Share News

ప్రపంచానికి యోగా ఓ వరం: హోం మంత్రి అనిత

ABN , Publish Date - Jun 21 , 2026 | 11:00 AM

ప్రపంచానికి యోగా ఒక వరం లాంటిదని ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత అభివర్ణించారు. ఆదివారం యోగా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆమె పాల్గొన్నారు.

ప్రపంచానికి యోగా ఓ వరం: హోం మంత్రి అనిత

విశాఖపట్నం, జూన్ 21: ప్రపంచానికి యోగా ఒక వరం లాంటిదని ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత అభివర్ణించారు. ఆదివారం యోగా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు అంతర్జాతీయ యోగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జీవనశైలిలో యోగా ఒక భాగం కావాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 15 రోజులుగా యోగాంధ్ర కార్యక్రమాలు జరుపుకున్నామని వివరించారు. ప్రతి మనిషికి దినచర్యలో యోగా ఓ భాగం కావాలని ఆకాంక్షించారు. గ్రామ, మండల స్థాయిలో యోగా కార్యక్రమాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.


ఈ యోగా కార్యక్రమాల్లో అధికారులతోపాటు ప్రజలు పాల్గొంటున్నారని మంత్రి అనిత తెలిపారు. నేడు చిన్న చిన్న పిల్లలు కూడా ఒత్తిడికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆరోగ్యంగా జీవించడానికి, ఒత్తిడిని తగ్గించడానికి యోగా ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. గతేడాది విశాఖపట్నం వేదికగా నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం గిన్నిస్ రికార్డులు సొంతం చేసుకుందని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ యోగాసనాలు వేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో సుమారు మూడు లక్షల మంది ప్రజలు పాల్గొన్నారని హోం మంత్రి అనిత వివరించారు.


ప్రపంచానికి యోగా పరిచయం చేసిన భారత్: పల్లా

ప్రపంచానికి యోగాను భారత్ పరిచయం చేసిందని టీడీపీ ఏపీ అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్ర ప్రజలకు 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జీవనశైలిలో యోగా భాగం కావాలన్నారు. యోగాను సీఎం చంద్రబాబు గ్రామీణ స్థాయిలోకి తీసుకెళ్తున్నారని వివరించారు.


వర్షం కారణంగా ఏయూ కన్వెన్షన్ సెంటర్‌కు మార్చాం: జిల్లా కలెక్టర్

గత నెల రోజులుగా విశాఖపట్నం జిల్లాలో యోగాంధ్ర కార్యక్రమాలు నిరంతరాయంగా నిర్వహించామని జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ తెలిపారు. డిఫెన్స్ అండ్ ఎక్స్- సర్వీస్‌మెన్ థీమ్‌తో నేవీ సహకారంతో ఈ యోగా కార్యక్రమాలు చేపట్టామని వివరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. యోగా దినోత్సవ కార్యక్రమంలో హోం మంత్రి అనిత, జిల్లా ప్రజా ప్రతినిధులతోపాటు పాలనా యంత్రాంగం భాగస్వామ్యం అయిందని అన్నారు. ఇందులో నేవీ, స్టీల్ ప్లాంట్, ఏయూతోపాటు పలు సంస్థలు ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నాయని వివరించారు.


రుషి కొండ బ్లూ ఫ్లాగ్ బీచ్, ఈస్ట్ పాయింట్ గోల్ఫ్ క్లబ్ వంటి పర్యాటక ప్రాంతాల్లో ప్రత్యేక యోగా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ఆర్కే బీచ్‌లో నిర్వహించాల్సిన ప్రధాన కార్యక్రమాన్ని వర్షం కారణంగా ఏయూ కన్వెన్షన్ సెంటర్‌కు మార్చామని జిల్లా కలెక్టర్ అభిషిక్త కిశోర్ చెప్పారు. యోగాంధ్ర కార్యక్రమం ద్వారా ప్రజల్లో యోగా పట్ల అవగాహన పెంచడమే ఈ ప్రభుత్వ లక్ష్యమన్నారు. యోగాను ప్రపంచానికి భారత్ అందించిన గొప్ప సంపద అని అభివర్ణించారు. యోగా ద్వారా లభించే ప్రయోజనాలను ప్రతి ఒక్కరూ పొందాలని ప్రభుత్వం ఆకాంక్షిస్తోందని పేర్కొన్నారు. యోగా ప్రయోజనాలను ప్రతి ఒక్కరూ తెలుసుకొని, మరింత మందికి చేరవేయాల్సి బాధ్యత ఉందని విశాఖ జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సాయికృష్ణ అదృశ్యంపై ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

పెద్దల పాదాలకు నమస్కరించడం వల్ల కలిగే ప్రయోజనాలు..

For More AP News And Telugu News

Updated Date - Jun 21 , 2026 | 11:04 AM