2028 నాటికి వాణిజ్య వాహన మార్కెట్లో 10శాతం వాటా లక్ష్యం
ABN , Publish Date - Sep 04 , 2026 | 02:20 AM
భారత వాణిజ్య వాహన మార్కెట్లో 2027-28 నాటికి 10 శాతం వాటా చేజిక్కించుకోవాలని మహీంద్రా ట్రక్స్ అండ్ బసెస్, ఎస్‌ఎంఎల్ మహీంద్రా లక్ష్యంగా పెట్టుకుంది.
ఎస్‌ఎంఎల్ మహీంద్రా ప్రెసిడెంట్ వినోద్ సహాయ్
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): భారత వాణిజ్య వాహన మార్కెట్లో 2027-28 నాటికి 10 శాతం వాటా చేజిక్కించుకోవాలని మహీంద్రా ట్రక్స్ అండ్ బసెస్, ఎస్‌ఎంఎల్ మహీంద్రా లక్ష్యంగా పెట్టుకుంది. గురువారం నాడిక్కడ మార్కెట్లోకి మహీంద్రా బ్లేజో ఐ-ట్రక్‌ను విడుదల చేసిన సందర్భంగా కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, ప్రెసిడెంట్ వినోద్ సహాయ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం సంస్థ మార్కెట్ వాటా 7.2 శాతంగా ఉందన్నారు. కొత్త ఉత్పత్తులు, కార్యకలాపాల విస్తరణ ద్వారా వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి 10 శాతానికి, 2030-31 ఆర్థిక సంవత్సరానికి 12 శాతానికి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన చెప్పారు. గత ఏడాది ఎస్‌ఎంఎల్ ఇసుజులో 58.96 శాతం వాటాను మహీంద్రా చేజిక్కించుకుందని, డిసెంబరు నాటికి విలీన ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం వాణిజ్య వాహన మార్కెట్లో ఇరు సంస్థల వాటా 7.2 శాతం గా ఉండగా 2035-36 నాటికి 20 శాతానికి చేర్చాలని చూస్తున్నట్లు ఆయన చెప్పారు. రెండు సంస్థలు విలీనమైనప్పటికీ కంపెనీ బ్రాండ్లు యథాతథంగా మార్కెట్లో కొనసాగుతాయని తెలిపారు.
రూ.25-50 లక్షల శ్రేణిలో బ్లేజో ఐ-ట్రక్: కాగా ట్రక్కులు, హెవీ డ్యూటీ ట్రక్కుల విభాగంలో పట్టును చేజిక్కించునేందుకు మార్కెట్లోకి బ్లేజో ఐ-ట్రక్‌ను విడుదల చేసినట్లు వినోద్ సహాయ్ వెల్లడించారు. 320 హెచ్‌పీ ఎంపవర్ ఇంజన్‌తో కూడిన ఈ ట్రక్ ధరలు రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షల శ్రేణిలో ఉన్నాయని చెప్పారు.
మార్చి నాటికి ఎలక్ట్రిక్ బస్సు: ప్రస్తుతం మహీంద్రా ఎస్‌ఎంఎల్.. తొలుత ఉద్యోగులు, విద్యార్ధుల ట్రాన్స్‌పోర్ట్ కోసం ఎలక్ట్రిక్ బస్సులను తీసుకువచ్చేందుకు రెడీ అవుతోందని వినోద్ సహాయ్ తెలిపారు. మార్చి నాటికి ఈ బస్సులు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందన్నారు. కాగా లైట్ కమర్షియల్ వెహికల్ (ఎల్‌సీవీ) విభాగంలో ఎలక్ట్రిక్ ట్రక్కులను తీసుకురానున్నామని, రెండేళ్లలో ఇవి అందుబాటులోకి రావచ్చని సహాయ్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
2027 అక్టోబరు నుంచి భారత్ ఎన్‌క్యాప్ 2.0
Read Latest Telangana News And AP News And National News
And Telugu News