిగాయంటున్నారు. అమెరికా మార్కెట్ల ప్రభావం సోమవారం భారత స్టాక్ మార్కెట్ల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయో చూడాలి.
ఈ వార్తలు కూడా చదవండి:
హాస్టళ్లకు, గురుకులాలకు గ్రేడ్‌లు
Read Latest AP News And Telangana News And International News And Telugu News