Share News

బడ్జెట్2026: ట్యాక్స్ పేయర్స్‌కు బిగ్ రిలీఫ్ రానుందా.?

ABN , Publish Date - Jan 31 , 2026 | 01:16 PM

ఫిబ్రవరి 1న ప్రవేశ పెట్టనున్న కేంద్ర ఆర్ధిక బడ్జెట్ 2026 కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో రాబోయే బడ్జెట్‌లో పన్ను వ్యవస్థను సరళీకృతం చేయడం, పాత చట్టం నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం-2025కి మారడంపై ప్రభుత్వం దృష్టి సారించనుందని సమాచారం.

బడ్జెట్2026: ట్యాక్స్ పేయర్స్‌కు  బిగ్ రిలీఫ్ రానుందా.?
Budget 2026 income tax

ఇంటర్నెట్ డెస్క్: ఆదివారం(ఫిబ్రవరి 1) ప్రవేశ పెట్టనున్న కేంద్ర ఆర్ధిక బడ్జెట్ 2026 కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా పన్ను చెల్లింపుదారులు తమకు ఊరట లభించేలా బడ్జెట్ ఉంటుందనే ఆశతో ఉన్నారు. వారి ఆశలు నిజం చేసే దిశగానే కేంద్రం బడ్జెట్ ఉండనుందని సమాచారం. పన్నుల విషయంలో కీలక మార్పులు జరగవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.


బడ్జెట్ 2026లో ఆదాయపు పన్ను నిబంధనలో పలు మార్పులు రానున్నాయి. ముఖ్యంగా ఉద్యోగులు, స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తులు, సీనియర్ సిటిజన్లకు లాభం చేకూరేలా ఈ మార్పులను కేంద్రం తీసుకువస్తుందని సమాచారం. పన్ను నిర్మాణాన్ని సరళీకృతం చేయడం, పన్ను విషయంలో భారాన్ని తగ్గించడం, పారదర్శకత, డిజిటల్ పన్ను వ్యవస్థను ఎంచుకోవడానికి ఎక్కువ మందిని ప్రోత్సహించడమే లక్ష్యంగా బడ్జెట్ ఉండనుంది. పాత ఆదాయపు పన్ను చట్టం 1961 నుంచి.. కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025 వరకు సరళమైన పరివర్తనలపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. సత్వర పన్ను వాపసులు, సరళీకృత సమ్మతి కీలక లక్ష్యాలుగా ఉండనున్నాయని సమాచారం.


వార్షిక సమాచార ప్రకటన(AIS), పన్ను చెల్లింపుదారుల సమాచార సారాంశం(TIS) వంటి వ్యవస్థలు పన్ను దాఖలును సులభతరం చేశాయి. కానీ అవి తరచుగా లోపాలు, ఫేక్ ఎంట్రీలను కలిగి ఉంటాయి. డిజిటల్ వ్యవస్థను మరింత నమ్మదగినదిగా, పారదర్శకంగా మార్చడంపై బడ్జెట్ 2026 దృష్టి సారించే అవకాశముంది. ఏఐని సరిగ్గా ఉపయోగించినట్లయితే పన్ను రిటర్న్‌లను ఆటోమేటిక్‌గా దాఖలు చేయొచ్చని, లోపాలను తగ్గించవచ్చని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పన్ను వాపసుల కోసం రియల్‌‌టైమ్ ట్రాకింగ్ వ్యవస్థ కూడా సాయపడనుంది. ఆదాయపు పన్ను కేసుల వేగవంతమైన పరిష్కారంపై ప్రాధాన్యం, క్రిప్టో, డిజిటల్ ఆస్తులపై స్పష్టమైన నియమాలకు ఉపయోగపడుతుంది.


మరోవైపు.. కొత్త పన్ను విధానం వచ్చినప్పటికీ కొన్ని అంశాల్లో పాత పన్ను విధానం అందుబాటులో ఉంటుందని సమాచారం. ముఖ్యంగా గృహ రుణాలు, బీమా ప్రీమియంలు, పదవీ విరమణ పొదుపులు, ఇతర పెట్టుబడులకు సంబంధించిన పన్ను తగ్గింపులకు సంబంధించి పాత విధానాలే ఉంటాయని తెలుస్తోంది. బాగా పన్ను రాయితీ కలిగిన వారు పాత పన్ను విధానం నుంచి ప్రయోజనం పొందడం కొనసాగించవచ్చు. అయితే తక్కువ పన్ను మినహాయింపులు ఉన్న వ్యక్తులు కొత్త విధానాన్ని మరింత ఆకర్షణీయంగా భావించవచ్చని నిపుణులు చెబుతున్నారు. సరైన విధానాన్ని ఎంచుకోవడం ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఒక ముఖ్యమైన నిర్ణయం అవుతుంది. విద్యా, గృహ ఖర్చులు, రోజువారీ జీవన వ్యయాలను నిర్వహించే కుటుంబాలకు ఈ మార్పులు ఆర్థికంగా ఊపిరి పీల్చుకునే అవకాశాన్ని అందించవచ్చు. 2026లో ఆదాయపు పన్ను నియమాల మార్పు నుంచి సీనియర్ సిటిజన్లు కూడా ప్రయోజనం పొందవచ్చు. ముఖ్యంగా పెన్షన్ ఆదాయం, వాటి వడ్డీ ఆదాయాలపై సరళీకృత పన్ను విధించడం ద్వారా పన్ను దాఖలును సులభతరం చేస్తాయి. ఏది ఏమైనప్పటికీ.. ట్యాక్స్ ప్లేయర్లకు కేంద్రం శుభవార్త చెప్పనుందని ఆర్థిక నిపుణులు బలంగా చెబుతున్నారు.


ఇవీ చదవండి:

అంతకంతకూ పెరుగుతున్న పసిడి, వెండి ధరలు! రోజుకో కొత్త రికార్డు..

మూడో అతిపెద్ద విమాన మార్కెట్‌గా భారత్‌

Updated Date - Jan 31 , 2026 | 02:16 PM