Share News

ఒమన్ తీరంలో అమెరికా దళాలు దాడి.. విశాఖ వాసి మృతి

ABN , Publish Date - Jun 11 , 2026 | 09:13 PM

ఒమన్ తీరంలో MT సెట్టెబెల్లో నౌకపై అమెరికా దళాలు జరిపిన దాడిలో విశాఖపట్నం వాసి పట్నాల సురేశ్ మృతి చెందారు. అతడి మృతిని కేంద్రం ధృవీకరించింది. పట్నాల సురేశ్‌కు భార్య భార్గవితోపాటు ఇద్దరు కుమారులు ఉన్నారు.

ఒమన్ తీరంలో అమెరికా దళాలు దాడి.. విశాఖ వాసి మృతి
Patnala Suresh Family

విశాఖపట్నం, జూన్11: ఒమన్ తీరంలో MT సెట్టెబెల్లో నౌకపై అమెరికా దళాలు జరిపిన దాడిలో మెరైన్ ఇంజనీర్, విశాఖపట్నం వాసి పట్నాల సురేశ్ మృతి చెందారు. అతడి మృతి చెందినట్లు కేంద్రం ధృవీకరించింది. మెరైన్ ఇంజనీర్ పట్నాల సురేశ్‌కు భార్య భార్గవితోపాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. రెండు రోజుల క్రితం అమెరికా దళాలు జరిపిన దాడిలో నౌక ఇంజిన్ రూమ్‌లో భారీ పేలుడు సంభవించింది. దీంతో చీఫ్ ఇంజనీర్‌ పట్నాలా సురేష్‌తోపాటు డెక్ క్యాడెట్ ఆదిత్య శర్మ, ఇంజిన్ ఫిట్టర్ శివానంద్ చౌరాసియా కూడా మరణించారు. వీరి మృతదేహాలను స్వదేశానికి రప్పించేందుకు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన వంతు ప్రయత్నాలను ముమ్మరం చేసింది.


మరో వైపు నౌకలపై దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ దాడి నేపథ్యంలో ఈ దేశంలోని అమెరికా దౌత్యవేత్తకు భారత్ సమన్లు జారీ చేసింది. నౌకలో మిగిలిన 25 మంది సిబ్బందిని సురక్షితంగా భారత్‌కు రప్పించేందుకు ఇప్పటికే ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ​ఇరాన్ నుంచి చమురు రవాణా చేస్తున్న క్రమంలో ఆంక్షల పేరుతో అమెరికా దళాలు ఈ దాడి చేశాయి.


ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ​హార్ముజ్ జలసంధి పరిసర ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకున్నాయి. దాంతో అప్రమత్తంగా ఉండాలని భారత నౌకాయాన సంస్థలకు కేంద్రం స్పష్టం చేసింది. సురేశ్ మృతితో విశాఖపట్నంలోని అతడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. అతడి మృతదేహాన్ని స్వస్థలానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సురేశ్ కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు.


శోక సంద్రంలో సురేశ్ ఫ్యామిలీ..

మెరైన్ ఇంజనీర్ మృతిపై ఆయన భార్య భార్గవీ కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన మరణించే ముందు రోజు రాత్రి.. శుభరాత్రి, పిల్లలను బాగా చూసుకో అని సందేశం పంపారని ఆమె గుర్తు చేసుకుంది. ప్రతి రోజు.. గుడ్ మార్నింగ్ అంటూ సందేశం పంపేవారని పేర్కొన్నారు. ఆ రోజు కూడా ఆయన గుడ్ మార్నింగ్ అంటూ సందేశం పెడతారని తాను ఎదురు చూస్తున్నానని చెప్పారు. ఆయన నుంచి సందేశం రాక పోవడంతో బిజీగా ఉండి ఉంటారని భావించానని పేర్కొన్నారు. కానీ ఆ తర్వాత ఆయన మరణించినట్లు వార్త వచ్చిందని.. దీంతో తాము దు:ఖ సాగరంలో ముగినిపోయామన్నారు.


తాము మరికొద్ది రోజుల్లో 15వ వివాహ వార్షికోత్సవం జరుపుకోవాల్సి ఉందన్నారు. ఆ క్రమంలో ఆయనకు స్వాగతం పలికేందుకు తమ కుటుంబ సభ్యులంతా ఎదురు చూస్తున్నామని చెప్పారు. అలాంటి వేళ.. ఈ దుర్వార్త వినాల్సి వచ్చిందని పేర్కొన్నారు. తండ్రి మరణాన్ని పిల్లలిద్దరు జీర్ణించుకోలేక పోతున్నారని తెలిపారు. సురేశ్ పబ్లిసిటీ కోరుకునే వ్యక్తి కాదని భార్య భార్గవి గుర్తు చేసుకున్నారు.


ఆయన తన అభిరుచికి తగ్గట్లు మెరైన్ ఇంజనీర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. రెండు దశాబ్దాలుగా ఆయన ఈ విధులు నిర్వహిస్తున్నారని వివరించారు. దాదాపు 12 ఏళ్ల పాటు ఆయన ఒకే కంపెనీలో చేస్తున్నారని చెప్పారు. సురేశ్‌కు తల్లిదండ్రులతోపాటు ఒక సోదరి కూడా ఉందన్నారు. సెలవు పెట్టి ఇంటికి వచ్చేందుకు సురేశ్ తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు.


నౌకలోని జనరేటర్ గదిలో సాంకేతిక సమస్య తలెత్తిందని.. దానిని పరిష్కరించేందుకు ఆయన అక్కడికి వెళ్లారని చెప్పారు. అంతలో అమెరికా దళాలు దాడి చేయడంతో.. ఆయన తప్పించుకో లేకపోయారన్నారు. జూన్ 24వ తేదీ తమ పెళ్లి రోజు అని ఈ సందర్భంగా సురేశ్ భార్య గుర్తు చేసుకున్నారు. ఆ రోజుకు ఆయన వస్తారని తామంతా ఎదురు చూస్తున్నామని భార్గవి వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

24 నుంచి రొట్టెల పండుగ.. ఏర్పాట్లపై మంత్రి సమీక్ష

రేవంత్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమిటి?: ఎంపీ డీకే అరుణ

For More AP News And Telugu News

Updated Date - Jun 11 , 2026 | 09:53 PM