20 రోజులుగా పెద్దపులి సంచారం.. ప్రజల్లో భయం భయం
ABN , Publish Date - Mar 09 , 2026 | 04:54 PM
పోలవరం జిల్లాలో పెద్దపులి కలకలం రేపుతోంది. రెండురోజుల పాటు కాకినాడ జిల్లాలో సంచరించిన పులి.. అక్కడి నుంచి తప్పించుకుని పోలవరం జిల్లాలోకి ప్రవేశించింది.
పోలవరం జిల్లా, మార్చి 9: పోలవరం జిల్లాలో గత 20 రోజులుగా పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. ఈ పులి మొదట్లో పోలవరం జిల్లాలోని అడవి ప్రాంతాల్లో, రంపచోడవరం, అడ్డతీగల మండలాల పరిసరాల్లో కనిపించింది. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు తూర్పు గోదావరి (కాకినాడ) జిల్లాలోకి వెళ్లి, ఏలేశ్వరం మండలం పరింతడక, మర్రివీడు ప్రాంతాల్లో పశువులపై దాడులు చేసింది. అక్కడ గేదెలు, దూడలను దాడి చేసి చంపేసింది. దీంతో అటవీ అధికారులు అప్రమత్తమై, పులిని బంధించేందుకు విస్తృతంగా చర్యలు చేపట్టారు.
అయితే, పులి మళ్లీ తప్పించుకుని పోలవరం జిల్లాలోనికి తిరిగి ప్రవేశించింది. ప్రస్తుతం రాజవొమ్మంగి రేంజ్ పరిధిలోని సర్రంపేట అడవి ప్రాంతంలో సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు సమీప గ్రామాల ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అటవీ ప్రాంతాలకు వెళ్లవద్దని, ఒంటరిగా తిరగవద్దని సూచించారు. పశువులను అడవి ప్రదేశాలకు తీసుకెళ్లి మేపవద్దని, రాత్రి వేళల్లో బయటకు రావద్దని, పశువులను సురక్షితంగా ఉంచాలని కోరారు.
పులిని సురక్షితంగా బంధించేందుకు పెద్ద ఎత్తున గాలింపు, ఆపరేషన్ చర్యలు కొనసాగుతున్నాయి. ఇటీవల వీరభద్రపురం, కొనలోవ, గొండోలు, గవరయ్యపేట, కొట్టంపాలెం వంటి గ్రామాల పరిసరాల్లో పులి జాడలు, పాదముద్రలను అటవీశాఖ అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే. యేలేరు రిజర్వాయర్ పరివాహక ప్రాంతం నుంచి రాజవొమ్మంగి అటవీ ప్రాంతంలోకి పులి ప్రవేశించినట్లు ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి..
లడ్డూ కల్తీపై తప్పుడు ప్రచారం.. రెచ్చగొడితే కఠిన చర్యలు తప్పవు: సీఎం చంద్రబాబు
మంతెనకు యోగా, నేచరోపతి విభాగ సలహాదారుగా బాధ్యతలు
Read Latest AP News And Telugu News