చురుగ్గా ‘నైరుతి’
ABN , Publish Date - Jun 06 , 2026 | 06:03 AM
రుతి రుతుపవనాలు కేరళం అంతా విస్తరించాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. దక్షిణాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని...
కేరళం రాష్ట్రవ్యాప్తంగా విస్తరణ
త్వరలోనే మిగిలిన రాష్ట్రాలకూ దక్షిణాదికి భారీ వర్ష సూచన: ఐఎండీ
న్యూఢిల్లీ, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): నైరుతి రుతుపవనాలు కేరళం అంతా విస్తరించాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. దక్షిణాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని శుక్రవారం వెల్లడించింది. కేరళం సహా లక్షద్వీప్, కర్ణాటక, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు ఇప్పటికే ప్రవేశించాయని, ప్రస్తుతం రుతువనాలు విస్తరణకు అనుకూలమైన వాతావరణం నెలకొని ఉందని ఐఎండీ వివరించింది. రాబోయే రోజుల్లో గోవా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌తో పాటు దక్షిణాదిలోని మిగిలిన ప్రాంతాలకూ విస్తరించనున్నాయని తెలిపింది. వీటి ప్రభావంతో దక్షిణాదిలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. కేరళం, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, లక్ష్యద్వీప్ అంతటా ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. తెలంగాణ, పరిసర ప్రాంతాల్లో గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించింది. తీరప్రాంతాలు, సమీప జిల్లాల్లో ప్రతికూల వాతావరణం ఉండొచ్చని అంచనా వేసింది. దేశంలోని వాయవ్య, మధ్య, తూర్పు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, భారీ గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఈశాన్య రాష్ట్రాల్లోనూ గణనీయమైన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. వాయవ్య, మధ్య భారతంలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
ఈ వార్తలు కూడా చదవండి
అమరావతిపై ఓర్వలేక విష ప్రచారం చేస్తున్నారు: దేవినేని ఉమామహేశ్వరరావు
పదవిగా కాదు.. బాధ్యతగా భావిస్తున్నా: లింగమనేని రమేశ్