Share News

హాస్టళ్లకు, గురుకులాలకు గ్రేడ్‌లు

ABN , Publish Date - Jun 06 , 2026 | 05:31 AM

ఆరోపణలకు తావివ్వకుండా రాష్ట్రంలో బీసీ హాస్టళ్లు, గురుకులాలను పకడ్బందీగా నిర్వహించాలని, పనితీరు ఆధారంగా వాటికి గ్రేడింగ్‌లు ఇస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్‌.సవిత అన్నారు.

హాస్టళ్లకు, గురుకులాలకు గ్రేడ్‌లు

  • సచివాలయ ఉద్యోగులను డిప్యుటేషన్‌పై నియమిస్తున్నాం

  • బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత

అమరావతి, జూన్‌ 5(ఆంధ్రజ్యోతి): ఆరోపణలకు తావివ్వకుండా రాష్ట్రంలో బీసీ హాస్టళ్లు, గురుకులాలను పకడ్బందీగా నిర్వహించాలని, పనితీరు ఆధారంగా వాటికి గ్రేడింగ్‌లు ఇస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్‌.సవిత అన్నారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయం నుంచి అన్ని జిల్లాల హాస్టల్‌ వార్డెన్లు, ఎంజేపీ స్కూళ్ల ప్రిన్సిపాళ్లు, ఏబీసీడబ్ల్యూఓలు, డీబీసీడబ్ల్యూఓలతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. గ్రేడింగ్‌ ఆధారంగా భవిష్యత్తులో చేపట్టబోయే బదిలీలు, పదోన్నతులకు ప్రాధాన్యమిస్తామని చెప్పారు. బీసీ హాస్టళ్లు, గురుకులాల్లో 142 మంది కుక్‌, కమాటీలను నియమించనున్నామని, సచివాలయాల నుంచి 224 మంది వీఆర్వోలను, మహిళా పోలీసులను డిప్యుటేషన్‌పై ప్రభుత్వం హాస్టళ్లకు కేటాయించిందని తెలిపారు. ఈ నెల 12 నుంచి ప్రారంభం కాబోయే నూతన విద్యాసంవత్సరం సందర్భంగా హాస్టళ్లను, గురుకులాలను సిద్ధం చేయాలని, పరిసరాలను, మరుగుదొడ్లను, తాగునీటి ట్యాంకులను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. ఆర్వో ప్లాంట్ల ఏర్పాటుతోపాటు కొత్త మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తిచేసి, అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి సవిత ఆదేశించారు. త్వరలో 1291 పారిశుధ్య సిబ్బందిని నియమించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఆరు ఎంజేపీ స్కూళ్లను జూనియర్‌ కళాశాలలుగా అప్‌గ్రేడ్‌ చేస్తున్నట్లు చెప్పారు. ఈ విద్యా సంవత్సరం నుంచే ఇంటర్‌ తరగతులు ప్రారంభిస్తామన్నారు. ఆత్మకూరు, వనిపెంట, నరసన్నకోట, గొలగమూడి, కొత్తవలస, కలికిరి ఎంజేపీ స్కూళ్లను జూనియర్‌ కళాశాలలుగా అప్‌గ్రేడ్‌ చేస్తున్నామన్నారు. బీసీ విద్యార్థులకు ఐఐటీ, నీట్‌కు శిక్షణ ఇచ్చేలా రెండు ఎక్స్‌లెన్స్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. 1400 మంది విద్యార్థులతో ఈ రెండు సెంటర్లను ఈ విద్యాసంవత్సరం నుంచే ప్రారంభించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా మరో పది ఎంజేపీ స్కూళ్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపామని, వాటికి త్వరలో అనుమతి రానుందని చెప్పారు.

Updated Date - Jun 06 , 2026 | 05:31 AM