Will the encroachments in the ponds stop? చెరువుల్లో ఆక్రమణలు ఆగేనా?
ABN , Publish Date - May 08 , 2026 | 12:34 AM
Will the encroachments in the ponds stop? జిల్లాలో చాలా చెరువులు మారిపోయాయి. ఎంతలా అంటే అక్కడ చెరువొకటి ఉండేదట అనుకునేలా మార్చేశారు. నిర్మాణాలు కట్టేశారు.. పొలాలుగా చేసేశారు.. రియల్టర్‌లు చెరువులను ఆనుకుని కొనుగోలు చేసిన పొలాల్లో ఇష్టారాజ్యంగా లేఅవుట్‌లను తీర్చిదిద్దేశారు.
చెరువుల్లో ఆక్రమణలు ఆగేనా?
- సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తున్న రెవెన్యూ అధికారులు
- ప్రభుత్వ భూమి ఆక్రమణదారులు శిక్షార్హులంటూ హెచ్చరిక
- ఇప్పటికే కబ్జాదారుల చెరలో అనేక సాగునీటి వనరులు
- రికార్డుల్లో కనిపిస్తున్న వాటిలో చాలా వరకు క్షేత్రస్థాయిలో మాయం
జిల్లాలో చాలా చెరువులు మారిపోయాయి. ఎంతలా అంటే అక్కడ చెరువొకటి ఉండేదట అనుకునేలా మార్చేశారు. నిర్మాణాలు కట్టేశారు.. పొలాలుగా చేసేశారు.. రియల్టర్‌లు చెరువులను ఆనుకుని కొనుగోలు చేసిన పొలాల్లో ఇష్టారాజ్యంగా లేఅవుట్‌లను తీర్చిదిద్దేశారు. చెరువులను జిరాయితీలుగా రికార్డులను తారుమారు చేసేశారు. ప్లాట్లుగానూ అమ్మేశారు.. రెవెన్యూలో ఉన్న లొసుగులను అడ్డం పెట్టుకొని 22ఏ నిషేధిత భూముల జాబితాల్లో ఉన్న చెరువు భూములను జిరాయితీలుగా చేసిన ఘనులున్నారు. ఈ పరిస్థితిలో చెరువుల వద్ద ఏర్పాటు చేస్తున్న హెచ్చరిక బోర్డులతో ఎలాంటి మార్పులు వస్తాయో చూడాలి.
శృంగవరపుకోట, మే 7 (ఆంధ్రజ్యోతి):
- శృంగవరపుకోట పట్టణానికి ఆనుకుని ఉన్న జగ్గు చెరువు వద్ద ఏర్పాటు చేసిన సూచిక బోర్డుది. బుధవారం గ్రామ రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేశారు. మండలంలోని అన్ని చెరువుల వద్ద ఇదే విధంగా ప్రభుత్వ భూమి ఆక్రమణదారులు శిక్షార్హులంటూ సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. అందరికీ తెలిసేలా చెరువు పేరును కూడా పేర్కొంటున్నారు. ఈ ఆలోచన ఆక్రమణలను ఎంతవరకు కట్టడి చేస్తుందో చూడాలి.
ఎస్.కోట పంచాయతీ పరిధిలోని విశాఖ-అరకు రోడ్డుకు కూతవేటు దూరంలో వున్న ఓ చెరువును 22ఏ జాబితా నుంచి నుంచి తొలగించేందుకు నాలుగైదు సంవత్సరాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించిన ఫైలు జిల్లా కేంద్రం వరకు చక్కర్లు కొడుతోంది. జగ్గుచెరువు, రాజు చెరువు, బెహరా చెరువుల చుట్టూ ఆక్రమణలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పక్కా భవనాలూ నిర్మించారు. కిల్తంపాలెం గ్రామ పంచాయతీ పరిధిలో 42 వరకు సాగునీటి చెరువులు ఉన్నట్లు రికార్డుల్లో ఉన్నా.. క్షేత్ర స్థాయిలో ఎన్ని చెరువులు ఉన్నాయో రెవెన్యూ అధికారులే చెప్పలేకపోతున్నారు. చాలావరకు పొలాల్లో కలిసిపోయా యని స్థానికులు చెబుతున్నారు. ఎర్రబంద, కిత్తమాను, కొక్కిరి, అల్లవాని, బొడ్డివాని, పొట్టిబంద వంటి సాగు నీటి వనరులను చూపించలేకపో తున్నారు. ఇటీవల ఈ గ్రామ చెరువుల వివరాల కోసం పీజీఆర్‌ఎస్‌లోనూ వినతిపత్రం అందించారు. కాపుసోంపురం దాలెమ్మ చెరువును ఎక్సకవేటర్‌తో చదును చేస్తుండడంతో స్థానికుల ఫిర్యాదుతో నాలుగు రోజుల క్రితం రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. వెంకటరమణ పేట గ్రామానికి ఒకప్పుడు తాగునీరు అందించే కోనేరులో ఇప్పుడు నివాసాలు వెలుస్తున్నాయి. ఇలా ప్రతి గ్రామ పరిధిలోనూ చెరువులు అక్రమణదారుల చెరలోనే వున్నాయి.
నష్టాలిలా..
గ్రామాలకు ఆనుకుని వున్న చెరువుల్లో కట్టడాలు ఉండడంతో వర్షాకాలంలో ముంపునకు గురవుతున్నాయి. పొలాలకు సమీపంలో వున్న చెరువులు లేఅవుట్‌లలో కలవడం, పొలాలుగా మారడంతో కుచించుకుపోయాయి. వర్షాకాలంలో సామర్థ్యాన్ని తట్టుకోలేక సాగునీరంతా వృథాగా పోతోంది. సాగునీటి వనరుల్లోని అక్రమణలను తొలగించాలన్న డిమాండ్‌ను రెవెన్యూ, సాగునీటి, పంచాయతీ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. ఒకరిపై ఒకరు నెట్టుకుంటుండడంతో సరిపెడుతున్నారు.
భూముల ధరలు పెరిగి
దశాబ్దం క్రితం నుంచి భూముల ధరలు బాగా పెరిగాయి. ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములతో పాటు చెరువులు, సాగునీటి వనరులను వదలడం లేదు. ఈ ఆక్రమణలకు అడ్డకట్ట వేసేందుకు ప్రతి చెరువు వద్ద గ్రామ రెవెన్యూ అధికారులు హెచ్చరికతో బోర్డులను తగిలిస్తున్నారు. ప్రభుత్వ భూమిని అక్రమిస్తే చట్టపరమైన చర్యలు వుంటాయని తెలుసుకుని అగుతారని చెబుతున్నారు. గాలేస్తే ఎగిరిపోయో ఈ ఫ్లెక్సీలు ఎంతవరకు ఆక్రమణదారులను ఆపుతాయో చూడాలి మరి..!