వైసీపీ అసత్య ప్రచారం.. వారి దిగజారుడుతనానికి నిదర్శనం: ఎంపీ కలిశెట్టి
ABN , Publish Date - Jun 09 , 2026 | 04:44 PM
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ప్రమాద ఘటనపై వైసీపీ వ్యవహరిస్తున్న తీరు పట్ల విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మండిపడ్డారు. నాడు ఎల్‌జీ పాలిమర్స్ బాధితులను గాలికొదిలేసిన వైసీపీ.. నేడు స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై శవ రాజకీయాలు చేయడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు.
విశాఖపట్నం, జూన్ 09: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ప్రమాద ఘటనపై వైసీపీ వ్యవహరిస్తున్న తీరు పట్ల విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మండిపడ్డారు. నాడు ఎల్‌జీ పాలిమర్స్ బాధితులను గాలికొదిలేసిన వైసీపీ.. నేడు స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై శవ రాజకీయాలు చేయడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. ఈ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల పరిహారం, శాశ్వత ఉద్యోగం ఇచ్చిన మానవతా ప్రభుత్వం ఈ కూటమి సర్కారు అని తెలిపారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో పారిశ్రామిక రక్షణ గాల్లో దీపమైతే.. నేడు బురదజల్లడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేట్ పరం కాకుండా కాపాడేందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అహర్నిశలూ శ్రమిస్తున్నారని గుర్తు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన దురదృష్టకర ప్రమాదాన్ని కూడా రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటూ, ప్రతిపక్ష వైసీపీ చేస్తున్న శవరాజకీయాలను ఈ సందర్భంగా ఆయన ఖండించారు. వైసీపీ ఐదేళ్ల తుగ్లక్ పాలనలోని పారిశ్రామిక నిర్లక్ష్యాన్ని గుర్తు చేస్తూ.. ప్రస్తుత కూటమి ప్రభుత్వం కార్మికుల సంక్షేమంతోపాటు స్టీల్ ప్లాంట్ మనుగడ కోసం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుందని ఆయన వివరించారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎల్‌జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఉదంతాన్ని ఈ సందర్భంగా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు వివరించారు. ఆ సమయంలో సీఎం వైఎస్ జగన్ వ్యవహరించిన తీరును ఆయన ఎండగట్టారు. అందుకు భిన్నంగా ప్రస్తుతం కూటమి సర్కార్ స్పందించిందని గుర్తు చేశారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్మిక సోదరుల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం ప్రకటించిన పరిహారం దేశ పారిశ్రామిక చరిత్రలోనే ఒక రికార్డు అని అభివర్ణించారు.
ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారాన్ని ఈ సందర్భంగా ఎంపీ కలిశెట్టి వివరించారు. ఇంతటి ఉదారతతో కార్మిక లోకానికి అండగా నిలిచిన కూటమి ప్రభుత్వాన్ని అభినందించాల్సింది పోయి.. వైసీపీ నేతలు సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేయడం వారి దిగజారుడుతనానికి నిదర్శనమని ఎంపీ కలిశెట్టి నిప్పులు చెరిగారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను పక్కన పెట్టి.. దాని కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలను ఎంపీ కలిశెట్టి సోదాహరణగా వివరించారు. ఈఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షిస్తామని ఆయన పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్టీల్ ప్లాంట్ ఘటనపై వైసీపీ అనవసర రాజకీయాలు చేస్తోంది: మంత్రి నారాయణ
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం
Read Latest AP News And Telugu News