Share News

బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవం

ABN , Publish Date - Sep 16 , 2026 | 03:50 AM

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు మంగళవారం ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. సీఎం చంద్రబాబు ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించగా, బుధవారం పలు టీటీడీ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.

బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవం
Chandrababu Naidu

  • ధ్వజారోహణంతో తిరుమలలో వైభవంగా ప్రారంభం

  • స్వామికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు

  • మాడవీధుల్లో పెద్దశేషుడిపై మలయప్ప చిద్విలాసం

  • నేడు చిన్నశేష, హంస వాహన సేవలు

తిరుమల/తిరుపతి(టీటీడీ), సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మంగళవారం సాయంత్రం 6.21- 6.35 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణ కార్యక్రమాన్ని శాస్ర్తోక్తంగా నిర్వహించారు. వేద ఘోష మధ్య మంగళవాయిద్యాలు మోగుతుండగా బంగారు ధ్వజస్తంభంపై గరుడ పటాన్ని ఎగురవేసిన అర్చక బృందం.. సకల దేవతామూర్తులు, అష్టదిక్పాలకులకు ఆహ్వానం పలికింది. దీంతో సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు మంగళవారం రాత్రి శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్ప స్వామి పెద్దశేష వాహనంలో నాలుగు మాడవీధుల్లో ఊరేగుతూ భక్తకోటిని కటాక్షించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం చంద్రబాబు 15వ సారి శ్రీవారికి పట్టువస్ర్తాలు సమర్పించారు.


చంద్రబాబు తన సతీమణి భువనేశ్వరి, మంత్రి లోకేశ్‌ దంపతులతో కలిసి మంగళవారం సాయంత్రం తిరుమలలోని గాయత్రి విశ్రాంతి భవనానికి చేరుకుని కొంతసమయం విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం సంప్రదాయ వస్త్రధారణతో తొలుత బేడి ఆంజనేయస్వామి ఆలయం వద్దకు చేరుకున్నారు. అక్కడ అర్చకులు చంద్రబాబు తలకు పరివట్టం చుట్టి శేషవస్త్రాన్ని మెడలో ధరింపజేశారు. ఆ తర్వాత నూతన పట్టువస్త్రాలను తలపై పెట్టుకుని మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని వస్త్రసమర్పణ చేశారు. అనంతరం టీటీడీ ముద్రించిన 2027 నూతన సంవత్సర క్యాలెండర్‌, డైరీలను సీఎం ఆవిష్కరించారు. అక్కడినుంచి వాహన మండపానికి చేరుకుని పెద్దశేష వాహన సేవలో పాల్గొని ఉత్సవమూర్తులను దర్శించుకున్నారు.


నేడు ప్రారంభోత్సవాలు

వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌ను సీఎం చంద్రబాబు బుధవారం ప్రారంభిస్తారు. తిరుమలకు వచ్చే భక్తులందరికీ బీమా కల్పించేలా ఎల్‌ఐసీ సంస్థతో ఎంవోయూ చేసుకుని, ‘నందకం’ యాప్‌ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత ముఖేశ్‌, అనంత్‌ అంబానీ విరాళంగా ఇచ్చిన 25 ఎలక్ర్టిక్‌ బస్సులను జెండా ఊపి ప్రారంభించనున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునికీకరించిన ఎస్వీ మ్యూజియంను ప్రారంభిస్తారు.


భక్తులకు ఇబ్బంది లేకుండా శ్రీవారి దర్శనం: సీఎం

దేశంలో, ప్రపంచంలో ఉండే హిందువులంతా ఒక్కసారైనా తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకోవాలని, ఆయన సాన్నిధ్యంలో కొంత సమయం గడపాలని ఆశిస్తారని చంద్రబాబు అన్నారు. భక్తులందరికీ ఇబ్బంది లేకుండా దర్శనం కల్పించే విధంగా పాలకమండలి, టీటీడీ సిబ్బంది పనిచేయాలని కోరారు. ముఖ్యమంత్రిగా 15వ సారి వచ్చి ప్రభుత్వం తరఫున లాంఛనాలు సమర్పించడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. రాష్ట్రంలో పుష్కలంగా వర్షాలు పడాలని, రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ ముందుండి నడిపించేలా ఆశీర్వదించాలని శ్రీవారిని కోరుకున్నానని సీఎం తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆరోగ్యవంతమైన ఏపీ కోసం ఎన్డీఏ సర్కార్ పనిచేస్తుంది: సీఎం చంద్రబాబు

ఫ్రీహోల్డ్‌కు విముక్తి

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 16 , 2026 | 03:50 AM