Share News

తెలంగాణలోని పలు జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ..

ABN , Publish Date - Jul 05 , 2026 | 03:22 PM

తెలంగాణలోని పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్‌ సహా మరి కొన్ని జిల్లాల్లో రెండ్రోజుల పాటు అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.

తెలంగాణలోని పలు జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ..
IMD Warning

హైదరాబాద్: తెలంగాణలోని పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్‌ సహా మరి కొన్ని జిల్లాల్లో రెండ్రోజుల పాటు అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. అయితే రాష్ట్రవ్యాప్తంగా విస్తారమైన వర్షాలు కురిసే పరిస్థితి ప్రస్తుతం కనిపించడం లేదని స్పష్టం చేసింది. మరో రెండు రోజుల తర్వాత వర్షాల తీవ్రత మరింత తగ్గి, చాలా ప్రాంతాల్లో వర్షాలకు తాత్కాలిక విరామం లభించే అవకాశముందని ఐఎండీ అంచనా వేసింది. మరోవైపు ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్ ఆశించినంత అనుకూలంగా ఉండకపోవచ్చని హెచ్చరించింది.


జులై-ఆగస్టు నెలల్లో ఎల్‌నినో ప్రభావం క్రమంగా పెరగనున్న నేపథ్యంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని ఐఎండీ వెల్లడించింది. సెప్టెంబర్ నాటికి ఎల్‌నినో మరింత బలపడే అవకాశం ఉండటంతో దక్షిణ భారత రాష్ట్రాల్లో వర్షాల తీవ్రత తగ్గే అవకాశముందని పేర్కొంది. ఈ ప్రభావంతో తెలంగాణలో నైరుతి రుతుపవనాల సీజన్ మొత్తం లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని ఐఎండీ అంచనా వేసింది. అయితే, అల్పపీడనాలతో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని స్పష్టం చేసింది. సీజన్ మొత్తం ఒకే విధమైన వర్షాలు కాకుండా మధ్య మధ్యలో భారీ వర్షాలు ఆ తర్వాత విరామం వంటి ఒడిదుడుకులు కొనసాగవచ్చని తెలిపింది.


గతేడాది జూన్ నెలలో తెలంగాణలో సాధారణం కంటే సుమారు 25 శాతం తక్కువ వర్షపాతం నమోదైన విషయాన్ని గుర్తు చేసింది. ఈసారీ అదే తరహా పరిస్థితులు పునరావృతమయ్యే అవకాశాలను కొట్టిపారేయలేమని పేర్కొంది. మరోవైపు వాతావరణ అంచనాలను మరింత కచ్చితంగా అందించేందుకు భారత వాతావరణ శాఖ కృత్రిమ మేధ (AI), మెషీన్ లెర్నింగ్ (ML) సాంకేతికతలను వినియోగిస్తున్నట్లు ఐఎండీ వెల్లడించింది. ఈ సాంకేతికతల ద్వారా వాతావరణ అంచనాల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపింది. ఈ మేరకు రైతులు ఎప్పటికప్పుడు ఐఎండీ విడుదల చేసే వాతావరణ బులెటిన్లను పరిశీలించి, వ్యవసాయ పనులను అందుకు అనుగుణంగా ప్రణాళిక చేసుకోవాలని సూచించింది.


ఈ వార్తలు కూడా చదవండి...

ప్రజల ప్రేమే నా బలం.. 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానంపై సీఎం రేవంత్‌రెడ్డి

వరంగల్ భద్రకాళీ ఆలయం వద్ద ఉద్రిక్తత.. బీజేపీ నేతలను అడ్డుకున్న పోలీసులు

Updated Date - Jul 05 , 2026 | 03:35 PM