Home Minister Anitha: సంక్రాంతి సంబరాలు.. గిరిజన యువకులతో వాలీబాల్ ఆడిన హోంమంత్రి
ABN , Publish Date - Jan 16 , 2026 | 03:49 PM
అనకాపల్లి జిల్లాలోని అణుకు గ్రామస్థులతో కలిసి సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు హోంమంత్రి అనిత. కుటుంబ సమేతంగా గ్రామానికి వచ్చిన ఆమెకు ప్రజలు ఘన స్వాగతం పలికారు.
అనకాపల్లి, జనవరి 16: కోటవురట్ల మండలం గొట్టివాడ శివారులో ఉన్న మారుమూల గిరిజన గ్రామం అణుకులో హోంమంత్రి వంగలపూడి అనిత(Home Minister Vangalapudi Anitha) శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి గిరిజనులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. కుటుంబ సమేతంగా విచ్ఛేసిన మంత్రి.. గిరిజనులతో కలిసి సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. కనుమ పండగ సందర్భంగా గిరిపుత్రులతో ఎంతో సంతోషంగా గడిపారు. గ్రామస్థులు మంత్రి అనితను ‘అనితమ్మ.. మా గుండె’ అంటూ కొనియాడారు. ‘అనితమ్మ రావడం మాకు పెద్ద పండుగ’ అని ఆనందం వ్యక్తం చేశారు. గతంలో రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ఎన్నో ప్రాణాలు కోల్పోయినట్లు గిరిజనులు గుర్తుచేశారు. ఇప్పుడు రోడ్డు మంజూరు చేయించినందుకు మంత్రి అనితకు వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
పేరుపేరునా పలకరిస్తూ..
గ్రామంలోని పరిదేశమ్మ తల్లి ఆలయాన్ని మంత్రి అనిత దర్శించుకున్నారు. గిరిజనులతో ముఖాముఖి సంభాషణ జరిపి, వారి సమస్యలను వివరంగా తెలుసుకున్నారు. అక్కడి ప్రజలను పేరుపేరునా పలకరించి వారి యోగక్షేమాలు అడిగారు. చిన్నారులతో ఆడుకుని.. వారికి పుస్తకాలు, గిరిజనులకు సంక్రాంతి కానుకలు అందజేశారు. గిరిజనులకు స్వయంగా భోజనాలు వడ్డించి, తన కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు అనిత. మంత్రి కుమారుడు నిఖిల్.. అణుకు యువకులకు క్రికెట్ కిట్లు, స్పోర్ట్స్ టీషర్టులు అందజేశారు. మంత్రి అనిత, కుమారుడు నిఖిల్‌తో పాటు కుటుంబ సభ్యులు ఆ గ్రామ యువకులతో కలిసి వాలీబాల్ ఆడారు. అనంతరం.. చిన్నారుల డ్యాన్స్‌ను అభినందించారు. గిరిజనులు పండించిన కూరగాయలు, పంటలను మంత్రికి అణుకు ప్రజలు బహూకరించారు.
సంతోషంగా ఉండాలి: హోంమంత్రి
గ్రామస్థులతో మాట్లాడిన మంత్రి అనిత మాట్లాడుతూ.. ‘మీతో ప్రశాంతంగా పండుగ చేసుకోవాలని ఇక్కడకు వచ్చాను. మీ అందరితో కలిసి పండుగ చేసుకోవడం నా పూర్వజన్మ సుకృతం. నా పిల్లలను కూడా తీసుకువచ్చాను. మీ గ్రామానికి ఏమి కావాలో అన్నీ చేస్తాను. రూ. 2.50 కోట్లతో రోడ్డు మంజూరైంది. సంబంధిత ఆర్డర్ కాపీతోనే వచ్చాను. మీరంతా సంతోషంగా ఉండాలి. పిల్లలు చక్కగా చదువుకోవాలి. మంచి ఉద్యోగాలు చేయాలి’ అని హోంమంత్రి చెప్పారు.
అధికారులకు ఆదేశాలు..
2014 నుంచి 2019 వరకు ఈ గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, ఇప్పుడు రేషన్ డిపో ఏర్పాటు చేస్తున్నామని అనిత అన్నారు. త్వరలో సెల్ టవర్ స్థాపన చేస్తామని తెలిపారు. గ్రామంలో 20 మంది పిల్లలు ఇంటర్, డిగ్రీ వరకు చదివారన్న ఆమె.. ఇద్దరు ఆడపిల్లలు డిగ్రీ చదువుతుండటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాకుండా.. అణుకు గ్రామంలో ఒక్కో ఇంటికి ఒక బాత్‌రూమ్ నిర్మాణం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారామె.
ఇవి కూడా చదవండి...
వైభవంగా ప్రభల ఉత్సవం.. లక్షలాదిగా తరలిరానున్న భక్తులు
సంక్రాంతి పండుగ రోజు చోరీ.. కేవలం ఒక్కరోజులోనే..
Read Latest AP News And Telugu News