భారత డిజిటల్ భవిష్యత్తుకు విశాఖ నూతన ద్వారం: జీత్ అదానీ
ABN , Publish Date - Apr 28 , 2026 | 12:19 PM
విశాఖలో జరిగినది ఒక ప్రాజెక్ట్ శంకుస్థాపన మాత్రమే కాదని.. ఓ కొత్త యుగానికి పునాది అని అదానీ గ్రూప్ ఛైర్మన్ జీత్ అదానీ వివరించారు. ఎనర్జీ, డేటా, కనెక్టివిటీ.. ఈ మూడు కలిసి భారత అభివృద్ధిని తదుపరి దశకు నడిపిస్తాయని అభిప్రాయపడ్డారు.
విశాఖపట్నం, ఏప్రిల్ 28: భారత డిజిటల్ భవిష్యత్తుకు విశాఖపట్నం నూతన ద్వారంగా ఎదుగుతోందని అదానీ గ్రూప్ ఛైర్మన్ జీత్ అదానీ(Jeet Adani) అన్నారు. విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఇది ఒక ప్రాజెక్ట్ శంకుస్థాపన మాత్రమే కాదని.. ఓ కొత్త యుగానికి పునాది అని వివరించారు. ఎనర్జీ, డేటా, కనెక్టివిటీ.. ఈ మూడు కలిసి భారత అభివృద్ధిని తదుపరి దశకు నడిపిస్తాయని అభిప్రాయపడ్డారు.
ఈ శతాబ్దాన్ని ముందుకు నడిపించే దేశాలు.. టెక్నాలజీని మాత్రమే కాదు, దాన్ని నిలబెట్టే శక్తిమంతమైన వ్యవస్థలను నిర్మించాలన్నారు. ఈ అవకాశానికి విశాఖపట్నం కేంద్రబిందువుగా నిలుస్తోందని చెప్పారు. ఇంటెలిజెన్స్ ఖర్చు అంటే పవర్ ఖర్చేనని, ఇదే భారతదేశానికి ఉన్న గొప్ప ప్రయోజనమని జీత్ అదానీ అన్నారు. ఈ రంగంలో అదానీ గ్రూప్ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన తెలిపారు. దశాబ్దాలుగా భారత డిజిటల్ గేట్‌వేలు ముంబై, చెన్నై వరకు మాత్రమే పరిమితమయ్యాయన్నారు. కానీ ఇప్పుడు విశాఖపట్నం ఒక కొత్త అంతర్జాతీయ డిజిటల్ గేట్‌వేగా అవతరిస్తోందని వ్యాఖ్యానించారు. తక్కువ ఖర్చుతో కూడిన ఎనర్జీ ద్వారా కంప్యూట్ వ్యయం తగ్గి, ఆపై ఇంటెలిజెన్స్ ఖర్చు కూడా తగ్గుతుందని ఆయన వివరించారు. ఇంటెలిజెన్స్ అందుబాటులోకి వచ్చినప్పుడు అవకాశాలు విస్తరిస్తాయని జీత్ అదానీ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
గూగుల్ ఏఐ డేటా సెంటర్‌కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన
అమరావతి - హైదరాబాద్ మధ్య బుల్లెట్ ట్రైన్: కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్
Read Latest AP News And Telugu News