జీజీహెచ్‌లో రూ.14కోట్లతో అభివృద్ధి పనులు
ABN , Publish Date - Aug 26 , 2026 | 03:01 AM
ఒంగోలులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్)లో రూ.14కోట్లతో చేపట్టనున్న పనులకు ఈనెల 28న మంత్రి నారా లోకేష్ చేతులమీదుగా భూమిపూజ జరుగుతుందని సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్.మాణిక్యరావు తెలిపారు.
28న భూమిపూజ చేయనున్న మంత్రి లోకేష్
హాజరుకానున్న ప్రజాప్రతినిధులు, కలెక్టర్
వివరాలను వెల్లడించిన సూపరింటెండెంట్ డాక్టర్ మాణిక్యరావు
ఒంగోలు కార్పొరేషన్, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి) : ఒంగోలులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్)లో రూ.14కోట్లతో చేపట్టనున్న పనులకు ఈనెల 28న మంత్రి నారా లోకేష్ చేతులమీదుగా భూమిపూజ జరుగుతుందని సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్.మాణిక్యరావు తెలిపారు. మంగళవారం తన చాంబర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. రోగులకు మెరుగైన సేవలు, వారి సహాయకులకు అవసరమైన సౌకర్యాలు అందించే దిశగా రూ.14కోట్లతో పనులు చేపడుతున్నట్లు చెప్పారు. ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ ప్రత్యేక చొరవతో ఈ అభివృద్ధి పనులకు అవసరమైన నిధులు మంజూరయ్యాయని తెలిపారు. జీజీహెచ్‌కు రోగుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ఓపీ రిజిస్ట్రేషన్ బ్లాక్, రోగుల సహాయకులకు వెయిటింగ్ హాలు, మార్చురీ వద్ద సహాయకులకు షెడ్ నిర్మిస్తున్నామని తెలిపారు. ఆసుపత్రిలోని అన్ని బ్లాకులకు సమానంగా నీరు అందించేందుకు 90 కేఎల్‌డీ సామర్థ్యంతో ఓహెచ్‌బీఆర్, ఆర్‌సీసీ కలెక్టింగ్ సంప్ నిర్మించనున్నట్లు తెలిపారు. పెరుగుతున్న వాహనాల సంఖ్యకు అనుగుణంగా ఆసుపత్రి ఆవరణంలో వివిధ ప్రాంతాలలోవాహనాలు పార్కింగ్ షెడ్‌లు, నర్సింగ్ విద్యార్థులకు కొత్త హాస్టల్ భవనం నిర్మాణం పూర్తయ్యే వరకు తాత్కాలికంగా వసతి కోసం 4వ అంతస్తులోని బ్లాక్ ఏ1 ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. వీటితోపాటు 2008లో నిర్మించిన ఆసుపత్రి భవనానికి అవసరమైన అభివృద్ధి, నిర్వహణ పనుల్లో భాగంగా మెయిన్ బిల్డింగ్ ముందు భాగంలో ఏసీపీ క్లాడింగ్, పోర్టుకో ఫ్లోరింగ్ మార్పు, ఓపీ ప్రాంతం పునరుద్ధరణ, నాలుగు ఓటీఎస్ ప్రాంతాలకు రూఫింగ్ వంటి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. అందుకుగాను రూ.14కోట్లతో అంచనాలు రూపొందించామన్నారు. డీఎంఎఫ్ నిధుల నుంచి రూ.10 కోట్లు మంజూరయ్యాయని, మిగిలిన రూ. 4కోట్లు జీజీహెచ్‌లో అందుబాటులో ఉన్న నిధులను సమకూర్చుతున్నామని తెలిపారు. విలేకరుల సమావేశంలో డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నామినేని కిరణ్‌కుమార్, సీఎస్‌ఆర్‌ఎంవో డాక్టర్ మాధవీలత పాల్గొన్నారు.