గెలుస్తామో లేదో తెలియకపోయినా రాజకీయాల్లోకి వచ్చా: పవన్ కల్యాణ్
ABN , Publish Date - Apr 08 , 2026 | 09:42 PM
ఆంధ్ర యూనివర్శిటీ విద్యార్థులకు ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శతాబ్ది ఉత్సవాల శుభాకాంక్షలు తెలిపారు. ఏయూ మెగా కల్చరల్ ఫెస్ట్‌లో ముఖ్యఅతిథిగా పాల్గొనడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు.
విశాఖ: ఆంధ్ర యూనివర్శిటీ విద్యార్థులకు ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శతాబ్ది ఉత్సవాల శుభాకాంక్షలు తెలిపారు. ఏయూ మెగా కల్చరల్ ఫెస్ట్‌లో ముఖ్యఅతిథిగా పాల్గొనడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయానికి గొప్ప చరిత్ర ఉందని.. భారతీయ వారసత్వ సంపదకు మంచి ఉదాహరణ అని ఆయన ప్రశంసించారు. ఇక్కడ విద్యనభ్యసించినవారు ఉన్నత శిఖరాలను అధిరోహించారని పవన్ కొనియాడారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ..'ఏయూ లోగో ఎంతో బాగుంది.. ఎంతో అర్థం ఉంది. ఏయూ నిరంతరం ప్రకాశిస్తూ నిలవాలి. విద్యార్థులు ఉన్న ఫంక్షన్‌లో మాట్లాడడం అంటే నాకు పెద్ద సాహసం. ఇది అరాచక ప్రభుత్వాన్ని ఎదుర్కోవడం కంటే పెద్ద సాహసమే. యువత వద్ద నేను తెలివితేటలు వాడను.. మనస్సును మాత్రమే వాడతాను. యూనివర్శిటీలో చదువుకునే అవకాశం నాకు రాలేదు. కానీ మిమ్మల్ని కలిసే అవకాశం దేవుడిచ్చాడు. రాష్ట్ర పునర్నిర్మాణంలో యువత భాగస్వామి కావాలి. మార్పు తీసుకువచ్చేది యువత మాత్రమే. ఈ విశ్వవిద్యాలయంలో చదువుకున్న మహనీయులకు సుమాంజలులు. మీరు కొట్టిన చప్పట్లు ఆ మహనీయుల పాదాల చెంత వదిలేస్తా.
ప్రపంచాన్ని మార్చగల అతిశక్తివంతమైన ఆయుధం విద్య. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం శక్తివంతమైన దేశంగా నిలిచింది. సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఏపీ అన్ని రంగాల్లో ముందుకెళ్తోంది. విద్యార్థులు బలమైన కలలు కనాలి.. నా ఆఖరి శ్వాస వరకూ భావితరాల కోసం పని చేస్తా. సమాజంలో అందరూ భయంలో కూరుకుపోయి ఉంటే నేను నిలబడ్డా. నాకు నచ్చిన విశాఖ నుంచి పోరాటం చేశా. నేను ఓటమికి సిద్ధపడి రాజకీయాల్లోకి వచ్చా. నేను నలిగిపోయి, దెబ్బతిని మాట్లాడుతున్నా. గెలుస్తామో లేదో తెలియకపోయినా... అన్నిటికీ సిద్ధపడే రాజకీయాలకు వచ్చా. మీకు ఎవరు నచ్చకపోయిన తీసిపడేయవచ్చు.. చివరకి పవన్ కల్యాణ్ అయినా. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే సరిపోదు.. మీలో శక్తిని తెలుసుకోండి.
విద్యార్థుల్లో ఎంత శక్తి ఉంటుందో చాలామందికి తెలియదు. ప్రతి ఒక్కరూ బలమైన ఆలోచన కలిగి ఉండాలి. తల్లిదండ్రులు, దేశం గర్వపడేలా యువత ఉండాలి. బాధ్యత గల పౌరులుగా ఎదగాలని.. అద్భుత విజయాలు సాధించాలని కోరుకుంటున్నా' అని అన్నారు. అనంతరం మెగా కల్చరల్ పెస్ట్‌లో భాగంగా నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అందజేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
75 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూర్చేలా సీఎం కీలక నిర్ణయాలు
తప్పులు చేసే గ్యాస్ ఏజెన్సీలపై కఠిన చర్యలు: మంత్రి నాదెండ్ల