మళ్లీ 110 డాలర్లకు చేరువలో ముడి చమురు.. శాంతి ఒప్పందంపై అనిశ్చితే కారణం..
ABN , Publish Date - Oct 21 , 2026 | 08:37 AM
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మరోసారి భగ్గుమన్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గకపోవడం, అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందంపై అనిశ్చితి కొనసాగుతుండటంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మళ్లీ పెరిగాయి.
ఇంటర్నెట్ డెస్క్: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మరోసారి భగ్గుమన్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గకపోవడం, అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందంపై అనిశ్చితి కొనసాగుతుండటంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మళ్లీ పెరిగాయి. బుధవారం బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్‌కు 110 డాలర్ల స్థాయిని దాటేసింది. ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదరడం చాలా కష్టమని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో వ్యాఖ్యానించడం మార్కెట్‌పై ప్రభావం చూపింది (Brent Crude Oil Price).
అంతర్జాతీయ చమురు మార్కెట్‌లో బ్రెంట్ క్రూడాయిల్ ధర బుధవారం బ్యారెల్‌కు 110.15 డాలర్లకు చేరింది. గత సెషన్‌తో పోలిస్తే ఒక శాతానికి పైగా పెరిగింది. అమెరికా ముడి చమురు ప్రమాణమైన వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ ధర కూడా పెరిగింది. మంగళవారం ఈ ధర బ్యారెల్‌కు 101.79 డాలర్ల వద్ద స్థిరపడింది. మంగళవారం చమురు ధరలు కొంత తగ్గినప్పటికీ, తాజా పరిణామాలు మళ్లీ ధరల పెరుగుదలకు దారితీశాయి. పశ్చిమాసియాలో చమురు సరఫరాకు ఆటంకాలు ఏర్పడవచ్చనే ఆందోళన వెంటాడుతోంది (Crude Oil Prices Today).
ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదుర్చుకోవడం చాలా కష్టమని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తాజాగా పేర్కొన్నారు (US Iran War). హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై దాడులు నిలిచే వరకు ఇరాన్‌పై ఆర్థిక ఒత్తిడి కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు, అమెరికా తమ షరతులను అంగీకరించే వరకు హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరిచే ప్రసక్తే లేదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ పేర్కొన్నారు. అణు పదార్థాలను రష్యా ఆధీనంలోకి అప్పగించాలన్న ప్రతిపాదనలను కూడా ఇరాన్ తిరస్కరించింది. దీంతో ఇరు దేశాల మధ్య చర్చలు ముందుకు సాగడంపై అనిశ్చితి నెలకొంది.
ఇవి కూడా చదవండి..
ఒక్క గ్రాము యురేనియం కూడా ఇవ్వం.. అమెరికాకు తేల్చి చెప్పిన ఇరాన్..
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..