గూగుల్ ఏఐ డేటా సెంటర్‌కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన
ABN , Publish Date - Apr 28 , 2026 | 10:53 AM
విశాఖపట్నంలోని ఆనందపురం మండలం తర్లువాడలో గూగుల్ ఏఐ డేటా సెంటర్‌కు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు.
విశాఖపట్నం, ఏప్రిల్ 28: ఆనందపురం మండలం తర్లువాడలో గూగుల్ ఏఐ డేటా సెంటర్‌కు శంకుస్థాపన జరిగింది. ఈరోజు(మంగళవారం) ఉదయం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూమి పూజ చేశారు. వన్ గిగా వాట్ సామర్థ్యంతో రూ.1.35 లక్షల కోట్ల భారీ పెట్టుబడితో మెగా డేటా సెంటర్‌ను గూగుల్ సంస్థ ఏర్పాటు చేయనుంది. డేటా సెంటర్‌కు తర్లువాడ, అడవివరం, రాంబిల్లిలో మొత్తం 600 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. అన్ని రకాల అనుమతులను సర్కార్ క్లియర్ చేసింది.
ఈ సందర్భంగా గూగుల్ క్లౌడ్, గ్లోబల్ ఇన్‌ఫ్రా వైస్ ప్రెసిడెంట్ బికాస్ కోలే మాట్లాడుతూ... గూగుల్ ఇండియా ఏఐ హబ్‌కు ఇవాళ చేసిన శంకుస్థాపన 2047 వికసిత్ భారత్‌కు ఓ పునాది రాయి లాంటిదన్నారు. ఏఐ యుగంలో విశాఖలో ఏర్పాటు చేస్తున్న ఈ డేటా సెంటర్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. భారత డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌లోనూ ఈ డేటా సెంటర్ అత్యంత ముఖ్యమైనదని చెప్పుకొచ్చారు. గ్లోబల్ ఏఐ ఎకానమీ దిశగా ఇప్పుడు విశాఖ, ఆంధ్రప్రదేశ్ పరుగులు పెడుతోందని అన్నారు. ఇంటర్నేషనల్ సబ్ సీ గేట్ వేగా ఉన్న ముంబై, చెన్నైలతో పాటు విశాఖ కూడా కీలకంగా మారిందని వెల్లడించారు.
కొత్త ఫైబర్ ఆప్టిక్ లైన్లు ఇతర ప్రాంతాలతో విశాఖను అనుసంధానం చేస్తాయని బికాస్ కోలే తెలిపారు. సముద్ర గర్భ లైన్లతో సంప్రదాయ నౌకాయాన మార్గాలు ఇక డిజిటల్ ట్రేడ్ రూట్లుగా మారతాయన్నారు. అదానీ కనెక్స్, ఎయిర్ టెల్ నెక్స్ ట్రాలు ఈ డేటా సెంటర్ ఏర్పాటులో భాగస్వామ్యం వహిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఇండస్ట్రియల్ కారిడార్‌గా ఎదుగుతున్న ఈ ప్రాంతానికి టెక్ ఫ్యూచర్‌ను అందించేలా ఈ డేటా సెంటర్ ఉంటుందని చెప్పారు. స్థానిక యువతకు ఉద్యోగ భద్రత, ఇంధన భద్రత, నీటి వినియోగం లాంటి అంశాలతో స్థానిక భాగస్వామ్యంతో ముందుకు అడుగులు వేస్తామన్నారు. యువతకు భవితను అందించేలా వారికి అడ్వాన్స్‌డ్ క్లౌడ్, ఏఐలో శిక్షణ కార్యక్రమాలను గూగుల్ నిర్వహిస్తుందని తెలిపారు. 10 వేల మందికిపైగా మహిళలకు మైక్రో ఎంట్రప్రైజ్‌గా మారేందుకు సహకారం అందిస్తుందని అన్నారు. న్యూ ట్రాన్స్ మిషన్ లైన్లు, ఎనర్జీ స్టోరేజి సిస్టమ్స్ లాంటివి ఈ ప్రాంతానికి ఇంధన భద్రతను కల్పిస్తాయన్నారు. విశాఖలోని వివిధ నివాస ప్రాంతాలు, పర్యావరణ పరిరక్షణతో పాటు ఈ ప్రాంతానికి ఆర్థిక స్థిరత్వం కల్పించేలా ఈ డేటా సెంటర్ నిర్మితం అవుతుందని బికాస్ కోలే వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, శ్రీనివాస్ వర్మ, పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు లోకేశ్, అనిత, బాల వీరాంజనేయ స్వామి, సంధ్యారాణి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, గూగుల్ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి...
అనంతపురంలో వలపువల కేసు.. వైసీపీ నేత నరేంద్రరెడ్డి అరెస్ట్
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి జర్నలిస్టును హత్య చేసిన దుండగులు
Read Latest AP News And Telugu News