Bhogapuram Airport: ఎయిర్ పోర్ట్‌పై మాట్లాడే అర్హత జగన్‌కు లేదు: ఎంపీ కలిశెట్టి
ABN , Publish Date - Jan 04 , 2026 | 06:37 PM
గతంలో భోగాపురం ఎయిర్ పోర్ట్ విషయంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ వ్యవహరించిన తీరును విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఎండగట్టారు. విమానాశ్రయాన్ని అడ్డుకునేందుకు రైతులను రెచ్చగొట్టి కోర్టుకు వెళ్లారని ఆగ్రహించారు.
న్యూఢిల్లీ, జనవరి 04: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మరోసారి మండిపడ్డారు. భోగాపురం ఎయిర్‌పోర్టుపై మాట్లాడే అర్హత వైఎస్ జగన్‌కు లేదని స్పష్టం చేశారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏదో సహాయ సహకారాలు అందించినట్లు మాట్లాడుతున్నారంటూ ఆయనపై విజయనగరం ఎంపీ కలిశెట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో భోగాపురం ఎయిర్ పోర్ట్‌పై కోర్టు వెళ్తామంటూ మీరు చేసిన వ్యాఖ్యలు గుర్తు లేవా? అంటూ జగన్‌ను ఎంపీ కలిశెట్టి సూటిగా ప్రశ్నించారు.
జగన్‌కి మతిమరుపు ఉండొచ్చు.. కానీ విజయనగరం ప్రజలతోపాటు అధికారులకు జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇంకా గుర్తున్నాయని పేర్కొన్నారు. గతంలో సీఎం చంద్రబాబు హయాంలోనే భోగాపురం ఎయిర్ పోర్ట్‌కు శంకుస్థాపన జరగగా.. మళ్లీ ఆయన హయాంలోనే ప్రారంభమవుతుందన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌పై వైఎస్ జగన్ చేసిన ట్వీట్‌ను ఈ సందర్భంగా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ప్రస్తావించారు.
ఎయిర్ పోర్టు విషయంలో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలంటూ వైఎస్ జగన్‌కు ఎంపీ హితబోధ చేశారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్ వద్దని.. అన్యాయం జరిగిందంటూ రైతులను రెచ్చగొట్టి కోర్టుకు వెళ్లారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు నేతృత్వంలో ఈరోజు విమానం టెస్టింగ్ సైతం పూర్తయిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. భోగాపురం ఎయిర్ పోర్ట్ పరిసర ప్రాంతాల్లో 500 ఎకరాలు భూమిని తీసుకోవాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చూశారంటూ కలిశెట్టి ఆరోపణలు గుప్పించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొడుతున్న బీఆర్ఎస్ నేతలు: జగ్గారెడ్డి
రేవంత్ పాలనలో పాలమూరు ప్రజలకు నిరాశే మిగిలింది: ఎంపీ రఘునందన్
For More AP News And Telugu News