ఎన్నికల్లో మోసం.. యూఎస్ గ్రీన్ కార్డు ఉన్న భారతీయులపై కేసు
ABN , Publish Date - Oct 20 , 2026 | 11:15 AM
ఎన్నికల్లో మోసాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో అమెరికాలోని ఇద్దరు భారతీయులపై కేసులు నమోదయ్యాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఎన్నికల్లో మోసాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో అమెరికాలోని ఇద్దరు భారతీయులపై కేసులు నమోదయ్యాయి. కాలిఫోర్నియాలో తాజాగా ఈ ఘటన వెలుగు చూసింది. గ్రీన్‌కార్డుదారులైన అమన్‌దీప్ కౌర్ (30), కమలేశ్ నవనీత్‌లాల్ షా (63)లపై ఈ కేసులు నమోదు చేశారు. రాంచో పాలోస్ వెర్డీస్‌కు చెందిన అమన్‌దీప్ కౌర్, శాక్రమెంటోలో ఉంటున్న కమలేశ్ యూఎస్ పౌరులు కాకపోయినప్పటికీ నిబంధనలను ఉల్లంఘించి తమ పేర్లను నమోదు చేసుకుని ఓటు వేశారని అధికారులు చెప్పారు.
అమెరికా న్యాయ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, అమన్‌దీప్ కౌర్ పౌరసత్వం కోసం ప్రయత్నిస్తున్నారు. 2022 డిసెంబర్‌లో ఆమె తన పేరును ఓటర్‌గా నమోదు చేసుకున్నారు. 2024 నవంబర్‌లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేశారు. కమలేశ్ కూడా 2024 నవంబర్‌లో ఓటరుగా తన పేరు రిజిస్టర్ చేసుకుని అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేశారు.
‘ఆపరేషన్ ప్రొటక్ట్ ది ఓట్’
ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడిన వారిపై కాలిఫోర్నియా అధికారులు కేసులు నమోదు చేస్తున్నారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా ఇటీవల గ్రీన్‌కార్డులున్న మొత్తం 28 మంది విదేశీయులపై కేసు నమోదు చేశారు. పౌరులు కాని వారికి యూఎస్‌లో ఓటు వేసే హక్కు లేదని అధికారులు స్పష్టం చేశారు. మొత్తం 20 వేల మంది అనుమానితుల లిస్టు తమ వద్ద ఉందని చెప్పారు. 28 మందిపై కేసు నమోదు చేశామని అన్నారు.
కాలిఫోర్నియాలో సోమవారం ఉదయం పోలీసులు రెయిడ్స్ నిర్వహించి 11 మంది విదేశీయులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన వారిలో అమన్‌దీప్, కమలేశ్ ఉన్నారా? లేదా? అనేది ఇంకా తెలియరాలేదు. అప్లికేషన్స్‌లో తప్పుడు వివరాలు పేర్కొనడం, మోసపూరితంగా ఓటర్లుగా రిజిస్టర్ కావడం తదితర ఆరోపణలతో నిందితులపై కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో గరిష్ఠంగా 5 ఏళ్ల వరకూ జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
ఈ వార్తలనూ చదవండి:
ట్రేడ్ డీల్ వల్ల భారత్‌కు సుంకాల నుంచి మినహాయింపు: మార్కో రూబియో
జెలెన్‌స్కీతో కుదరదు.. యుద్ధం ఆపేందుకు మరొకరు కావాలి: ట్రంప్