Share News

2029 ఎన్నికల్లో మహిళలకు 33శాతం సీట్లు

ABN , Publish Date - May 28 , 2026 | 04:45 AM

పార్లమెంటులో మహిళా బిల్లు పెడితే ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి. మన స్త్రీ శక్తికి మరింత బలం ఇవ్వాలని చూస్తే దానికి ప్రతిపక్షాలు అడ్డుపడ్డాయి.

2029 ఎన్నికల్లో మహిళలకు 33శాతం సీట్లు

  • మహానాడులో చరిత్రాత్మక తీర్మానం

  • పార్లమెంటు బిల్లుతో సంబంధం లేకుండా 2029 ఎన్నికల్లో 33శాతం సీట్లు వారికిద్దాం: లోకేశ్‌

  • ఇది మా సంకల్పం.. బాధ్యత.. కమిట్‌మెంట్‌

  • మహిళలు కేవలం లబ్ధిదారులుగా మిగిలిపోకూడదు

  • వారు విధాన నిర్ణేతలు కావాలి.. ఇదే టీడీపీ లక్ష్యం

  • చంద్రబాబులో 25 ఏళ్ల కుర్రాళ్లు ముగ్గురున్నారు

  • వైసీపీ డేట్‌ ఫిక్స్‌ చేస్తే అభివృద్ధి, సంక్షేమంపై చర్చకు రెడీ

  • బాబాయ్‌ని గొడ్డలితో చంపింది నిజం కాదా?

  • తల్లిని ఇంటి నుంచి బయటకు గెంటడం, చెల్లికి అన్యాయం చేసి ఆస్తులు కొట్టేసింది నిజం కాదా?

  • అందుకే మీది గొడ్డలి పార్టీ: లోకేశ్‌

  • గొడ్డలి పార్టీ అంటే సైకోకు కోపం వచ్చిందట. మాది గూగుల్‌.. మీది గొడ్డలి. మాది ఫైటర్‌ జెట్స్‌.. మీది ఫ్యాక్షన్‌. మాది కియా.. మీది కిడ్నాప్‌. బాబాయిని చంపింది గొడ్డలితో కాదా? తల్లిని ఇంటి నుంచి బయటకు గెంటింది నిజం కాదా? చెల్లికి అన్యాయం చేసి ఆస్తులు కొట్టేసింది నిజం కాదా? అందుకే గొడ్డలి పార్టీ అంటున్నాం.

- లోకేశ్‌

  • మహానాడు తొలి రోజే సంచలనం.. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ కల్పించే బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందినా.. పొందకపోయినా.. టీడీపీ 2029 ఎన్నికల నుంచి మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ అమలు చేస్తుందని యువనేత, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ లోకేశ్‌ చేసిన ప్రకటనకు అనూహ్య స్పందన వచ్చింది. మహానాడులో ఇది ప్రధాన ఆకర్షణగా నిలవడమే గాక.. మహిళల్లో పెద్దఎత్తున హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. మరోవైపు వైసీపీపై టీడీపీ అధినేత చంద్రబాబు పంచ్‌లతో విరుచుకుపడి శ్రేణుల్లో కొత్త జోష్‌ నింపారు. హాజరులోనూ మహానాడు రికార్డులు సృష్టించింది. రాష్ట్రవ్యాప్తంగా 1875 క్లస్టర్లలో 7.28 లక్షల మంది హాజరయ్యారు. పార్టీకి విరాళాలూ వెల్లువెత్తాయి.

అమరావతి, మే 27 (ఆంధ్రజ్యోతి): ‘పార్లమెంటులో మహిళా బిల్లు పెడితే ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి. మన స్త్రీ శక్తికి మరింత బలం ఇవ్వాలని చూస్తే దానికి ప్రతిపక్షాలు అడ్డుపడ్డాయి. పార్లమెంటులో బిల్లు పాస్‌ అయినా, కాకపోయినా మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలి. 2029 సార్వత్రిక ఎన్నికల్లో 33 శాతం సీట్లు మహిళలకు ఇవ్వాలి. ఈ పవిత్ర మహానాడు వేదిక నుంచి ఈ ప్రతిపాదన చేస్తున్నా’ అని టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి లోకేశ్‌ ప్రకటించారు. ఈ చరిత్రాత్మక తీర్మానంతో మహానాడు వేదిక చప్పట్లతో మార్మోగింది. బుధవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రారంభమైన మహానాడులో లోకేశ్‌ మాట్లాడారు. ‘2029 సార్వత్రిక ఎన్నికల్లో మహిళలకు 33 శాతం సీట్లను కేటాయించాలి. ఇది భారతదేశ భవిష్యత్తు పట్ల టీడీపీకి ఉన్న నిబద్ధత. మనకు మరింత మంది మహిళా చట్టసభ సభ్యులు కావాలి. మహిళా విధాన నిర్ణేతలు కావాలి. టీడీపీ భవిష్యత్తును మహిళలు భుజం భుజం కలిపి నడిపిస్తారు. ఇది మా సంకల్పం.. బాధ్యత.. కమిట్‌మెంట్‌’ అని అన్నారు.

11.jpg


మహిళా సాధికారతకు ప్రాధాన్యం

భారత రాజకీయాల్లో తదుపరి శకం మహిళా నాయకత్వానిదే కావాలని తాను బలంగా విశ్వసిస్తున్నానని లోకేశ్‌ అన్నారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లును తీసుకురావడం ద్వారా ఎన్డీయే ఒక చరిత్రాత్మక అడుగు వేసిందన్నారు. ‘మహిళలు కేవలం లబ్ధిదారులుగా మిగిలిపోకూడదు. నిర్ణయాలు తీసుకునేవారుగా మారాలి. దురదృష్టవశాత్తు ప్రతిపక్ష పార్టీలు మహిళా బిల్లును తిరస్కరించి, మహిళా సాధికారతకు అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నించాయి. ఎన్నికల సమయంలో చాలా పార్టీలు మహిళా సాధికారత గురించి మాట్లాడుతాయి. ఎన్నికల తర్వాత మహిళలను మర్చిపోతాయి. కానీ టీడీపీ ఆచరణలో మహిళా సాధికారతను విశ్వసిస్తోంది. మహిళలను అవమానపరిచే మాటలు ఎవరూ మాట్లాడకూడదు. దీనికోసం పోరాటం మన నుంచే మొదలుకావాలి’ అని వివరించారు.

టీడీపీలో కార్యకర్తే అధినేత

‘టీడీపీలో కార్యకర్తే అధినేత. 2019 నుంచి 2024 వరకు పుసుపు సైన్యం చేసిన పోరాటం ఒక చరిత్ర. తోట చంద్రయ్య, అంజిరెడ్డి తాత, మంజుల, చెన్నుపాటి గాంధీ.. వీరంతా మనకు స్ఫూర్తి. మన అధినేతను 53 రోజులు అక్రమంగా అరెస్టు చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారంతా రోడ్లపైకి వచ్చారు. అది మన క్రెడిబిలిటీ’ అని అన్నారు.

అభివృద్ధి, సంక్షేమంపై చర్చకు రెడీ

‘కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. ఎవరూ ఇవ్వని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని.. అభివృద్ధి వికేంద్రీకరణ మన విధానం. దేశవ్యాప్తంగా వచ్చే పెట్టుబడుల్లో ఈ రోజు 25 శాతం ఏపీకి వస్తున్నాయి. నేను టీమ్‌11 కెప్టెన్‌ కు ఆఫర్‌ ఇస్తున్నా.. సమయం, తేదీ మీరు ఫిక్స్‌ చేయండి. సంక్షేమం, అభివృద్ధిపై చర్చకు నేను రెడీ. సైకో హయాంలో బీసీలు, దళితులు, మైనారీటీలపై జరిగిన దాడులను మనం మర్చిపోవద్దు’ అని సూచించారు.


ఫేక్‌ ప్రాపగాండను తిప్పికొట్టాలి

‘నిజం గడప దాటే ముందే అబద్ధం ప్రపంచం చుట్టి వస్తుంది. బాబాయిని చంపి కత్తి చంద్రబాబు చేతిలో పెట్టారు. వైసీపీ ఫేక్‌ ప్రాపగాండను గట్టిగా తిప్పికొట్టాలి. ఇప్పుడు రోజుకో కుట్రతో వస్తున్నారు. తాజాగా డీఎస్సీ గురించి మాట్లాడుతున్నారు. సైకో నీది టెన్త్‌ క్లాస్‌ పేపర్‌ కొట్టేసిన చరిత్ర.. నాది స్టాన్‌ఫోర్డు హిస్టరీ. టీచర్లను లిక్కర్‌ షాపుల ముందు నిలబెట్టిన హిస్టరీ నీది.. టీచర్లను శిక్షణ కోసం సింగపూర్‌ పంపిన హిస్టరీ నాది. 5 సంవత్సరాల్లో ఒక్క టీచర్‌ పోస్టు భర్తీ చేయని హిస్టరీ నీది.. 16,347 టీచర్‌ పోస్టులు ఒక్కసారిగా భర్తీ చేసిన హిస్టరీ నాది’ అని లోకేశ్‌ అన్నారు.

కాలానికి అనుగుణంగా మారాలి

‘టీడీపీ సిద్ధాంతాల్లో బలమైన పునాది ఉంది. మారుతున్న కాలానికి తగ్గట్టు విధానాల్లో కూడా మార్పు రావాలి. గత మహానాడులో ఆరు సూత్రాలు ప్రకటించాం. మనం చేసే ప్రతి పనిలో అవి గుర్తుండాలి. అవి.. తెలుగుజాతి విశ్వఖ్యాతి, యువగళం, స్త్రీశక్తి, పేదల సేవలో, సామాజిక న్యాయం, అన్నదాతకు అండగా, కార్యకర్తే అధినేత. పార్టీలో మార్పుల కోసం ఎక్కువ పోరాడుతాను. గ్రామస్థాయి నాయకుడు పొలిట్‌బ్యూరోకి రావాలి. అప్పుడే పార్టీ బలంగా ఉంటుంది’ అని పేర్కొన్నారు.

టీమ్‌ 11కి బ్యాటింగ్‌ తప్పదు

‘ఆఫ్‌లైన్‌ అయినా, ఆన్‌లైన్‌ అయినా, హైబ్రిడ్‌ అయినా మహానాడు అంటేనే మాస్‌ జాతర. ప్రతి కార్యకర్త కాలర్‌ ఎగరేసి నేను తెలుగువాడిని, నాది తెలుగుదేశం పార్టీ అని చెప్పుకొనే వేదిక. హైబ్రిడ్‌ మోడల్‌ అనగానే టీమ్‌11 సంబరాలు చేసుకున్నారంట. ఆఫ్‌లైన్‌ అయినా, ఆన్‌లైన్‌ అయినా, హైబ్రిడ్‌ అయినా టీమ్‌ 11కి బ్యాటింగ్‌ తప్పదు’ అని లోకేశ్‌ అన్నారు.


8.jpg

ఎన్టీఆర్‌ టు సీబీఎన్‌

‘విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్‌ దేశానికి లెజండ్‌. తెలుగువారి ఆత్మగౌరవం, తెలుగువారి పౌరుషం ఎన్టీఆర్‌. సినిమాల్లో కానీ, రాజకీయాల్లో కానీ ఆయన ట్రెండ్‌ ఫాలో అవ్వలేదు. ట్రెండ్‌ సెట్‌ చేశారు. ఆయన రికార్డులు బద్దలు కొట్టడం ఎవరివల్లా సాధ్యం కాదు. స్త్రీశక్తిని మొదట గుర్తించింది ఎన్టీఆర్‌. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చింది, మహిళల కోసం ప్రత్యేకంగా పద్మావతి యూనివర్సిటీ పెట్టింది, మహిళలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇచ్చింది ఎన్టీఆర్‌. ఎన్టీఆర్‌ తర్వాత తెలుగుజాతికి ప్రపంచవ్యాప్తంగా గౌరవం తీసుకొచ్చింది సీబీఎన్‌. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ఆ మూడు అక్షరాలు చెబితే గౌరవం దక్కుతుంది. చంద్రబాబులో 25 ఏళ్ల కుర్రాళ్లు ముగ్గురు ఉన్నారు. ఆయన జెట్‌ స్పీడులో వెళ్తుంటారు. ఆయన స్పీడ్‌ అందుకోవడానికి మనం కష్టపడుతున్నాం. స్త్రీశక్తిని మహాశక్తిగా మార్చిన ఘనత సీబీఎన్‌దే. మహిళలకు విద్య, ఉద్యోగాల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించారు. ఎవరైనా మహిళల జోలికి వస్తే అదే వారికి లాస్ట్‌ డేట్‌ అని చెప్పిన దమ్మున్న నాయకుడు మన సీబీఎన్‌.

మనం గేర్‌ మార్చాలి

‘మన ప్రభుత్వం వచ్చి రెండేళ్లు కావస్తోంది. ఇక నుంచి మనం గేర్‌ మార్చాలి. మిషన్‌ మోడ్‌లో పనిచేయాలి. ప్రతి ఎన్నికలోనూ మనమే గెలవాలి. అదే మన గోల్‌. ప్రజల్లోకి వెళ్దాం. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి. ప్రజలకు సేవ చేయడం మన ధ్యేయం. మనం అనుకున్నది సాధించాలంటే ప్రభుత్వ కొనసాగింపు ముఖ్యం’ అని లోకేశ్‌ దిశానిర్దేశం చేశారు.

Updated Date - May 28 , 2026 | 05:35 AM