గల్లంతైన మత్స్యకారుల కుటుంబాల బాధ వర్ణనాతీతం: ఎమ్మెల్యే లోకం మాధవి
ABN , Publish Date - Jul 05 , 2026 | 03:11 PM
ఫిషింగ్ హార్బర్ నుంచి వేటకు వెళ్లి సముద్రంలో బోటు గల్లంతైన ఘటన చాలా బాధాకరమని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి తెలిపారు. మత్స్యకారులు గంటలో తీరానికి చేరుకుంటామని చెప్పిన వెంటనే ఈ ఘటన జరిగిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
విశాఖపట్నం, జులై 05: ఫిషింగ్ హార్బర్ నుంచి వేటకు వెళ్లి సముద్రంలో బోటు గల్లంతైన ఘటన చాలా బాధాకరమని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి తెలిపారు. మత్స్యకారులు గంటలో తీరానికి చేరుకుంటామని చెప్పిన వెంటనే ఈ ఘటన జరిగిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం విశాఖపట్నం షిప్పింగ్ హార్బర్‌లో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్‌తో కలిసి ఆమె పరామర్శించారు. అనంతరం నెల్లిమర్ల ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గల్లంతైన మత్స్యకారుల్లో ఆరుగురు నెల్లిమర్ల నియోజకవర్గానికి చెందిన వారని వివరించారు. ఆ మత్స్యకారుల కుటుంబాల బాధ వర్ణనాతీతమని అన్నారు. రెస్క్యూ ఆపరేషన్లు ముమ్మరంగా జరుగుతున్నాయని వివరించారు. గల్లంతైన మత్స్యకారులు సురక్షితంగా తిరిగి రావాలని దేవుడిని ప్రార్థిస్తున్నామని చెప్పారు.
దిగ్భ్రాంతికి గురి చేసింది: ఎమ్మెల్యే
మత్స్యకారులు గల్లంతైన వార్త తమను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ఎమ్మెల్యే వంశీకృష్ణ తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే జిల్లా ఉన్నతాధికారులు.. నేవీ కోస్ట్ గార్డ్‌తో నిరంతరం గాలింపు చర్యలు జరుపుతున్నారని వివరించారు.
మత్స్యకారుల కోసం కొనసాగుతున్న గాలింపు: విశాఖ జిల్లా కలెక్టర్
గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టామని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ వెల్లడించారు. రెండు బోట్లుతోపాటు చాపర్లతో గాలింపు కొనసాగుతుందని పేర్కొన్నారు. మత్స్యకారుల్లో కారే చిన్న అనే వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డారని వివరించారు. గల్లంతైన వారి ఆచూకీ ఈ రోజు లభ్యం కాకుంటే సోమవారం కూడా గాలిస్తామని చెప్పారు. వీరిని గాలించడం కోసం నేవీ, కోస్ట్ గార్డ్ సహాయం తీసుకున్నామని జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కన్నెపల్లి పంపు దగ్గరకు వెళ్లి కేటీఆర్ నాటకమాడుతున్నారు.. మంత్రి ఉత్తమ్ సెటైర్లు
తెలంగాణలోని పలు జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ..
For More AP News And Telugu News