ఆళ్ల నాని మృతిని తొలుత గుర్తించింది ‘మ్యాక్సీ’నే: వాచ్‌మన్
ABN , Publish Date - Sep 15 , 2026 | 05:26 PM
ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని మంగళవారం మృతి చెందారు. ఆయన మృతి చెందిన విషయాన్ని తొలుత పెంపుడు కుక్క (మ్యాక్సీ) గుర్తించిందని ఆళ్ల నాని ఇంటి వాచ్‌మన్ అప్పారావు తెలిపారు.
విశాఖపట్నం, సెప్టెంబర్15: ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని మంగళవారం మృతి చెందారు. ఆయన మృతి చెందిన విషయాన్ని తొలుత పెంపుడు కుక్క (మ్యాక్సీ) గుర్తించిందని ఆళ్ల నాని ఇంటి వాచ్‌మన్ అప్పారావు తెలిపారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో వాచ్‌మెన్ మాట్లాడుతూ.. ప్రతిరోజు వాకింగ్ చేసిన అనంతరం పావుగంట పాటు తనతో మాట్లాడతారని వాచ్‌మన్ వెల్లడించారు. అలాగే ఈ రోజు కూడా తనతో ఆయన మాట్లాడి ఇంట్లోకి వెళ్లారని చెప్పారు. ఆ కాసేపటికి ఇంటిలో నుంచి పెంపుడు కుక్క అరుపులు వినిపించాయని అన్నారు.
దీంతో తాను ఇంట్లోకి పరిగెత్తుకుని వెళ్లానని పేర్కొన్నారు. అయితే ఇప్పటి వరకు పెంపుడు కుక్క ఇంతలా అరిచిన దాఖలాలు లేవని వాచ్‌మన్ అప్పారావు అన్నారు. పెంపుడు కుక్క మ్యాక్సీ అరిచిన సమయంలోనే ఆళ్ల నాని మృతిచెంది ఉంటారని సందేహం వ్యక్తం చేశారు. ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించామని చెప్పారు. అప్పటికే ఆయన చనిపోయి పావుగంట అయిందని వైద్యులు నిర్ధారించారని తెలిపారు. ఆయన మరణ వార్త జీర్ణించుకోలేక పోతున్నామని ఏబీఎన్ ఎదుట వాచ్‌మన్ అప్పారావు కన్నీటి పర్యంతమయ్యారు. ఆళ్ల నాని మృతదేహం వద్ద మ్యాక్సీ కూర్చొని కంటతడి పెట్టింది.
ఆళ్ల నాని మృతదేహం రాత్రి 10 గంటలకు ఏలూరుకు చేరుకునే అవకాశం ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన అంత్యక్రియలు ఉంగుటూరు మండలం బాదంపూడి వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించాలని భావిస్తున్నారు. విదేశాల్లో ఉన్న ఇద్దరు కుమారులు బుధవారం సాయంత్రం ఏలూరు చేరుకుంటారని తెలిపారు. ఆ తర్వాత అంత్యక్రియలు ఎప్పుడు నిర్వహించాలన్న దానిపై వారు నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
కేసీఆర్ ఫాంహౌస్ వద్ద పసుపు నీళ్ల శుద్ధి.. వారిని అరెస్ట్ చేయవద్దు: హైకోర్టు
శాంత శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్ కేసు.. సుప్రీంలో తెలంగాణ ప్రభుత్వానికి షాక్
For More AP News And Telugu News