తిరుపతిలో అపహరణకు గురైన చిన్నారి కథ సుఖాంతం.. ఆరుగురి అరెస్ట్
ABN , Publish Date - Jan 24 , 2026 | 02:41 PM
తిరుపతిలోని చింతల చెరువులో బుధవారం పదమూడు నెలల చిన్నారి కిడ్నాప్ స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. చివరకు ఈ కథ సుఖాంతమైంది.
తిరుపతి, జనవరి 24: తిరుపతిలో ఈ నెల 21న ఓ 13 నెలల చిన్నారి జయశ్రీని కిడ్నాప్(Kidnapping) చేసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చిన్నారిని అపహరించిన నిందితుల కోసం పలు బృందాలుగా ఏర్పడి గాలించారు పోలీసులు. కిడ్నాప్‌నకు గురైన సమయంలో పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీ దృశ్యాలను పరిశీలించి.. మరియమ్మ, మురుగన్ భార్యాభర్తలు అపహరించినట్టు గుర్తించారు.
బాలికను అపహరించిన అనంతరం.. వారు మద్యం సేవించినట్లు తెలుస్తోంది. చిన్నారిని భుజంపై వేసుకుని రైలులో కాట్పాడి నుంచి ఈరోడ్ పట్టణం వరకూ వారిద్దరూ భిక్షాటన చేసినట్లు సమాచారం. పోలీసులు.. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా చిన్నారిని విక్రయించిన ప్రాంతాన్ని చూపారు. దీంతో ఆ బాలికను సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు పోలీసులు.
ఈ ఘటనలో ఇద్దరు కిడ్నాపర్లు, చిన్నారిని కొనుగోలు చేసిన నలుగురు కుటుంబ సభ్యులు సహా మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి రూ.25,271 నగదుతో పాటు టీవీఎస్ ఎక్సెల్‌నూ స్వాధీనం చేసుకున్నారు.