Share News

విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టుకు క్రూయిజ్‌!

ABN , Publish Date - Oct 04 , 2026 | 03:48 AM

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి రాకపోకలను మరింత సులభతరం చేసే దిశగా సరికొత్త ఆలోచనలకు రూపకల్పన జరిగింది.

విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టుకు క్రూయిజ్‌!

  • విశాఖ నుంచి విమానాశ్రయానికి క్రూయిజ్‌!

  • విమాన ప్రయాణికులకు సమయం ఆదా

  • ఈ ప్రతిపాదనతో పర్యాటకానికీ ఊపు

విజయనగరం, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి రాకపోకలను మరింత సులభతరం చేసే దిశగా సరికొత్త ఆలోచనలకు రూపకల్పన జరిగింది. రోడ్డు రవాణాపై ఒత్తిడిని తగ్గిస్తూ విశాఖ నుంచి ఫెర్రీ లేదా క్రూయిజ్‌లు నడపాలన్న ప్రతిపాదనలను ప్రభుత్వం సీరియ్‌సగా పరిశీలిస్తోంది. చిన్నపాటి నౌకలు... 80 మంది ప్రయాణికులను తీసుకెళ్లే సామర్థ్యం ఉన్న నౌకలతో వేగంగా, ఆహ్లాదకర వాతావరణంలో భోగాపురం విమానాశ్రయానికి చేరుకోవచ్చు. ఎలాంటి ట్రాఫిక్‌ అడ్డంకులు లేకపోతే విశాఖ నుంచి భోగాపురం చేరుకోవడానికి కనీసం 2గంటలు పడుతుంది. ఏదైనా చిన్న అడ్డంకి ఏర్పడితే ఎప్పటికి చేరతామో చెప్పలేదని దుస్థితి. అదే జలమార్గంలో అయితే గరిష్ఠంగా గంటలోపే ఎయిర్‌పోర్టుకు చేరుకోవచ్చు. దీనికోసం విశాఖ పోర్టు, ఫిషింగ్‌ హార్బర్‌, రిషికొండ వద్ద ప్యాసింజర్‌ జెట్టీలు, సీప్లేన్‌ టెర్మినల్స్‌ నిర్మించాల్సి ఉంటుంది. భోగాపురం మండలం ముక్కాం, కంచేరు, చింతపల్లిలో సైతంపై నిర్మాణాలు చేపడితే ప్రయాణికులు వేగంగా గమ్యస్థానాలకు చేరుకుంటారు. భోగాపురం విమానాశ్రయం కనెక్టివిటీపై అధ్యయనం చేసిన సిడార్‌(సొసైటీ ఫర్‌ ఇంటిగ్రేటెడ్‌ డెవల్‌పమెంట్‌ అండ్‌ రీసెర్చ్‌) ఈ దిశగా కీలక సిఫారసులు చేసినట్టు తెలుస్తోంది.

ట్రాఫిక్‌ రహిత సులభతర సేవలకు..

రోడ్డు మార్గంలో ట్రాఫిక్‌ చిక్కులు దాటుకుని వెళ్లడం కంటే... ఆహ్లాదకరమైన వాతావరణంలో, అలల సవ్వడుల నడుమ ప్రయాణాన్ని ఎవరు కాదంటారు..! దీనికోసం ముందుగా విశాఖ సాగర్‌ నగర్‌లో, భోగాపురం మండలం ముక్కాం తీరంలో ప్యాసింజర్‌ జెట్టీలు నిర్మిస్తారు. విశాఖలోని పలు ప్రాంతాల నుంచి సాగర్‌ నగర్‌ జెట్టీ వద్దకు, అలాగే ముక్కాం తీరం నుంచి విమానాశ్రాయానికి వెళ్లేందుకు ఫీడర్‌ బస్సులు, క్యాబ్‌ సర్వీసులు అందుబాటులోకి తెస్తారు. సముద్రపు అలలపై సాగే క్రూయిజ్‌ ప్రయాణం ప్రయాణికులకు కొత్త అనుభూతి ఇవ్వనుంది. ఇప్పటివరకూ అంతగా ప్రాచుర్యం పొందని ముక్కాం తీరం క్రూయిజ్‌ రాకతో పర్యాటకంగా కూడా అభివృద్ధి సాధించనుంది. జెట్టీల చుట్టూ బీచ్‌ ఫ్రంట్‌ అభివృద్ధి, వాటర్‌ స్పోర్ట్స్‌, రెస్టారెంట్లు వంటి పర్యాటక వసతులు ఏర్పాటుకావడం ద్వారా స్థానిక యువతకు, మత్స్యకార కుటుంబాలకు పెద్ద ఎత్తున ఉపాధి లభించనుంది.


పర్యాటకానికి మరింత ఊపు..

ఇప్పటికే భోగాపురం విమానాశ్రయం చుట్టూ పర్యాటక, ఆతిథ్య ప్రాజెక్టులు పట్టాలెక్కాయి. చింతపల్లి తీరంలో ఉన్న పాత టూరిజం కాటేజీలను ఏపీ స్కూబా డైవింగ్‌ సంస్థకు కేటాయించి అభివృద్ధి చేస్తున్నారు. జీఎంఆర్‌ సంస్థ రూ.500 కోట్లతో ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ నిర్మించనుంది. ప్రభుత్వం 80 ఎకరాలు మై కేర్‌, ఒబెరాయ్‌ సంస్థలకు కేటాయించింది. పలు ప్రైవేటు సంస్థలు రూ.100 కోట్లతో బీచ్‌ ఫ్రంట్‌ రిసార్టుల నిర్మాణాన్ని ప్రారంభించాయి. రూ.150 కోట్లతో కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణం కూడా జరగనుంది. తాజాగా ఈ క్రూయిజ్‌ బోట్ల ప్రాజెక్టు రానుండడంతో మొత్తం తీర ప్రాంతం మరింత అభివృద్ధి జరగనుంది.

ప్రతిపాదనలపై అధ్యయనం చేస్తున్నాం

‘విశాఖ నుంచి భోగాపురం మండలం ముక్కాంకు క్రూయిజ్‌ సర్వీసుల ఏర్పాటు ప్రతిపాదన నిజమే. పర్యాటక అభివృద్ధితో పాటు రోడ్డు మార్గంలో ట్రాఫిక్‌ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్టు తెరపైకి వచ్చింది. దీనిపై అధ్యయనం చేస్తున్నాం. ఈ ప్రాజెక్టు సాకారమైతే తీర ప్రాంతం మరింత అభివృద్ధి జరుగుతుంది. పర్యాటక, ఆతిథ్య ప్రాజెక్టులు పట్టాలెక్కుతాయి’

- ఎస్‌. రాంసుందర్‌రెడ్డి, కలెక్టర్‌, విజయనగరం

ఈ వార్తలనూ చదవండి:

ట్రేడింగ్‌ చీటింగ్‌

పెట్‌ స్కాన్‌కు ప్రతిపాదన

అసలుకే మోసం!

Updated Date - Oct 04 , 2026 | 03:48 AM