Share News

అధికారం కోల్పోయిన జగన్‌‌లో మార్పు రాలేదు: ఎంపీ కలిశెట్టి

ABN , Publish Date - Feb 02 , 2026 | 08:58 PM

అధికారం కోల్పోయినా ఇంకా వైఎస్ జగన్‌‌లో మార్పు రాలేదని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పేర్కొన్నారు. వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతిపై టీడీపీ కార్యకర్త వ్యాఖ్యలు చేస్తే వెంటనే అతడిని అరెస్టు చేశామని తెలిపారు.

అధికారం కోల్పోయిన జగన్‌‌లో మార్పు రాలేదు: ఎంపీ కలిశెట్టి

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 02: ఆంధ్రప్రదేశ్‌లో కాపు సామాజిక వర్గానికి చెందిన వారిపై దాడులు జరుగుతున్నాయంటూ వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని.. వారి వ్యాఖ్యలు చూస్తుంటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుగా ఉందని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఎద్దేవా చేశారు. సోమవారం న్యూఢిల్లీలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు విలేకర్లతో మాట్లాడుతూ.. కాపులతోపాటు బీసీ సామాజిక వర్గాల వారి మీద దాడి చేసిన ఘనత, చరిత్ర వైసీపీదేనని తెలిపారు.


గత ఐదేళ్లలో టీడీపీ సీనియర్ నేతలు బోండా ఉమా, బుద్ధా వెంకన్నతోపాటు పలువురు నేతలను హత్య చేసేందుకు బహిరంగ ప్రయత్నం చేశారంటూ మండిపడ్డారు. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డితోపాటు ఆయన బృందం.. కాపు, బీసీ సామాజిక వర్గాల వారిని నాశనం చేయడమే కాకుండా.. వారి మనోభావాలను దెబ్బతీశారని వివరించారు.

అంబటి రాంబాబు మాట్లాడిన తీరు తప్పని చెప్పకుండా ప్రభుత్వంపై ఎదురుదాడి చేసే విధంగా వైసీపీ నేతలు ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై వారు చేస్తున్న వ్యాఖ్యలను ప్రజలు ఛీ కొడుతున్నారన్నారు. అభివృద్ధి వైపు వెళ్లాలని.. రెచ్చగొట్టే వ్యాఖ్యల వైపు వెళ్లొద్దంటూ సీఎం చంద్రబాబు తమకు స్పష్టం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా విజయనగరం ఎంపీ గుర్తు చేశారు.


అధికారం కోల్పోయినా ఇంకా వైఎస్ జగన్‌‌లో మార్పు రాలేదన్నారు. వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతిపై టీడీపీ కార్యకర్త వ్యాఖ్యలు చేస్తే వెంటనే అరెస్టు చేసిన విషయాన్ని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ప్రస్తావించారు. సీఎం చంద్రబాబు, లోకేశ్‌పై విమర్శలు చేస్తుంటే టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేశారన్నారు. సీఎం చంద్రబాబు నాయుడుని చూసి నేర్చుకోవాలంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి‌కి సూచించారు. గతంలో టీడీపీ నేతలపై విమర్శలు చేస్తే కొందరికి వైసీపీ ప్రభుత్వంలో మంత్రి పదవులను జగన్ ఇచ్చారని విజయనగరం ఎంపీ గుర్తు చేశారు.


టీడీపీ, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే కాపు కార్పొరేషన్‌ను సీఎం చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేశారని వివరించారు. కాపు సామాజికవర్గంతోపాటు బీసీలకు ప్రాధాన్యత ఇచ్చింది టీడీపీ అని తెలిపారు. అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఆదేశించాలంటూ వైఎస్ జగన్‌కు ఎంపీ కలిశెట్టి సూచించారు. పార్టీ అధినేత వైఎస్ జగన్‌ను చూసి నేర్చుకుంటున్నారంటూ వైసీపీ నేతలపై ఆయన నిప్పులు చెరిగారు.


కాపులకు అన్యాయం జరుగుతుందంటూ ప్రభుత్వానికి ముద్రగడ పద్మనాభం లేఖలు రాస్తున్నారని.. మొన్ననే ఆయన రెడ్డిగా పేరు మార్చుకున్నారని వ్యంగ్యంగా పేర్కొన్నారు. కాపు జాతి కోసం ఉన్నారా? జగన్ కోసం ఉన్నారా? ఆలోచన చేయాలంటూ ముద్రగడ పద్మనాభంకు ఎంపీ కలిశెట్టి చురకలంటించారు.

మీ గౌరవాన్ని దిగజార్చుకోవద్దంటూ ముద్రగడ పద్మనాభంకు ఎంపీ కలిశెట్టి అప్పలనాయడు హితవు పలికారు. గత ఐదేళ్ల జగన్ పాలనలో అంతా విధ్వంసం జరిగిందన్నారు. వైసీపీ పాలనలో ఐదేళ్లు ఎమర్జెన్సీ పెట్టాలని ప్రజలే కోరుకున్నారని వివరించారు.


ఎమర్జెన్సీ కన్నా దారుణంగా జగన్ పరిపాలన జరిగిందని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడును అక్రమ అరెస్ట్ చేశారని.. దాంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆందోళన చెందారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రజాస్వామ్యబద్ధంగా పాలనా జరుగుతుందన్నారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేశ్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుందని విజయనగరం ఎంపీ కలిశెట్టి పేర్కొన్నారు.


ఇవీ చదవండి:

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి జర్నలిస్టులపై దాడి.. ఖండించిన ప్రెస్ క్లబ్

జేఈఈ మెయిన్స్ తుది పరీక్షల షెడ్యూల్ విడుదల

For More AP News And Telugu News

Updated Date - Feb 02 , 2026 | 09:57 PM