అల్లూరి జిల్లాలో భారీ పేలుడు.. ఐదుగురి మృతి
ABN , Publish Date - Oct 24 , 2026 | 10:18 AM
అల్లూరి జిల్లాలోని అనంతగిరి మండలంలో ఘోర ప్రమాదం జరిగింది. ఈరోజు ఉదయం పినకోట వద్ద మైనింగ్ ప్రాంతంలో భారీ పేలుడు సంభవించింది.
అల్లూరి జిల్లా, అక్టోబర్ 24: జిల్లాలోని అనంతగిరి మండలంలో ఘోర ప్రమాదం జరిగింది. ఈరోజు(శనివారం) ఉదయం పినకోట వద్ద మైనింగ్ ప్రాంతంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. వాహనంలో డీజిల్ నింపుతుండగా మంటలు అంటుకుని పేలుడు జరిగింది. మృతుల్లో డ్రైవర్, ముగ్గురు కార్మికులు ఉండగా.. ఓ ఉపాధ్యాయురాలు కూడా ప్రాణాలు కోల్పోయారు.
టీచర్ సునీత పాఠశాలకు వెళ్తున్న సమయంలో బొలెరో వాహనంలో ప్రయాణిస్తున్నారు. వాహనం నుంచి టిప్పర్‌కు డీజిల్ నింపుతుండగా మంటలు అంటుకొని రహదారి నిర్మాణానికి తీసుకెళ్తున్న జిలెటిన్ స్టిక్స్ ఒక్కసారిగా పేలాయి. ఈ ప్రమాదంలో మృతుల శరీర భాగాలు చిన్నాభిన్నమయ్యాయి. అనంతగిరి మండల కేంద్రానికి సుమారు 90 కిలోమీటర్ల దూరంలో ప్రమాదం చోటు చేసుకుంది. గుత్తేదారు రోడ్డు నిర్మాణ పనుల నిమిత్తం జిలెటెన్ స్టిక్స్ తీసుకుళ్తున్న సమయంలో పేలుడు సంభవించింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
మృతులు వీరే..
టీచర్ సునీత (విశాఖపట్నం)
కార్మికుడు మణి (దేవరపల్లి)
కార్మికుడు నారాయణరావు (చీడికాడ )
కార్మికుడు పవన్ కుమార్ (కడప)
వీరితోపాటు డ్రైవర్ మృతి చెందిన వారిలో ఉన్నారు
పేలుడు ఘటన అత్యంత బాధాకరం: హోం మంత్రి
అనంతగిరి మండలం పినకోట ప్రాంతంలో పేలుడు ఘటనపై హోం మంత్రి వంగలపూడి అనిత స్పందించారు. పినకోట ప్రాంతంలో పేలుడు ఘటనపై ఆరా తీశారు. అల్లూరి జిల్లా కలెక్టర్, ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడారు. పేలుడు ఘటన జరగడం అత్యంత బాధాకరమని హోం మంత్రి అన్నారు. పేలుడు ఘటనలో మృతి చెందిన వారి పట్ల తీవ్ర సంతాపం తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఘటనాస్థలిలో బాధితులకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలన్నారు. ప్రమాద బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హోం మంత్రి అనిత హామీ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి..
టెహ్రాన్‌పై మరోసారి కాలు దువ్వుతున్న ట్రంప్.. తీవ్ర పరిణామాలు తప్పవంటున్న ఇరాన్..
మహిళల వాష్‌రూమ్‌లో రహస్య కెమెరా.. అటెండెంట్ అరెస్ట్
Read Latest AP News And Telugu News