Share News

Visakhapatnam Steel Plant Lands: చట్టాన్ని ఉల్లంఘించిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు: లోకేశ్

ABN , Publish Date - Jan 07 , 2026 | 06:24 PM

జగన్ ప్రభుత్వ హయాంలో జీఎంఆర్‌కు ఇచ్చిన భూములను వెనక్కి తీసుకున్నారని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్లీ ఆ భూములను జీఎంఆర్‌కు కేటాయించామని ఆయన వివరించారు.

Visakhapatnam Steel Plant Lands: చట్టాన్ని ఉల్లంఘించిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు: లోకేశ్

విశాఖపట్నం, జనవరి 07: విశాఖపట్నం స్టీల్ ప్టాంట్ ప్రైవేటీకరణ జరగదని రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ పునరుద్ఘాటించారు. ఈ స్టీల్ ప్లాంట్ భూములు విషయంలో ఎవరైనా స్టేట్‌మెంట్ ఇచ్చారా? అని విలేకర్లను ఆయన సూటిగా ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ భూములను వాటి అవసరాలకు తప్ప, మరే ఇతర అవసరాలకు వినియోగించ లేదని.. వినియోగించబోమని ఆయన స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్టాంట్ లాభాల బాటలో నడవాలని.. అందుకు అందరూ సహకరించాలని ఈ సందర్భంగా లోకేశ్ పిలుపునిచ్చారు. బుధవారం విశాఖపట్నంలో మంత్రి విలేకర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు అడిగిన ప్రశ్నలకు ఆయన జవాబిచ్చారు. భోగాపురం విమానాశ్రయం క్రెడిట్ కోసం ఎవరూ పోరాటాలు చేయడం లేదని లోకేశ్ పేర్కొన్నారు. ఎర్ర బస్సు రాని ప్రాంతానికి ఎయిర్ పోర్టు ఎందుకని గతంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.


జగన్ ప్రభుత్వ హయాంలో జీఎంఆర్‌కు ఇచ్చిన భూములను వెనక్కి తీసుకున్నారన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్లీ ఆ భూములను జీఎంఆర్‌కు కేటాయించామని వివరించారు. భోగాపురం ఎయిర్ పోర్ట్ క్రెడిట్ కావాలంటే తీసుకోవచ్చంటూ వైసీపీ వాళ్లకు లోకేశ్ సూచించారు. చిత్తూరు జిల్లా నుంచి అమర్ రాజా బ్యాటరీస్ వెళ్లగొట్టిడం, పీపీలు రద్దు, పలు కంపెనీలను రాష్ట్రం నుంచి పంపేయడం, ఆఫీస్ అద్దాలు పగలగొట్టడం వంటి సంఘటనల క్రెడిట్ అంతా వైసీపీకే దక్కుతుందని లోకేశ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.


ఒకటి రెండు నెలల్లో విశాఖపట్నం వేదికగా గూగుల్ డేటా సెంటర్ పనులు ప్రారంభమవుతాయని లోకేశ్ చెప్పారు. భోగాపురం ఎయిర్ పోర్టు కనెక్టింగ్ రోడ్లపై దృష్టి సారించామని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఒక్క 108 వాహనం ఆగలేదన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో చాలా 108 వాహనాలు ఆగిపోయాయని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు.


ఉద్యోగాలు కల్పించడానికే తక్కువ ధరలకు భూములు కేటాయిస్తున్నామని.. అది కూడా సామర్థ్యం ఉన్న కంపెనీలకే ఇస్తున్నామని లోకేశ్ వివరించారు. గత ఐదేళ్లలో వైసీపీ చేయలేని పని తాము ఇప్పుడు చేస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పెట్టుబడులు తీసుకు వస్తున్నామని తెలిపారు. రాజకీయ లబ్ది పొందటానికి కొంత మంది జల వివాదం చేస్తున్నారంటూ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. 2020లో అధికారంలో ఎవరున్నారని జలవివాదంపై ప్రశ్న అడిగిన విలేకర్లను లోకేశ్ నిలదీశారు.


గతంలో పట్టిసీమ దండగని వైఎస్ జగన్ అన్నారని గుర్తు చేశారు లోకేశ్. చట్టాన్ని ఉల్లంఘించిన వారిని ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. రాష్ట్రానికి ఆర్థిక రాజధాని విశాఖపట్నం అని తెలిపారు. క్లస్టర్ బేస్డ్ అభివృద్ధి తమ నినాదమన్నారు. మహిళలను కించపరిస్తూ మాట్లాడితే ఉపేక్షించేదే లేదన్నారు. ఇప్పటికే తప్పుచేసిన రౌడీ షీటర్లను ఊరేగింపుగా పోలీస్ స్టేషన్‌కు తీసుకు వెళ్తున్నారని.. ఈ తరహా విధానం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జరిగిందని మంత్రి లోకేశ్ సోదాహరణగా వివరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కేసీఆర్ అప్పు చేసిన మాట వాస్తవమే కానీ..: కేటీఆర్

పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణాన్ని పరిశీలించిన సీఎం.. ఉన్నతాధికారులతో సమీక్ష

For More AP News And Telugu News

Updated Date - Jan 07 , 2026 | 06:51 PM