రిజర్వేషన్లపై నిర్ణయాధికారం రాష్ట్రాలకు ఉంది!
ABN , Publish Date - Aug 26 , 2026 | 03:45 AM
స్థానిక పరిస్థితుల ఆధారంగా 50శాతానికి మించి రిజర్వేషన్ ఇవ్వడంపై నిర్ణయం తీసుకునే అధికారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని రాష్ట్ర సర్కారు పేర్కొంది
స్థానిక పరిస్థితుల ఆధారంగా 50 శాతం కంటే ఎక్కువ ఇవ్వొచ్చు: ప్రభుత్వం
రాజ్యాంగ ధర్మాసనం సైతం సమర్థించింది
రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదన్న నియమం మార్చడానికి వీల్లేనిది కాదు
తదుపరి విచారణ వరకు నోటిఫికేషన్ రాదు.. అఫిడవిట్‌కు టైమివ్వండి
పంచాయతీరాజ్, పురపాలక శాఖల తరఫు సీనియర్ న్యాయవాది అభ్యర్థన
స్థానిక పరిస్థితుల ఆధారంగా 50 శాతం కంటే ఎక్కువ ఇవ్వొచ్చు: ప్రభుత్వం
అమరావతి: స్థానిక పరిస్థితుల ఆధారంగా 50శాతానికి మించి రిజర్వేషన్ ఇవ్వడంపై నిర్ణయం తీసుకునే అధికారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని రాష్ట్ర సర్కారు పేర్కొంది. 50శాతానికి మించి రిజర్వేషన్లు కల్పించడాన్ని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కూడా సమర్థించిందని తెలిపింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ కేటాయిస్తూ రాష్ట్రప్రభుత్వం జారీ చేసిన జీవోలను సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యం(పిల్)పై మంగళవారం హైకోర్టు విచారణ జరిపింది. రాష్ట్ర పంచాయతీరాజ్, పురపాలక శాఖల తరఫున సీనియర్ న్యాయవాది దేవదత్ కామత్ వాదనలు వినిపించారు. రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదనే నియమం మార్చడానికి వీల్లేనిదేమీ కాదన్నారు. పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేస్తామని, సమయం ఇవ్వాలని కోరారు. తదుపరి విచారణ వరకు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం లేదన్నారు. ఈ వివరాలు పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం పిల్‌పై తదుపరి విచారణను సెప్టెంబరు 2వ తేదీకి వాయిదా వేసింది. బీసీలకు 34శాతం రిజర్వేషన్ కల్పనను ఏ విధంగా సమర్థించుకుంటారో వివరిస్తూ అఫిడవిట్ వేయాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్, జస్టిస్ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు ఇచ్చింది. పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం, 33.33 శాతం రిజర్వేషన్లు ఖరారు చేస్తూ పంచాయతీరాజ్, పురపాలకశాఖలు జారీ చేసిన జీవో 105, 1065లను రాజ్యాంగ విరుద్ధమైనవిగా ప్రకటించాలని, వాటిని రద్దు చేయాలని కోరుతూ న్యాయవాది తాండవ యోగేశ్ దాఖలు చేశారు.
మంగళవారం విచారణలో ఆయన తన వాదనలు వినిపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కల్పించే రిజర్వేషన్ 50శాతానికి మించడానికి వీల్లేదని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం స్పష్టమైన తీర్పు ఇచ్చిందన్నారు. బిర్రు ప్రతా్‌పరెడ్డి వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో బీసీ రిజర్వేషన్ 34 శాతానికి తగ్గకుండా ఉండాలని 2019లో ప్రభుత్వం జారీ చేసిన జీవో 176ని హైకోర్టు కొట్టివేసిందని.. ఈ తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్రప్రభుత్వం వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కూడా కొట్టివేసిందని.. దీంతో 50 శాతం లోపే రిజర్వేషన్లు ఉండాలన్న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అంతిమంగా మారిందని వివరించారు. అఫిడవిట్ వేసేందుకు పంచాయతీరాజ్, పురపాలక శాఖల తరఫు సీనియర్ న్యాయవాది సమయం కోరుతున్న నేపథ్యంలో తదుపరి విచారణ వరకు రిజర్వేషన్లు ఖరారు చేయకుండా ఆదేశాలివ్వాలని కోరారు. ధర్మాసనం స్పందిస్తూ.. తదుపరి విచారణ వరకు నోటిఫికేషన్ వెలువడదని సీనియర్ న్యాయవాది చెబుతున్నారని గుర్తుచేసింది. విచారణను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
ఈ వార్తలను కూడా చదవండి
పెండింగ్ పనులను పూర్తి చేయండి
శ్రీశైలంలో విషాదం ఐదుగురి ఆత్మహత్య