Share News

డీఎస్సీ ఉద్యోగం పేరుతో రూ.12 లక్షల మోసం!

ABN , Publish Date - Jan 23 , 2026 | 02:21 PM

ఉపాధ్యాయ ఉద్యోగం ఇప్పిస్తానని ఓ మహిళను మోసం చేసిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడికి గతంలోనూ ఉద్యోగాల పేరుతో మోసాలు చేసిన చరిత్ర ఉందని పోలీసులు తెలిపారు.

డీఎస్సీ ఉద్యోగం పేరుతో రూ.12 లక్షల మోసం!
Anakapalli DSC Job Scam

అనకాపల్లి జిల్లా: ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగం ఇప్పిస్తానని ఓ మహిళను మోసం చేసిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. రోలుగుంట మండలానికి చెందిన ఓ మహిళకు డీఎస్సీలో ఎస్జీటీ(SGT) పోస్టు ఇప్పిస్తానని.. ప్రకాశం జిల్లా నాయుడుపాలెం గ్రామానికి చెందిన ఎర్రగొర్ల శ్రీను అనే వ్యక్తి హామీ ఇచ్చాడు.


ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేషీలో ఉన్నత స్థాయి అధికారులతో పరిచయం ఉందని నమ్మించి.. ఆ మహిళ నుంచి రూ.12 లక్షలకుపైగా నగదు కాజేశాడు. బాధిత మహిళ దశల వారీగా అతడికి ఈ నగదు చెల్లించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ మోసానికి సహకరించిన విజయవాడకు చెందిన షేక్ సలీం అనే వ్యక్తినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరూ కలిసి సీఎం కార్యాలయంతో సంబంధాలు ఉన్నాయంటూ.. ఆమెను మభ్యపెట్టినట్లు పోలీసులు తెలిపారు.


ఈ విషయమై జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా మాట్లాడుతూ.. ప్రధాన నిందితుడు ఎర్రగొర్ల శ్రీను గతంలో కూడా ఎస్సై, లైన్‌మెన్ ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురిని మోసం చేసి డబ్బులు వసూలు చేసిన చరిత్ర ఉన్నట్లు వెల్లడించారు. ఈ కేసులో మరింత మంది బాధితులు ఉండే అవకాశం ఉందన్న ఆయన.. పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతోందని తెలిపారు. ఉద్యోగాల పేరుతో ఎవరైనా డబ్బులు అడిగితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి మోసాలపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ సూచించారు.


ఇవి కూడా చదవండి...

విషాదం.. పురుగులమందు తాగి కుటుంబం ఆత్మహత్య.!

సీఎం అధ్యక్షతన ఎస్‌ఎల్‌బీసీ సమావేశం.. కీలక అంశాలపై చర్చ

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 23 , 2026 | 03:24 PM