Share News

ట్రేడ్ డీల్‌ వల్ల భారత్‌కు సుంకాల నుంచి మినహాయింపు: మార్కో రూబియో

ABN , Publish Date - Oct 20 , 2026 | 09:47 AM

ట్రేడ్ డీల్ తుది దశకు చేరుకున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని భారత్‌కు మినహాయింపులు ఇచ్చామని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో తెలిపారు.

ట్రేడ్ డీల్‌ వల్ల భారత్‌కు సుంకాల నుంచి మినహాయింపు: మార్కో రూబియో
US Secretary of State Marco Rubio

ఇంటర్నెట్ డెస్క్: అతి త్వరలో భారత్‌తో ట్రేడ్ డీల్ ఖరారయ్యే అవకాశం ఉందని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో తెలిపారు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌కు సుంకాల నుంచి మినహాయింపులు ఇచ్చినట్టు తెలిపారు. ట్రేడ్‌ డీల్‌తో పాటూ పలు ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని ట్రంప్ మినహాయింపులు ఇచ్చారని చెప్పారు. రష్యా చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై 100 శాతం వరకూ సుంకాలు విధించేందుకు యూఎస్ ఇటీవల లిండ్సే ఓ గ్రాహం చట్టాన్ని తెచ్చిన విషయం తెలిసిందే. రష్యాను ఆర్థికంగా దెబ్బతీసేందుకు ఈ చట్టాన్ని రూపొందించింది. ఈ సుంకాల నుంచి భారత్, చైనాలకు 60 రోజుల పాటు ట్రంప్ ఇటీవల మినహాయింపును ఇచ్చారు.


ఈ అంశంపై మార్కో రూబియో తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఒక్కో దేశాన్ని పలు రకాల సంక్లిష్ట అంశాలు ప్రభావితం చేస్తుంటాయి. భౌగోళిక అంశాలు ముఖ్యపాత్ర పోషిస్తాయి. కొన్ని దేశాలకు వివిధ మార్గాల్లో చమురు సేకరణ సాధ్యం కాకపోవచ్చు. అంతమాత్రానికే మినహాయింపు ఇవ్వాలని కాదు కానీ విదేశాంగ విధానంలో ఇలాంటి అనేక అంశాల మధ్య సమతౌల్యం ఉండేలా నిర్ణయాలు తీసుకోవాలి. భారత్‌తో ట్రేడ్ డీల్‌ను ఖరారు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాము. ఇది చివరి దశలో ఉంది. ఈ అంశాన్నీ పరిగణనలోకి తీసుకునే అధ్యక్షుడు జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలపై నిర్ణయాలు తీసుకుంటారు’ అని మంత్రి రూబియో వివరణ ఇచ్చారు.


ఈ అంశంపై అంతకుముందు కూడా మంత్రి రూబియో మాట్లాడుతూ రష్యా చమురు దిగుమతులను తగ్గించేందుకు భారత్ ఇప్పటికే స్వచ్ఛందంగా చర్యలు తీసుకుందని అన్నారు. ఇతర వనరుల వైపు మళ్లుతోందని చెప్పారు. కానీ ఒక్క రోజులో రష్యా చమురు దిగుమతులకు ఫుల్ స్టాప్ పెట్టడం సాధ్యం కాదని అన్నారు.


ఈ వార్తలనూ చదవండి:

జెలెన్‌స్కీతో కుదరదు.. యుద్ధం ఆపేందుకు మరొకరు కావాలి: ట్రంప్

త్వరలోనే పారిస్ ముస్లిం నగరంగా మారుతుంది.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..

Updated Date - Oct 20 , 2026 | 09:48 AM