సింహాచలం చందనోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన హోం మంత్రి అనిత
ABN , Publish Date - Apr 13 , 2026 | 07:45 PM
సింహాచలం అప్పన్న స్వామివారి వార్షిక చందనోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఆలయాన్ని సందర్శించి ఏర్పాట్లను సమీక్షించారు.
విశాఖపట్నం: రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆమెకు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. ఈ నెల 20న జరగనున్న అప్పన్న స్వామివారి చందనోత్సవం ఏర్పాట్లను హోంమంత్రి పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌలిక వసతులు, పార్కింగ్, ట్రాఫిక్ నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు.
ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశించారు. అలాగే అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు NDRF, SDRF బృందాలు ఆలయం వద్ద సిద్ధంగా ఉండాలని సూచించారు. సీసీటీవీ కెమెరాల ద్వారా కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి నిరంతరం పర్యవేక్షణ జరగాలని, అవసరమైతే AI టెక్నాలజీ వినియోగించాలన్నారు. భక్తుల కోసం పెద్ద ఎత్తున ORS ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు.
చందనోత్సవం ఒక అపురూపమైన ఘట్టమని ఈ సందర్భంగా మంత్రి అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా భక్తులు స్వామివారి నిజరూప దర్శనం కోసం పెద్ద సంఖ్యలో తరలివస్తారని చెప్పారు. గత సంవత్సరం సుమారు 1.2 లక్షల మంది భక్తులు హాజరయ్యారని, ఈసారి సుమారు 2 లక్షల మంది వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు.
భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని పది చోట్ల మెడికల్ క్యాంపులు, తాగునీరు, మజ్జిగ వంటి సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి దర్శనాలు ప్రారంభమవుతాయని, అంతరాలయ దర్శనాలు ఉదయం 5 గంటల వరకు మాత్రమే ఉంటాయని వెల్లడించారు.
ఇవి కూడా చదవండి
క్రూడాయిల్ పైకి.. స్టాక్ మార్కెట్లు కిందకి..
జీవితం నాశనం చేసే అలవాట్లు ఇవే.. ప్రతి పురుషుడు తప్పక తెలుసుకోవాల్సినవి