24 నుంచి రొట్టెల పండుగ.. ఏర్పాట్లపై మంత్రి సమీక్ష
ABN , Publish Date - Jun 11 , 2026 | 08:29 PM
జిల్లాలోని బారా షహీద్ దర్గాలో నిర్వహించే రొట్టెల పండుగకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ వెల్లడించారు. రొట్టెల పండుగ సందర్భంగా ఏర్పాట్లపై గురువారం నెల్లూరులో ఉన్నతాధికారులతో మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు.
నెల్లూరు, జూన్11: జిల్లాలోని బారా షహీద్ దర్గాలో నిర్వహించే రొట్టెల పండుగకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ వెల్లడించారు. రొట్టెల పండుగ సందర్భంగా ఏర్పాట్లపై గురువారం నెల్లూరులో మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. జూన్ 24 నుంచి 30వ తేదీ వరకు బారా షహీద్ దర్గాలో రొట్టెల పండగ జరుగుతుందన్నారు.
ఈ ఏడాది ఈ పండగకు దేశ విదేశాల నుంచి 16 లక్షల నుంచి 20 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. మతసామరస్యానికి ప్రతీకగా ఈ రొట్టెల పండుగ జరుపుకుంటారని పేర్కొన్నారు. బారా షహీద్ దర్గాకు 415 సంవత్సరాల చరిత్ర ఉందని గుర్తు చేశారు. రొట్టెలు పట్టుకుంటే కోరిన కోర్కెలు తీరతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారని చెప్పారు. అందుకే ప్రతీ ఏడాది భక్తుల రద్దీ అంతకంతకు పెరుగుతోందన్నారు.
భక్తులకు తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్తు సరఫరా, వాహనాల పార్కింగ్ తదితర ఏర్పాట్లపై చర్చించారు. అలాగే సీసీ టీవీ కెమెరాలు, డ్రోన్లతో నిఘాపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. జూన్ 24వ తేదీ లోపు ఏర్పాట్లన్నీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్‌తోపాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.