ఏపీ రాజధాని ఎప్పటికీ అమరావతే: ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు
ABN , Publish Date - Jul 06 , 2026 | 03:47 PM
అమరావతే రాజధాని అని గతంలో జగన్‌తో సహా అన్ని పార్టీలు ఒప్పుకున్నాయని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గుర్తుచేశారు. 2019లో అధికారంలోకి రాగానే జగన్ మాట మార్చి మూడు రాజధానులు అన్నారని మండిపడ్డారు.
విశాఖపట్నం, జులై 6: మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు(సోమవారం) మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల మేనిఫెస్టోలో ‘మావిగన్’ పెడతానని జగన్ చెప్పడం దురదృష్టకరమన్నారు. అమరావతే రాజధాని అని గతంలో జగన్‌తో సహా అన్ని పార్టీలు ఒప్పుకున్నాయని గుర్తుచేశారు. 2019లో అధికారంలోకి రాగానే జగన్ మాట మార్చి మూడు రాజధానులు అన్నారని మండిపడ్డారు. కూటమి హయాంలో రాష్ట్ర అభివృద్ధిని చూడలేక జగన్ ఏవేవో కామెంట్స్ చేస్తున్నారని విమర్శించారు. ఇప్పుడు మావిగన్ అంటున్నారని.. జగన్ ఇప్పటికైనా రాజకీయ కుట్రలు మానాలని హితవుపలికారు.
ఏపీ రాజధాని అమరావతిగా కేంద్రం ప్రకటించిందని... ఎప్పటికీ రాజధానిగా అమరావతే ఉంటుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. మావిగన్ మీద మాట్లాడాలంటే జగన్ అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలన్నారు. అసెంబ్లీకి రాకుండా బయట ప్రెస్‌మీట్లు పెట్టడం సరికాదన్నారు. ‘సర్’ పేరుతో ఓట్లను ఎక్కడా తొలగించడం లేదని వెల్లడించారు. రుషికొండ భవనాలు అద్భుతమైన ప్రాపర్టీ అని.. ఇది ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలన్నారు. ఈ భవనాలను కేవలం ఫైవ్‌స్టార్ హోటల్‌కు ఇవ్వడం సరికాదని.. అందరికీ అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సూచించారు.
ఇవి కూడా చదవండి...
ఏపీలో స్థానిక కేడర్ల పునర్‌వ్యవస్థీకరణ ప్రక్రియ మరింత వేగవంతం
బీసీల సంక్షేమానికి రికార్డు స్థాయిలో కేటాయింపులు: మంత్రి సవిత
Read Latest AP News And Telugu News