Share News

వైసీపీ అభ్యర్థిని భర్తపై అదే పార్టీ నేతల దాడి

ABN , Publish Date - Oct 24 , 2026 | 06:32 AM

జీవీఎంసీ ఎన్నికల్లో 14వ వార్డు కార్పొరేటర్‌ పదవికి వైసీపీ తరఫున నామినేషన్‌ వేసి, ఉపసంహరించుకున్న రెడ్డి కిరణ్మయి భర్త లావేటి దాసుపై అదే పార్టీకి చెందిన ఇద్దరు వ్యక్తులు దాడిచేశారు.

వైసీపీ అభ్యర్థిని భర్తపై అదే పార్టీ నేతల దాడి

  • నామినేషన్‌ ఉపసంహరణే కారణం

విశాఖపట్నం/గుంటూరు, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): జీవీఎంసీ ఎన్నికల్లో 14వ వార్డు కార్పొరేటర్‌ పదవికి వైసీపీ తరఫున నామినేషన్‌ వేసి, ఉపసంహరించుకున్న రెడ్డి కిరణ్మయి భర్త లావేటి దాసుపై అదే పార్టీకి చెందిన ఇద్దరు వ్యక్తులు దాడిచేశారు. ఈ ఘటనలో దాసు ప్రయాణిస్తున్న కారు ధ్వంసం కావడంతోపాటు అతనికి స్వల్పగాయాలయ్యాయి. ఆరిలోవ పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరిని అరెస్టు చేశారు. ఆరిలోవ బాలాజీనగర్‌కు చెందిన లావేటి దాసు భార్య రెడ్డి కిరణ్మయి జీవీఎంసీ ఎన్నికల్లో 14వ వార్డు నుంచి వైసీపీ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు.

తర్వాత పార్టీ నుంచి ఆర్థిక సహాయం అందదని తెలుసుకుని ఈ నెల 21న నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి దాసు తన స్నేహితుడి కారులో వెళుతుండగా పాత ఆరిలోవ దర్గాలమ్మగుడి సమీపంలో బాలాజీనగర్‌కు చెందిన వైసీపీ కార్యకర్తలు ఈగల జగదీశ్‌, నక్కాన ఎర్రాజీ కర్రలతో కారుతోపాటు దాసుపై దాడి చేశారు.


నామినేషన్‌ కేంద్రం వద్ద వైసీపీ నాయకుల బీభత్సం

గుంటూరు జిల్లా మండల పరిషత్‌ కార్యాలయం వద్ద శుక్రవారం సాయంత్రం నామినేషన్‌ వేసేందుకు వచ్చిన పోట్లూరుకు చెందిన వైసీపీ నాయకులు గుంటూరు-కర్నూలు జాతీయ రహదారిపై కారుతో బీభత్సం సృష్టించారు. పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలోని పోట్లూరు ఎంపీటీసీ స్థానానికి నామినేషన్‌ వేసేందుకు తమకు భద్రత కల్పించాలని పోట్లూరుకు చెందిన వైసీపీ నాయకులు జిల్లా కలెక్టర్‌ కృతికాశుక్లను కోరడంతో ఆమె ఆదేశాల మేరకు ఎస్‌ఐ వెంకటేశ్‌బాబు వారిని నామినేషన్‌ కేంద్రం వద్దకు తీసుకొచ్చేందుకు శావల్యాపురం సెంటర్‌కు బయలుదేరారు.

అప్పటికే పోట్లూరుకు చెందిన వైసీపీ నేతలు గడిపూడి రామాంజనేయులు, అబ్బూరి శ్రీనివాసరావు, అబ్బూరి రామాంజనేయులు, దావులూరి భాస్కర్‌రావు, గడిపూడి మారుతి మద్యంతాగి శావల్యాపురం సెంటర్‌కు వచ్చారు. కారును అతివేగంగా నడుపుతూ నామినేషన్‌ వేసి రోడ్డుపక్కన నిలబడ్డ టీడీపీ వర్గీయులను కవ్విస్తూ వారిపైకి కారు పోనిచ్చారు. తప్పించుకొనే క్రమంలో పోట్లూరుకు చెందిన గోనుగుంట్ల మహేశ్‌, బొందిలిపాలేనికి చెందిన సోమేపల్లి వెంకట్రావు, సిద్దల నెహేమియాకు గాయాలయ్యాయి. ముండ్రువారిపాలేనికి చెందిన కొమ్మతోటి రవిబాబుకు కాలు విరిగింది.

ఈ వార్తలనూ చదవండి:

పల్లె పండుగకు నిధుల గండం

ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

Updated Date - Oct 24 , 2026 | 06:32 AM