అమరావతికి రాచబాట!
ABN , Publish Date - Sep 07 , 2026 | 05:37 AM
రాజధాని అమరావతిని ఎన్‌హెచ్-16తో అనుసంధానించే తొలి రోడ్డుగా ఈ-13 ఎక్స్‌టెన్షన్ రోడ్డు నిలవనుంది. జాతీయ రహదారిని అమరావతితో కలిపేలా రెండు ‘ఈ’ సిరీస్ రోడ్లను అమరావతి మాస్టర్ ప్లాన్‌లో రూపొందించారు. వీటిలో సీడ్ యాక్సిస్ రోడ్డు ఫేజ్-3 పనులు ప్రారంభమైతే తప్ప.. అది ఎన్‌హెచ్-16తో కలిసే వీలు లేదు.
రాజధానిని ఎన్‌హెచ్-16తో కలిపే తొలి రహదారి
ఆకర్షణీయంగా, అద్భుతంగా ‘ఈ-13’ రోడ్డు నిర్మాణం
యర్రబాలెం నుంచి మొదలయ్యే రెండో భాగం కీలకం
మంగళగిరి ఎయిమ్స్‌కు సమీపంలో భారీ ఆర్వోబీ
రెండు కొండలను తొలుస్తూ ఘాట్ రోడ్డు పనులు
కొండలను కలుపుతూ పెద్ద ఎలివేటెడ్ కారిడార్
పైలింగ్ పనులు పూర్తై, ఊపందుకున్న పిల్లర్ల నిర్మాణం
డీజీపీ కార్యాలయం వద్ద ప్రత్యేకంగా ట్రంపెట్
ఎన్‌హెచ్‌పై రెండు ఫ్లైఓవర్లు, సర్వీస్ రోడ్లు, అండర్‌పాస్‌లు
రూ.900 కోట్లతో నిర్మితమవుతున్న భారీ రహదారి
గుంటూరు(రాజధాని), సెప్టెంబరు 6(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిని ఎన్‌హెచ్-16తో అనుసంధానించే తొలి రోడ్డుగా ఈ-13 ఎక్స్‌టెన్షన్ రోడ్డు నిలవనుంది. జాతీయ రహదారిని అమరావతితో కలిపేలా రెండు ‘ఈ’ సిరీస్ రోడ్లను అమరావతి మాస్టర్ ప్లాన్‌లో రూపొందించారు. వీటిలో సీడ్ యాక్సిస్ రోడ్డు ఫేజ్-3 పనులు ప్రారంభమైతే తప్ప.. అది ఎన్‌హెచ్-16తో కలిసే వీలు లేదు. అయితే ఈ-13 రోడ్డు పనులు ఇప్పటికే మొదలై చాలా వరకూ ముందుకెళ్లాయి. ఇది పూర్తయితే ఎన్‌హెచ్-16ను కలిపే తొలి అమరావతి రహదారిగా ఈ-13 నిలవనుంది. రాజధాని కోసం నిర్మించే ట్రంకు రోడ్లలో అత్యంత సంక్లిష్టమైన జాబితాలో ఈ-13 ఎక్స్‌టెన్షన్ రోడ్డు ఒకటి. ప్రధానంగా మంగళగిరి-తాడేపల్లి, ఎయిమ్స్, ఎన్‌హెచ్-16లను అనుసంధానించే ఈ రోడ్డు రెండు కొండల మీదుగా నిర్మాణం అవుతోంది. దీని నిర్మాణంలో ఆర్వోబీ, ఎలివేటెడ్ కారిడార్ వంటి కూడా ఉన్నాయి. దీని నిర్మాణం పూర్తయితే ఈ రోడ్డు ఎంతో ఆకర్షణీయంగా, ఇంజనీరింగ్ అద్భుతంగా నిలవనుంది.
రెండు దశల్లో నిర్మాణం
ఈ-13 రోడ్డును రెండు దశల్లో నిర్మిస్తున్నారు. 10.45 కిలోమీటర్లు ఉండే ఈ రోడ్డు తొలిభాగం నెక్కల్లు, అనంతవరం నుంచి యర్రబాలెం వరకూ ఉంటుంది. 7.3 కి.మీ. పొడవు ఉన్న ఈ రోడ్డును ఈ-13 రోడ్డుగా పరిగణిస్తారు. దీని నిర్మాణం కోసం రూ.208 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఈ రోడ్డు నిర్మాణంలో రెండో భాగం చాలా కీలకం. ఈ భాగంలో రోడ్డు పొడవు 3.43 కి.మీ. మాత్రమే ఉన్నా.. ఖర్చు మాత్రం రూ.400 కోట్లకు పైగా ఉంటోంది. అదేకాకుండా కేంద్ర ప్రభుత్వం రూ.274 కోట్ల అంచనాలతో ఆర్వోబీని కూడా నిర్మిస్తోంది. యర్రబాలెంలోని పోతరాయ చెరువు నుంచి ఈ రెండో భాగం మొదలవుతోంది. దీన్ని ఈ-13 ఎక్స్‌టెన్షన్ రోడ్డుగా అధికారులు చెబుతున్నారు. యర్రబాలెం నుంచి డాన్‌బాస్కో స్కూలు, విజయవాడ-గుంటూరు రైల్వేట్రాక్ మీదుగా డోలాస్ నగర్ కొండలు, ఎయిమ్స్, డీజీపీ కార్యాలయం మీదుగా ఎన్‌హెచ్-16 వరకూ దీన్ని నిర్మిస్తున్నారు.
రెండు కొండలను తొలచి..
ఈ-13 ఎక్స్‌టెన్షన్ రోడ్డు నిర్మాణంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. 60 మీటర్ల వెడల్పుతో 6 లేన్లుగా నిర్మించే ఈ రోడ్డులో యర్రబాలెంలోని డాన్‌బాస్కో స్కూలు వద్ద ఆర్వోబీ నిర్మిస్తున్నారు. ఇది నేరుగా ఎయిమ్స్ వెనుకభాగాన ఉన్న కొండ మీద ల్యాండ్ అవుతుంది. అక్కడి నుంచి కొండను తొలచి ఆరు లేన్ల రోడ్డు వేస్తున్నారు. ఇప్పటికే కొండను తొలచే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అక్కడి నుంచి ఎయిమ్స్ వెనుకభాగాన్ని ఆనుకుని మరో కొండ మీదకు రోడ్డు వెళ్తుంది. ఇక్కడ రెండు కొండలను కలుపుతూ భారీ పిల్లర్లతో పెద్ద ఎలివేటెడ్ కారిడార్ (భారీ వంతెనతో) రోడ్డు వేస్తారు. అక్కడి నుంచి డీజీపీ కార్యాలయం వరకు రోడ్డు వస్తుంది. అక్కడ జాతీయ రహదారితో ఎక్స్‌టెన్షన్ రోడ్డు కలుస్తుంది.
ఆర్వోబీకి తొలగిన అడ్డంకులు
ఈ-13 రోడ్డు నిర్మాణంలో ఆర్వోబీ కీలకం. దీనికి కేంద్రం పూర్తిస్థాయిలో నిధులు కేటాయించింది. 609 మీటర్ల పొడవు ఉండే ఈ ఆర్వోబీ నిర్మాణంలో 250 మీటర్ల మేర ఎయిమ్స్‌కు చెందిన భూమిలో నిర్మించాల్సి వస్తోంది. అందుకు 3.34 ఎకరాల భూమి అవసరం. దీంతో ఎయిమ్స్ యాజమాన్యంతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతూ వచ్చింది. కేంద్ర స్థాయిలో కూడా పరిస్థితిని తెలియజేయడంతో.. కిందటి నెల సమస్య పరిష్కారమైంది. దీంతో ఆర్వోబీ నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయి.
ఈ వార్తలను కూడా చదవండి
క్రీడలకు ప్రభుత్వం ప్రాధాన్యం: శంకర్