Share News

తప్పులు చేసే గ్యాస్ ఏజెన్సీలపై కఠిన చర్యలు: మంత్రి నాదెండ్ల

ABN , Publish Date - Apr 08 , 2026 | 08:39 PM

గ్యాస్ సిలిండర్ సరఫరాలో నిరంతర పర్యవేక్షణ, క్షేత్రస్థాయి పరిశీలన అవసరమని ఉన్నతాధికారులకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. గ్యాస్ బుకింగ్, సిలిండర్ల సరఫరా తదితర అంశాలపై బుధవారం రాజధాని అమరావతిలో పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు, జిల్లాల జాయింట్ కలెక్టర్లు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో మంత్రి నాదెండ్ల మనోహర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

తప్పులు చేసే గ్యాస్ ఏజెన్సీలపై కఠిన చర్యలు: మంత్రి నాదెండ్ల

అమరావతి, ఏప్రిల్ 08: గ్యాస్ సిలిండర్ సరఫరాలో నిరంతర పర్యవేక్షణ, క్షేత్రస్థాయి పరిశీలన అవసరమని ఉన్నతాధికారులకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. గ్యాస్ బుకింగ్, సిలిండర్ల సరఫరా తదితర అంశాలపై బుధవారం రాజధాని అమరావతిలో పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు, జిల్లాల జాయింట్ కలెక్టర్లు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో మంత్రి నాదెండ్ల మనోహర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. పదే పదే తప్పులు చేసే ఏజెన్సీలపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. బ్యాక్ ల్యాగ్స్‌ను ఈ వారంలోపు పూర్తి చేయాలని సూచించారు. ప్రజల ఇబ్బందులను ఎప్పటికప్పుడు తెలుసుకోండంటూ అధికారులకు తెలిపారు. అలాగే కాల్ సెంటర్, ప్రసార మాధ్యమాల్లో వచ్చే సమస్యలపై సైతం దృష్టి సారించాలని వారికి వివరించారు.


ఇక రబీ సీజన్‌లో రైతుల ఇబ్బందులకు తావు లేకుండా చూడాలన్నారు. కీలక సమయంలో యంత్రాంగం అంతా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. మార్చి రెండో వారంలో పశ్చిమాసియా యుద్ధ పరిణామాల కారణంగా ప్రజల్లో నెలకున్న ఆందోళనల నేపథ్యంలో జరిగిన అధిక గ్యాస్ బుకింగ్స్ బ్యాక్ ల్యాగ్స్ క్రమంగా తగ్గుతున్నాయని.. ఇది మంచి పరిణామం అని చెప్పారు. దీన్ని కొనసాగించేలా.. ఈ వారంలో బ్యాక్ ల్యాగ్స్ అన్ని పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించుకోవాలని వారిని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశించారు. ప్రసార మాధ్యమాల్లో వచ్చే సమస్యలను గమనిస్తూ, వాటిని పరిష్కరించే ఏర్పాట్లు చేయాలని వారిని కోరారు.


రాష్ట్ర వినియోగదారుల కేంద్రం 1965 కాల్ సెంటర్‌కు వచ్చే సమస్యలపైనా దృష్టి సారించాలన్నారు. ప్రతిరోజూ సమస్యలను పరిశీలన చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు. పదే పదే తప్పులు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు సరైన సమయంలో గ్యాస్ డెలివరీ జరగాలన్నారు. ప్రజలను ఇబ్బందులు పెడుతూ వారికి చెందాల్సిన గ్యాస్ సిలిండర్‌ను పక్కదారి పట్టించే ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు.


పదేపదే తప్పులు చేసే వారిపై, ప్రజల నుంచి అధికంగా ఫిర్యాదులు అందుతున్న ఏజెన్సీలపై దృష్టి సారించాలని ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న వారికి స్పష్టం చేశారు. ఏజెన్సీలను మొదట హెచ్చరించండి.. అప్పటికీ దారిలోకి రాకపోతే మాత్రం కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలను ఇబ్బందులు పాలు చేస్తే మాత్రం చర్యలు తప్పవనే సందేశం ప్రజల్లో్కి వెళ్లాలన్నారు. వచ్చిన బుకింగ్‌లు ఎప్పటికప్పుడు పూర్తి చేసేలా ఏజెన్సీలతో జాయింట్ కలెక్టర్లు నిత్యం సమీక్ష చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.


గ్రామీణ ప్రాంతాల్లో గ్యాస్ డెలివరీ విషయంలో ఆల్యసంగా జరుగుతున్నట్లు కనిపిస్తోందన్నారు. దీన్ని అదిగమించేలా గ్రామీణ ప్రాంతంలోని ఏజెన్సీల వారితో సమన్వయం చేసుకోవాలన్నారు. రోజువారీ వస్తున్న బుకింగ్స్ ఎంత..? డెలివరీలు ఎన్ని..? గతంలో ఉన్న బ్యాక్ ల్యాగ్స్ ఎన్ని పూర్తి చేస్తున్నారనే అంశాలను ప్రతి రోజూ ఏజెన్సీలు అప్ డేట్ చేసేలా ప్రత్యేక వ్యవస్థను తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.


5 కేజీల గ్యాస్ సిలిండర్ల పంపిణీకి మార్గదర్శకాలు..

కీలక సమయంలో గ్యాస్ కొరతను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం 5 కేజీల గ్యాస్ సిలిండర్లు ఇచ్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిందన్నారు.

ఈ 5 కేజీల బండలు అవసరమైన వారికి కేంద్ర మార్గదర్శకాల ప్రకారం పంపిణీ చేయాల్సి ఉందన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

విభిన్న వాతావరణ పరిస్థితులు.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి: విపత్తు నిర్వహణ సంస్థ

హోంగార్డుల సమస్యలు పరిష్కరించండి: సీఎం చంద్రబాబుకు ఏపీ బీజేపీ చీఫ్ లేఖ

For More AP News And Telugu News

Updated Date - Apr 08 , 2026 | 08:46 PM