వచ్చే మూడేళ్లలో ఇరిగేషన్ ప్రాజెక్టుల ప్రారంభోత్సవాల పండుగలు నిర్వహిస్తాం: మంత్రి నిమ్మల
ABN , Publish Date - Sep 17 , 2026 | 04:43 PM
ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు 2027 మార్చి నాటికి పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యంగా నిర్దేశించారని ఆంధ్రప్రదేశ్ జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు.
ఏలూరు, సెప్టెంబర్ 17: ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు 2027 మార్చి నాటికి పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యంగా నిర్దేశించారని ఆంధ్రప్రదేశ్ జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. గురువారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ పనులను క్షేత్ర స్థాయిలో ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులను పరిశీలించి.. పనుల పురోగతిని ప్రాజెక్టు అధికారులను ఆయన అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. రైట్ కనెక్టివిటీ పనులు ఈ నెలాఖరు నాటికి, లెఫ్ట్ కనెక్టివిటీ పనులు నవంబర్ నాటికి పూర్తి కానున్నాయని తెలిపారు.
రూ.536 కోట్లతో చేపట్టిన కుడి, ఎడమ గట్ల అనుసంధాన పనులు జరుగుతున్నాయని చెప్పారు. 2024 జూన్ తరువాత 10,491 ఎకరాల భూసేకరణ చేశామని గుర్తు చేశారు. నిర్వాసితులకు రూ.2,250 కోట్ల పరిహారాన్ని అందించామని వివరించారు. గత వైసీపీ ఐదేళ్ల పాలనలో ఒక్క ఎకరం భూమి కూడా సేకరించ లేదని మండిపడ్డారు. అలాగే ప్రాజెక్టు నిర్వాసితులకు ఒక్క రూపాయి పరిహారం కూడా అందించలేదన్నారు. కేంద్రం ఇచ్చిన రూ.3,850 కోట్ల రియింబర్స్‌మెంట్ నిధులను ప్రాజెక్టుకు ఖర్చు చేయకుండా దారి మళ్ళించారని ఆ పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత ఐదేళ్లలో ఇరిగేషన్ రంగాన్ని విధ్వంసం చేసి, రైతాంగానికి తీవ్ర నష్టం కలిగించారంటూ వైసీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే మూడేళ్లలో ఇరిగేషన్ ప్రాజెక్టుల ప్రారంభోత్సవాల పండుగలను నిర్వహిస్తామని మంత్రి నిమ్మల రామానాయడు ప్రకటించారు. కూటమి ప్రభుత్వం ముందుగా చెప్పినట్లే హంద్రీనీవా, వెలిగొండ, పోలవరం ఎడమ కాలువలను పూర్తి చేసి నీళ్లు విడుదల చేసి దశాబ్దాల కల నెరవేర్చామని స్పష్టం చేశారు. రానున్న మూడేళ్లలో రూ.35 వేల కోట్లు ఖర్చు చేసి 36 ప్రాజెక్టులు పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు లక్ష్యంగా పెట్టారని పేర్కొన్నారు.
ఇవీ చదవండి:
గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు.. సిట్ ఎదుట ఏ4 సురేశ్ లొంగుబాటు
ప్రతీ ఆశీర్వాదం నా సంకల్పాన్ని మరింత బలపరుస్తుంది: ప్రధాని మోదీ
For More AP News And Telugu News