Share News

7 percent rent increase annually ఏటా 7శాతం అద్దె పెంపు

ABN , Publish Date - May 04 , 2026 | 12:04 AM

7 percent rent increase annually మున్సిపల్‌, కార్పొరేషన్‌ ఆస్తులపై వసూలు చేసే అద్దెలు, లీజులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విధివిధానాలను మార్చుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జీవో విడుదల చేసింది.

7 percent rent increase annually ఏటా 7శాతం అద్దె పెంపు
బొబ్బిలి మున్సిపల్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌

ఏటా 7శాతం అద్దె పెంపు

మున్సిపల్‌ ఆస్తుల అద్దె వసూళ్లకు విధివిధానాల మార్పు

తాజాగా ఆదేశాలు ఇచ్చిన ప్రభుత్వం

గతంలో మూడేళ్లకోసారి 33.5 శాతం పెంపు

మార్పును ఆహ్వానిస్తున్న లీజుదారులు

మున్సిపల్‌, కార్పొరేషన్‌ ఆస్తులపై వసూలు చేసే అద్దెలు, లీజులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విధివిధానాలను మార్చుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జీవో విడుదల చేసింది. షాపింగ్‌ కాంప్లెక్స్‌లలో ఉండే గదులకు లీజు లేదా అద్దెను ప్రతీ మూడేళ్లకోసారి 33.5 శాతం పెంచే విధానం ఇంతవరకు అమలులో ఉండేది. ఇకమీదట ఏటా 7 శాతం మాత్రమే పెంచాలని నిర్ణయించింది. దీనిని దుకాణదారులు ఆహ్వానిస్తున్నారు.

బొబ్బిలి, మే 3 (ఆంధ్రజ్యోతి):

మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీలలో అద్దెలు, లీజుల వసూళ్లకు ఏకీకృత విధానం అంటూ లేదు. ఆయా పాలకవర్గాలు తీసుకునే నిర్ణయాల ప్రకారం అమలు చేశారు. పర్యవసానంగా అనేక చోట్ల వందలాదిమంది లీజుదారులు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వానికి ఫిర్యాదులు వెల్లువలా వెళుతున్నాయి. కోర్టు కేసుల పెండింగ్‌ కారణంగా అద్దె బకాయిల వసూలుకు కూడా ఆటంకం ఏర్పడుతోంది. ఎవరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా సర్వత్రా ఆమోదయోగ్యమైన విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావించి మూడేళ్లకు బదులుగా ఏటా ఏడు శాతం చొప్పున పెంచి అద్దె, లీజులను వసూలు చేయాలని తాజాగా ఆదేశాలు జారీ చేసింది.

- షాపింగ్‌ కాంప్లెక్స్‌లలో గదులను అద్దెకు ఇచ్చేటప్పుడు ఆ చుట్టుపక్కల ఉండే వాణిజ్య దుకాణాల మార్కెట్‌ విలువలో పది శాతం చొప్పున అద్దెను నిర్ణయిస్తారు. దీని ఆధారంగా వేలం నిర్ణయిస్తారు. వేలంలో షాపులను దక్కించుకున్న వారికి ఇకమీదట ఏటా ఏడుశాతం చొప్పున పెంచుతారు. అంతస్తుల్లో ఉండే షాపులకు గల వ్యత్యాసాన్ని బట్టి అద్దెలను తగ్గించారు. మొదటి అంతస్తులో ఉండే షాపులకు గ్రౌండ్‌ ఫ్లోర్‌ షాపు అద్దెలో 20 శాతం తగ్గిస్తారు. ఇంకా పై అంతస్తులో ఉండే షాపులకు 30 శాతం అద్దెను నిర్ణయించారు. వీటిపై ఏటా ఏడు శాతం చొప్పున అద్దెను పెంచుతారు. ఇందుకు సమ్మతించిన పాత లీజుదారులకు షాపులను ఎటువంటి వేలం లేకుండా కొనసాగింపునకు అనుమతి ఇస్తారు. ఒకేసారి మూడేళ్ల పాటు కాని, 25 ఏళ్ల వరకు కాని ప్రభుత్వ అనుమతి తీసుకొని లీజును పొడిగించే వెసులుబాటు కూడా కల్పించారు.

- బొబ్బిలి మున్సిపాలిటీలో 20 ఏళ్ల క్రితం కూరగాయల మార్కెట్‌, మేదరబంద, పాతబస్టాండ్‌, మున్సిపల్‌ కార్యాలయం (నాలుగు షాపింగ్‌ కాంప్లెక్సులు)లలో 108 షాపులను నిర్మించి గుడ్‌విల్‌ (తిరిగి వాపస్‌ కాని డిపాజిట్‌ రుసుం) చెల్లించే ప్రాతిపదికన వ్యాపారులకు అప్పజెప్పారు. వీటి నుంచి నెలకు రూ.1.67 లక్షల అద్దెలను వసూలు చేస్తున్నారు. మేదరబంద, మున్సిపల్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌, కూరగాయలమార్కెట్‌ కాంప్లెక్స్‌లోని పైఅంతస్తులో ఉండే షాపులకు అద్దెలు ఎక్కువగా ఉంటున్నాయని ఎవరూ ముందుకు రావడం లేదు. 37 షాపుల వరకు ఖాళీగా ఉంటున్నాయి. అయితే ప్రభుత్వం కొత్తగా తీసుకున్న నిర్ణయంతో అన్ని షాపులు వినియోగంలోకి వస్తాయని అధికారులు భావిస్తున్నారు.

కొత్త విధానం బాగుంది

పాపారావు, షాపుల లీజుదారుడు

మూడేళ్లకోసారి 33.50 శాతం చొప్పున అద్దెను పెంచే విధానాన్ని మార్చడం బాగుంది. కొత్త విధానం మాకు వెసులుబాటుగా ఉంది. ఏటా 7 శాతం మాత్రమే అద్దె పెంచుతామని ప్రభుత్వం చెప్పడం ఊరటగా ఉంది. సుమారు 12 శాతం అద్దె భారం మాపై తగ్గుతుంది. ఈ నిర్ణయం హర్షనీయం.

Updated Date - May 04 , 2026 | 12:04 AM