కేసీఆర్ ఫాంహౌస్ వద్ద పసుపు నీళ్ల శుద్ధి.. వారిని అరెస్ట్ చేయవద్దు: హైకోర్టు
ABN , Publish Date - Sep 15 , 2026 | 04:48 PM
బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఫాంహౌస్ వద్ద పసుపు నీళ్లతో శుద్ధి చేసిన వారిని అరెస్ట్ చేయవద్దని పోలీసులను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. మంగళవారం హైకోర్టులో కేసీఆర్ ఫాంహౌస్ అంశంపై లంచ్ మోషన్ పిటిషన్‌ను విచారించింది.
హైదరాబాద్, సెప్టెంబర్ 15: బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఫాంహౌస్ వద్ద పసుపు నీళ్లతో శుద్ధి చేసిన వారిని అరెస్ట్ చేయవద్దని పోలీసులను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. మంగళవారం హైకోర్టులో కేసీఆర్ ఫాంహౌస్ అంశంపై లంచ్ మోషన్ పిటిషన్‌ను విచారించింది. వారికి నోటీసులు ఇచ్చి దర్యాప్తు చేయాలని స్పష్టం చేసింది. ఏడేళ్లలోపు శిక్ష పడే సెక్షన్ల ఉన్న కేసులో వారిని ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం అరెస్ట్ చేయొద్దని చెప్పినా.. మళ్లీ ఎలా అరెస్ట్ చేస్తారంటూ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది.
సెప్టెంబర్ 7వ తేదీన తెలంగాణ అసెంబ్లీ వర్షా కాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన విఫలమైందంటూ బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీ వద్ద ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, విజయ్ కుమార్ రెడ్డి.. అసెంబ్లీ స్పీకర్ జి ప్రసాద్ కుమార్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వారిని శాసన మండలి సమావేశాల్లో పాల్గొనకుండా సస్పెన్షన్ వేటు వేశారు.
అంతేకాకుండా.. ఈ బీఆర్ఎస్ పార్టీ ఆందోళనకు ఎర్రవెల్లిలోని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫాంహౌస్ నుంచి కుట్ర జరిగిందని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపించారు. స్పీకర్ పై వ్యాఖ్యలకు నిరసనగా.. ఎర్రవెల్లిలోని ఫాంహౌస్ వద్ద కాంగ్రెస్ పార్టీకి చెందిన దళిత నేతలు, కార్యకర్తలు నిరసన నిర్వహించారు. అనంతరం ఆ ప్రాంతాన్ని బీఆర్ఎస్ శ్రేణులు పసుపు నీళ్లు చల్లి శుద్ధి చేశారు. ఈ చర్యపై కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇది దళితులను అవమానించే చర్య అని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపించారు. కానీ తమపై రాజకీయ కక్ష కోసం చేపట్టిన చర్య అని బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపిస్తాని ప్రకటించారు. దళితులపై అవమానకరమైన చర్యలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో పసుపు నీళ్లతో శుద్ధి చేసిన వారి అరెస్ట్‌పై హైకోర్టు జోక్యం చేసుకుని పైవిధంగా స్పందించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
మాట తప్పడం, మడమ తిప్పడమే సీఎం రేవంత్ రెడ్డి ట్రేడ్ మార్క్: కవిత
బేగంపేట క్యాబ్ డ్రైవర్ రాజశేఖర్ హత్య కేసును ఛేదించిన పోలీసులు
For More TG News And Telugu News