‘మినిమలిస్ట్’ నగల మెరుపుల్!
ABN , Publish Date - Apr 19 , 2026 | 08:53 AM
అసలే ‘అక్షయ తృతీయ’... పసిడి ధరలు ఆకాశాన్ని అంటుతున్న వేళ... కొనాలా? వద్దా? అన్న మీమాంస అందరిలో. ఈ సందేహాలకు సమాధానంగా ‘మినిమలిస్ట్ జ్యువెలరీ’ పుట్టుకొచ్చింది.
అసలే ‘అక్షయ తృతీయ’... పసిడి ధరలు ఆకాశాన్ని అంటుతున్న వేళ... కొనాలా? వద్దా? అన్న మీమాంస అందరిలో. ఈ సందేహాలకు సమాధానంగా ‘మినిమలిస్ట్ జ్యువెలరీ’ పుట్టుకొచ్చింది. తక్కువ బంగారంతో, ఆకట్టుకునేలా తీర్చిదిద్దిన ఈ టైపు నగలు ప్రస్తుతం మార్కెట్ ట్రెండ్‌గా మారాయి. అన్ని వయసులవారికీ ఈ సరికొత్త డిజైన్లు తెగ నచ్చేస్తున్నాయి కూడా.
పదకొండు గంటలకు అనన్య పెళ్లి. గదిలో ముస్తాబవుతోంది. రవ్వల నెక్లెస్, గాజులు, లోలాకులు, పేద్ద కాసుల పేరు, లక్ష్మీదేవి పెండెంట్ ఉన్న రత్నాల హారం, నాలుగు వరుసల ముత్యాల దండ, బంగారు పద్మాల బిల్లలతో అల్లిన చోకర్... ఇలా ఆమె ముందు కళ్లు చెదిరే ఎన్నో ఆభరణాలు. ‘పెళ్లంటే మగువ జీవితంలో జరిగే అతి పెద్ద శుభకార్యం’ అని అన్నింటినీ ధరించమంది వాళ్ల అమ్మ. కానీ అనన్య మాత్రం బంగారు పద్మాల చోకర్ మాత్రమే వేసుకుని పెళ్లి పందిట్లోకి నడిచొచ్చింది. ఓ క్షణం విస్తుపోయినా... తమ కూతురు ‘మోడ్రన్ మహాలక్ష్మి’లా ఉందని తల్లిదండ్రులు మురిసిపోయారు. ఈ విధంగా... ఒకటో రెండో ఆభరణాలు ధరించి, సింపుల్‌గా అందరి దృష్టినీ ఆకట్టుకునేలా చేస్తున్నారు ఈ కాలం యువతులు. దీన్నే ‘మినిమలిస్ట్ జ్యువెలరీ’ ట్రెండ్ అంటున్నారు.
ఫ్యాషన్ పండితులు.
కాలం మారుతోంది. బంగారం ధరలూ రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అంతంత డబ్బు పెట్టి కొన్న ఆభరణాలను భద్రతల దృష్ట్యా ఎల్లకాలమూ లాకర్లలో పెట్టాలంటే ప్రాణం ఉసూరుమంటుంది. అందుకే తక్కువ బంగారంతో చేసినవి, ఇట్టే ఆకట్టుకునేలా ఉన్న వాటిని యువతులు రోజూ ధరించడానికి ఇష్టపడుతున్నారు.
ఫ్యాషన్ స్టేట్‌మెంట్...
‘మినిమలిస్టు జ్యువెలరీ’ కేవలం ఓ ట్రెండ్‌గానే కాదు... నేటి ఆధునిక జీవనంలో భాగమైన సరళత, నాణ్యత, రమ్యతలకు ప్రతిబింబంగా మారింది. వీటిని ధరించడం ద్వారా అటు మోడ్రన్‌గా కనిపించడంతో పాటు ప్రత్యేకమైన లుక్‌నూ సొంతం చేసుకోవచ్చు.
మినిమలిస్ట్ జ్యువెలరీలో కీలకమైన అంశాలివి...
రేఖాగణిత ఆకారాలు: వృత్తాలు, త్రిభుజాలు, చతురస్రాలు, శంఖు... తదితర ఆకారాలను ఈ నగలలో ఎక్కువగా చూడొచ్చు. ఇలాంటి ఆకృతుల్లో ఉంగరాలు, చెవి పోగులు, హారాలు, బ్రాస్లెట్లు... చాలా నాజూకుగా కనిపిస్తూ, మోడ్రన్ లుక్‌ను తెస్తాయి. ఔట్‌ఫిట్‌లలో భాగంగా కనిపిస్తాయి అంతేగానీ నగలుగా... డాబుసరిగా కనిపించవు.
రింగుల మీద రింగులు: ఓ వేలికి ఓ ఉంగరం అనేది నిన్నటి మాట, ఉంగరాల మీద ఉంగరాలు అనేది ‘మినిమలిస్ట్ జ్యువెలరీ’ మాట. ‘స్టాకబుల్ రింగ్స్’ ఈ ప్రత్యేక డిజైన్లలో ముఖ్యమైనది. ఈ ఉంగరాలు విభిన్నమైన లుక్‌ను తీసుకువస్తాయి. ఇందులో కూడా ప్లెయిన్‌గా, ప్యాటర్న్‌లు ఉన్న ఉంగరాలు డామినేట్ చేస్తున్నాయి.
బార్ నెక్లెస్‌లు: పసిడి ముద్దగా పోసిన కడ్డీల లాంటి నెక్లెస్‌లు ఈ జ్యువెలరీ డిజైన్లలో ముఖ్యమైనవి. ఈ కడ్డీలను ప్లెయిన్‌గా లేదా రత్నాలు, వజ్రాలు పొదుగుతూ అలంకరిస్తారు. వేరే నగల అవసరం లేకుండా ఇదొక్కటే వేసుకుంటే చాలు. చీర, చుడీదార్‌లకు నప్పుతాయి. పగలు లేదా సాయంత్రాల్లో కూడా వీటిని ధరించడానికి బాగుంటాయి.
సింగిల్ స్టడ్ చెవి దుద్దులు: ఓ ముత్యం... ఓ వజ్రం... ఓ పగడం పొదిగిన చెవి దుద్దులు ధరించి ఎప్పుడైనా చూశారా? ఇలాంటివి మీ లుక్‌కు మరింత అందాన్ని తీసుకువస్తాయి. మినిమలిస్ట్ డిజైన్ల చెవిపోగులు ఇలాగే ఉంటాయి. చూడడానికి సింపుల్‌గా, ఎలిగెంట్‌గా అనిపిస్తాయి.

తేలికైన హారాలు: మినిమలిస్ట్ నగలలో హారాలన్నీ చాలా సన్నగా ఉంటాయి. అందుకే ఒకటి కాకుండా మూడు నాలుగు వరుసల హారాలు వేసుకోవడం ఈ ట్రెండ్‌లో భాగం. పెండెంట్లు ఉన్నవీ, అవి లేకుండా కూడా ఉంటున్నాయి.
సిగ్నేచర్ పీస్: ఏదో వేడుక... నగలు ధరించాం అన్న ధోరణి నిన్నటి వరకూ సాగింది. నేడు మీరు ధరించిన నగలు మీ వ్యక్తిత్వానికి ప్రతిబింబాలు. మీ స్టయిల్ ఏమిటో చెప్పకనే చెప్పే స్టేట్‌మెంట్లు. ‘మినిమలిస్ట్ జ్యువెలరీ’ అంతా సిగ్నేచర్ పీస్‌లే. ఇందులో అన్నీ న్యూట్రల్ రంగులే. ఒకే తరహా కాకుండా బంగారం, రోజ్ గోల్డ్, వెండితో తయారుచేసిన ఆభరణాలను అభిరుచికి తగినట్టుగా ధరించొచ్చు. అందుకే ఆభరణాలు నేడు పర్సనల్ స్టయిల్‌లో భాగంగా మారాయి.
స్టయిల్ మాత్రమే కాదు...
ఒకప్పుడు బంగారు నగలని ఎప్పుడో పండగలు, శుభకార్యాల అప్పుడే ధరించాలని అనుకునేవారు. ఇప్పుడలా కాదు... ఉద్యోగినులే కాకుండా ఇంటర్ చదువుతోన్న అమ్మాయిలు కూడా ఓ రోజ్ గోల్డ్ ఉంగరం, దానికి సరిపడే బ్రాస్‌లెట్, పెండెంట్ ఉన్న సన్నని గొలుసు ధరించి కాలేజీలకు వెళుతున్నారు. నగలను తమ స్టయిల్‌కే కాదు, వ్యక్తిత్వానికి సంబంధించినదిగా వాళ్లు చెప్పకనే చెబుతున్నారు. ఇవన్నీ నాజూకైన డిజైన్లు, వీటిలో బంగారం శాతమూ తక్కువగా ఉండడం వల్ల వాళ్ల పెద్దవాళ్లు కూడా అభ్యంతరాలు చెప్పడం లేదు. అంతేకాదు కిట్టీ పార్టీలకు వెళ్లే గృహిణులు కూడా రకరకాల నగలను ధరిస్తున్నారు. ఓ రకంగా మినిమలిస్ట్ ధోరణి ఆభరణాల రూపకల్పనలో పెద్ద మార్పునే తీసుకువచ్చింది. లుక్ సింపుల్‌గా ఉంటుంది కానీ ధరించిన ఈ తరహా ఆభరణాలు... మీ గురించి ఎదుటివారికి వేనవేల మాటలు వినిపిస్తాయి. స్టయిల్ అంటే అదే మరి!
ప్రియాంక ఫిలాసఫీ
2026 ఆస్కార్ వేదికపై గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రాను చూసిన వాళ్లందరూ ‘వావ్’ అని ప్రశంసించారు. లగ్జరీ కలబోసిన ‘మినిమలిస్ట్ లుక్’లో ప్రియాంక మెరిసింది. ఆనాటి ఆమె ఆహార్యంలో కీలకమైనవి...
గాఢమైన నెక్లెస్
మ్యాచింగ్ చెవి పోగులు
వేళ్లకు తక్కువ ఉంగరాలు
పొడవాటి తెల్లని స్ట్రాప్‌లెస్ గౌను
తేలికపాటి మేకప్
అయితే ఆమె ఆహార్యంలో అందరినీ ఆకర్షించింది మాత్రం ‘బల్గారీ డైమండ్ నెక్లెస్’. వజ్రాలు, పచ్చల మధ్యలో 14 క్యారెట్ల మడగాస్కర్ సఫైర్‌ను ఉంచి, సర్పం మోడల్‌లో తీర్చిదిద్దిన ఆ నెక్లెస్ ఖరీదు తొమ్మిది కోట్ల రూపాయలు. చూడడానికి ఎంతో సింపుల్‌గా అనిపించినా, ‘లెస్ ఈజ్ మోర్’ అనే పవర్‌ఫుల్ ఫ్యాషన్ స్టేట్‌మెంట్‌ను తన ఆహార్యం ద్వారా ప్రియాంక తెలియజేశారు. ప్రస్తుతం ప్రపంచమంతా ఇదే ట్రెండ్ నడుస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest Telangana News and National News