Share News

కాస్త ఆలస్యమైనా నదుల అనుసంధానం పక్కా: ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్

ABN , Publish Date - Aug 24 , 2026 | 01:33 PM

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని ముసునూరులో నాన్‌-జీఎంఓ పాప్‌కార్న్‌ హైబ్రిడ్‌ విత్తనాన్ని ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు.

కాస్త ఆలస్యమైనా నదుల అనుసంధానం పక్కా: ఉపరాష్ట్రపతి  రాధాకృష్ణన్
Vice President Radhakrishnan

ఏలూరు, ఆగస్టు 24: నూజివీడు నియోజకవర్గంలోని ముసునూరులో నాన్‌-జీఎంఓ పాప్‌కార్న్‌ హైబ్రిడ్‌ విత్తనాన్ని ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు. ‘నేను తెలుగు అర్థం చేసుకోగలను, కానీ మాట్లాడలేను. రెండు నెలల క్రితం తమిళ పత్రికలో గౌర్మెట్ సంస్థ ఎండీ పట్టాభి సక్సెస్ స్టోరీని చదివాను. ఒకే ఒక ఉత్పత్తిని ప్రపంచంలోనే గుర్తింపు తీసుకురావడంపై ఆయనను అభినందిస్తున్నాను. జనవరి 14న దేశమంతా కలిసి పంటల పండుగను జరుపుకుంటాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో సంక్రాంతిగా, తమిళనాడులో పొంగల్, పంజాబ్‌లో లోహిరి, అసోంలో బిహుగా జరుపుకుంటారు’ అని చెప్పుకొచ్చారు.


రైతులకు వివిధ పథకాలను అమలుచేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఉపరాష్ట్రపతి అభినందించారు. డ్రోన్లను రైతులకు అద్దెకు ఇచ్చే పథకానికి కేంద్రం రూ.1200 కోట్లను మహిళా సంఘాలకు కేటాయించిందన్నారు. పాప్ కార్న్ మొక్కజొన్నను అమెరికా నుంచి దిగుమతి చేసుకోవడం మానేసి, మనమే ఆ దేశానికి ఎగుమతి చేసే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఎనిమిది రాష్ట్రాల్లో 17,500 మంది రైతులు 40 వేల ఎకరాల్లో పాప్ కార్న్ మొక్కజొన్నను పండించడం మామూలు విషయం కాదన్నారు. ఈ ఏడాది దేవుని కృపతో అవసరమైన వర్షాలు కురుస్తాయని.. దాని గురించి ఆందోళన వద్దని చెప్పారు.


మహానది నుంచి కావేరి నది వరకు నదుల అనుసంధానం కలగా మిగలదని.. కొంత ఆలస్యం కావచ్చుగానీ, వాస్తవ రూపం దాల్చుతుందని ఉపరాష్ట్రపతి స్పష్టం చేశారు. మన ఆహార అవసరాల కోసం ఇతర దేశాలపై ఆధారపడాల్సిన అవసరం లేదన్నారు. ఆహార అవసరాలను తీర్చడానికి రైతులకు అవసరమైన సహాయ సహకారాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నాయని ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

20వేల మంది జెన్‌జీ యువతతో మాటామంతి: ఎమ్మెల్యే కోటంరెడ్డి

హోం మంత్రి అనితపై కూలిన డ్రోన్.. చేతికి స్వల్ప గాయం

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 24 , 2026 | 01:41 PM