Share News

తాగు నీటికే సిద్ధాపురం

ABN , Publish Date - Sep 06 , 2026 | 11:45 PM

ఈ ఏడాది సిద్ధాపురం చెరువు జలాల వినియోగం తాగునీటికేనని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి స్పష్టం చేశారు.

తాగు నీటికే సిద్ధాపురం
సిద్ధాపురం చెరువు నుంచి విడుదలవుతున్న కృష్ణా జలాలను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే బుడ్డా

వైసీపీ నాయకుల మాటలు నమ్మి నష్టపోకండి

ఎల్‌నినో ప్రభావాన్ని రైతులు అర్థం చేసుకోవాలి

శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి

ఆత్మకూరు, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది సిద్ధాపురం చెరువు జలాల వినియోగం తాగునీటికేనని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం ఆయన వెలుగోడు జలాశయం నుంచి సిద్ధాపురం చెరువుకు జరుగుతున్న నీటి విడుదలను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు ఆయన్ని కలిసి పంటలను సాగుచేసేందుకునేందుకు నీటి విడుదల జరపాలని కోరగా ఎల్‌నినో పరిస్థితులను రైతులకు వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎల్‌నినో విపత్తు వచ్చే ఏడాది జూలై వరకు ఉంటుందని చెప్పారు. ఈ నేపథ్యంలో శ్రీశైల జలాశయం నుంచి వెలుగోడుకు చేరిన కృష్ణాజలాలను సిద్ధాపురం చెరువులోకి విడుదల చేస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే సిద్ధ్దాపురం చెరువు నుంచి కాల్వల ద్వారా ఆయా గ్రామాల చెరువులకు, వాగులు, వంకలకు నీటి విడుదల చేస్తామని వివరించారు. ఈ నీటిని రైతులు ఎట్టి పరిస్థితుల్లో పంటల సాగు అవసరాలకు వాడవద్దని సూచించారు. కేవలం తాగునీటి అవసరాల కోసమే నీటిని విడుదల చేస్తున్నామన్న విషయాన్ని రైతులు గుర్తించుకోవాలని చెప్పారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వైసీసీ నాయకులు చేస్తున్న డ్రామాలను రైతులు నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు. ఆయన వెంట టీడీపీ నాయకులు కంచర్ల గోవిందరెడ్డి, రవీంద్రబాబు, శివప్రసాద్‌రెడ్డి, అబ్దుల్లాపురం బాషా, మల్లికార్జునరెడ్డి, ఇరిగేషన్‌ అధికారులు ఉన్నారు.

Updated Date - Sep 06 , 2026 | 11:45 PM